rajaka
-
తిరుపతిలో రజక సంఘాల నిరసన
-
హోంమంత్రి దృష్టికి ‘కొండపల్లి’ వివాదం
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు. వివాదం ఇదీ... ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు. -
వెలివేతపై నాయీ బ్రాహ్మణుల ఆగ్రహం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో నాయీ బ్రాహ్మణులు, రజకులపై గ్రామ బహిష్కరణ విధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఊరు నుంచి వెలివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన గ్రామ పెద్దలపై చట్టపరంగా తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన నాయీ బ్రాహ్మణులు, రజకులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. తమ వారికి న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఆందోళనలకు సిద్ధం: రజకులు రజకులకు న్యాయం జరగని పక్షంలో తాము కూడా రాష్ట్ర ఆందోళనలు చేపడతామని చాకలి ఎస్సీ సాధన సమితి ప్రకటించింది. తమ సంఘీయులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సాంఘిక దురాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. వాస్తవం లేదు: గ్రామస్తులు కొండపల్లిలో రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులను గ్రామం నుంచి బహిష్కంచలేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుని సీఐ రమణమూర్తి, తహశీల్దార్ సాయన్నకు ఈ మేరకు తెలిపారు. గ్రామంలోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు గ్రామం నుంచి ఎలాంటి సహకారం అందించవద్దని తీర్మానించామే తప్ప గ్రామం నుంచి బహిష్కరించలేదని వారు చెప్పడం గమనార్హం. ఎటువంటి సహాయం అందించవద్దని చెప్పడం వెలివేత కాకపోతే ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. -
’రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి’
-
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే
-చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలి -రజక చైతన్య సేవాసంస్థ డిమాండ్ కాకినాడ రూరల్ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఏపీ రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. ఆదివారం ఇంద్రపాలెంలోని రజక సంక్షేమ సంఘ భవనంలో జరిగిన జిల్లా రజక చైతన్య సేవా సంస్థ సమావేశంలో పలువురు నాయకులు ప్రసంగించారు. ఇప్పటికే 17 రాష్ట్రాల్లోనూ, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రజకులను ఎస్సీల్లో చేరుస్తామని వాగ్దానం చేశారని, అదే విధంగా గవర్నర్ నరసింహన్ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీల్లో చేర్చేందుకు ప్రకటన చేశారని నాయకులు గుర్తు చేశారు. గ్రామాల్లో రజకులు దుస్తులు ఉతికేందుకు ఉన్న చెరువులను ఆయా గ్రామపంచాయతీలు వేర్వేరు కులాలకు లీజుకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాక పూర్తిగా రజక సంఘాలకే ఆ చెరువులను కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్ర రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడు కాకినాడ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం రజకులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాట వేస్తోందని నిరసించారు. రజకులను ఎస్సీలలో చేర్చే విషయమై గ్రామాల వారీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు రజకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో భాగంగా మొదట జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. జిల్లా అధ్యక్షుడు వాడపర్తి కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురమళ్ల రాజబాబు, గౌరవాధ్యక్షుడు ముంగళ్ల నాగసత్యనారాయణ తదితరులు సంఘ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఐలమ్మ.. తెలంగాణ ఐకాన్
పద్మా దేవేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాధన ఉద్యమానికి ఒక ఐకాన్‌గా నిలిచారని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో ఎంతోమంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. త్యాగం, సాహసం,ఓర్పునకు ఆమె మారుపేరన్నారు. ఐలమ్మ ఆశయాలు, ఆదర్శాల కొనసాగించాల్సిన అవసరముందన్నారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర రజక సమాజం, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిట్యాల(చాకలి) ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలం తా ముందుకు నడిచారన్నారు. అమరుల స్ఫూర్తితో ట్యాంక్‌బండ్‌పై స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ జడ్జి జె.పి.జీవన్, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బుల్లి తెర డెరైక్టర్ నాగబాల సురేశ్‌కుమార్ రూపొందించిన ‘వీరనారి చాకలి ఐలమ్మ’ లఘుచిత్రం సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, రజక సమాజం రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
రజక కుటుంబాల బహిష్కరణ
ముత్యాలమ్మకు సల్లకుండ పట్టలేమన్నందుకు గ్రామపెద్దల దుశ్చర్య నేలకొండపల్లి: ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో పది రజక కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నట్లు స్థానిక ఊరి పెద్దలు టమకా వేయించి అవమానించారు. బాధితుల కథనం ప్రకారం..ఆదివారం ముత్యాలమ్మ తల్లి పండుగ జరుపుకునేందుకు ఏర్పాట్ల కోసం శనివారం గ్రామంలో పెద్దలు సమావేశం నిర్వహించి..ప్రతిఏటా మాదిరి ఇంటింటికీ తిరిగి సల్లకుండను పట్టాల్సిందిగా రజకులను కోరగా..ఉన్న పది కుటుంబాల్లోని వృద్ధులు తిరగలేరని, పిల్లలు చదువుకుంటుండడంతో ఈ పనిచేయలేరని వారు తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన పెద్దలు..అలా అయితే అమ్మవారి ఆలయం వద్ద జీవాలను కూడా కోయొద్దని, శంకరగిరితండా గిరిజనులతో కోయించారు. ఇకపై..ఈ రజకులతో గ్రామస్తులు ఎలాంటి పనులు చేయించుకోవద్దని, అలా చేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని టమకా వేయించారు. కొందరు రజక మహిళలు బట్టలు ఉతికేందుకు ఇళ్లకు వెళ్లగా వెనక్కి పంపించేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సాంఘిక బహిష్కరణ చేసి..ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని రజకులు ఆంజనేయులు, బిక్షం, బి.వెంకటేశ్వర్లు, పుల్లయ్య, ఉపేందర్, రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. -
ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు
– రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు కర్నూలు(అర్బన్): రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు హెచ్చరించారు. సోమవారం ఉదయం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలకు కార్పొరేషన్లు, బీసీ కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బీసీ కులాలపై చిన్న చూపు చూస్తోందన్నారు. అగ్రకులాలకు చెందిన కార్పొరేషన్లకు వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్న ప్రభుత్వం బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లతో సరిపెడుతోందన్నారు. కాపుల సంక్షేమం పట్ల పూర్తి స్థాయిలో స్పందిస్తున్న ప్రభుత్వానికి రజకుల సంక్షేమం పట్టడం లేదన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ఆలస్యం జరిగితే.. కనీసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కూడా కల్పించాలన్నారు. నవంబర్ 27న రజక ఆత్మ గౌరవ సభ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకుపోయేందుకు నవంబర్ 27న విజయవాడలో ఐదు లక్షల మంది రజకులతో ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు అంజిబాబు తెలిపారు. సభకు ముఖ్యమంత్రితో పాటు అందరు ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. హాజరు కాని నాయకులకు భవిష్యత్తులో రజకులు ఓట్లు వేయబోరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రజకులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, తమను గుర్తించిన పార్టీలకే మద్దతు ఇస్తామన్నారు. 10న రజక జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక ఈ నెల 10న స్థానిక బీసీ భవన్లో ఉదయం 10 గంటలకు రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రజకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆదోనిలో ధోబీఘాట్లకు కేటాయించిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ ఉపాధ్యక్షుడు సీపీ వెంకటేష్, వాడాల నాగరాజు, అఖిల భారత ధోబీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా నాయకులు చంద్రశేఖర్, వి.శ్రీనివాసులు, గణేష్, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.