గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.
‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.
ఆ ఏడాది చివరిలో సాలిగావ్‌కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్‌లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.
ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.
పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.
ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.
ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment