
అంకిత్ ఒక ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్. చిన్న అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. చిన్నప్పటి నుంచీ పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన, భయం. ఎలాగోలా పదోతరగతి పూర్తయిందనిపించాడు. ఆ తర్వాత ఇంట్లోనే కూర్చుని గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ కస్టమర్లతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాడు. బయటకు వెళ్తే తన గురించి తప్పుగా అనుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమోనని భయపడుతుంటాడు. తనపై ఇతరులు కుట్రలు చేస్తున్నారని నమ్ముతుంటాడు.
ఇటీవల.. తాను ఎదుటివారి మనసులోని మాటలను ఎంతదూరం నుంచైనా వినగలనని, తాను ఆత్మలతో మాట్లాడగలనని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడోననే భయంతో సన్నిహితుల అతన్ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. అంకిత్ డ్రెస్.. పలు రంగులతో ముక్కలు ముక్కలుగా విచిత్రంగా ఉంది. ప్రవర్తన కూడా అసాధారణంగా ఉంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేదు.
మాటల్లో క్లారిటీ లేదు. చెప్పేది పూర్తి చేయకుండానే మరో అంశంలోకి వెళ్లి పోతున్నాడు. సైకోడయాగ్నసిస్ అనంతరం అతను స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణైంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులను అందరూ విచిత్ర వ్యక్తులని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా టీనేజ్‌లో బయటపడుతుంది.
దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరం..
పర్సనాలిటీ డిజార్డర్స్‌కు మందులు లేవు. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరమవుతుంది. దాంతోపాటు డిజార్డర్ ఉన్నవారు తమ జీవనశైలిలో, కోపింగ్ స్ట్రాటజీస్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చు.
► స్కిజోటైపల్ వ్యక్తిత్వ లక్షణాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మొదటి అడుగు.
► పరిచయస్తులతో కొద్దికొద్దిగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు చూపు కలిపేందుకు, పదిమందిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలి
► పెద్ద లక్ష్యాలను చిన్నవిగా, సాధించగలిగేవిగా విభజించుకోవాలి
► ధ్యానం, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను దినచర్యలో భాగం చేసుకోవాలి
► ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుభవాలను పంచుకోవాలి
► క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం, తగినంత నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి
► మానసిక ఆరోగ్యం మీద శారీరక ఆరోగ్యం సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది
► ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగాన్ని వెంటనే ఆపేయాలి. అవి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. చికిత్స ప్రభావానికి అంతరాయం కలిగిస్తాయి
► ఇవన్నీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ పూర్తి అంచనా, పర్సనల్ ట్రీట్‌మెంట్ ప్లాన్ కోసం సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి
► వక్రీకరించిన ఆలోచనా విధానాలను సవరించడం, ఆందోళనను తగ్గించడం, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో CBT ప్రభావవంతంగా ఉంటుంది
► SPDకి సంబంధించిన ఇతర లక్షణాలను తగ్గించడానికి అవసరమైతే సైకియాట్రిస్ట్ సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది.
భావోద్వేగాలు కనిపించవు..
PD ఉన్నవారు బాల్యంలో ఎవరితోనూ కలవకపోవడం, స్కూల్లో అండర్ పెర్పార్మెన్స్ ఉండవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇతరులు బెదిరించవచ్చు, ఆటపట్టించవచ్చు. టీనేజ్‌లో ఒంటరితనం, సామాజిక ఆందోళన అధికస్థాయిలో ఉంటుంది. ఈ కింది లక్షణాల్లో ఐదు, అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటాయి.
► ఒంటరిగా ఉండటం, కుటుంబ సభ్యులు తప్ప సన్నిహితులు లేకపోవడం..
► అసలు ఎమోషన్స్ లేకపోవడం లేదా పరిమిత, అనుచితమైన భావోద్వేగ ప్రతిస్పందనలుండటం..
► పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన..
► ప్రమాదంకాని.. లేని పరిస్థితులను, సందర్భాలను కూడా తప్పుగా అర్థం చేసుకోవడం..
► విచిత్రమైన, అసాధారణమైన ఆలోచనలు, నమ్మకాలు లేదా ప్రవర్తన..
► ఇతరుల విధేయత గురించి నిరంతరం సందేహాలు, అనుమానాస్పద లేదా మతిస్థిమితం లేని ఆలోచనలు..
► టెలిపతి వంటి ప్రత్యేక శక్తులపై నమ్మకం..
► ఎదురుగా లేని వ్యక్తులు కూడా ఉన్నట్లుగా భ్రమలు..
► చిత్రవిచిత్రంగా దుస్తులు ధరించడం, చిందరవందరగా కనిపించడం..
► అస్పష్టంగా, అసాధారణంగా మాట్లాడటం, విచిత్రమైన ప్రసంగశైలి..
స్కిజోఫ్రెనియా అని పొరపాటు
వ్యక్తిత్వం మనల్ని ప్రత్యేకంగా నిలిపే ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనల కలయిక. మెదడు పనితీరు, జన్యుశాస్త్రం, పర్యావరణ ప్రభావాలు, చూసి నేర్చుకున్న ప్రవర్తనల వల్ల వ్యక్తిత్వంలో లోపాలు ఏర్పడవచ్చు. PD ఉన్నవారిని స్కిజోఫ్రేనియా అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ PDలో భ్రమలు లేదా భ్రాంతులతో సైకోటిక్ ఎపిసోడ్లు క్లుప్తంగా ఉంటాయి. భ్రమలు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరు. స్కిజో ఫ్రేనియా లాంటి మానసిక రుగ్మత ఉన్న బంధువు ఉంటే PD వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆత్మహత్య ఆలోచనలు, పని, పాఠశాల, సంబంధబాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు ఉంటాయి.
సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com