Personality Disorder
-
విచిత్రమైన మాటలు, దుస్తులు, ప్రవర్తన.. A సినిమాలో ఉపేంద్ర గుర్తున్నాడా?
అంకిత్ ఒక ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్. చిన్న అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. చిన్నప్పటి నుంచీ పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన, భయం. ఎలాగోలా పదోతరగతి పూర్తయిందనిపించాడు. ఆ తర్వాత ఇంట్లోనే కూర్చుని గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ కస్టమర్లతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాడు. బయటకు వెళ్తే తన గురించి తప్పుగా అనుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమోనని భయపడుతుంటాడు. తనపై ఇతరులు కుట్రలు చేస్తున్నారని నమ్ముతుంటాడు. ఇటీవల.. తాను ఎదుటివారి మనసులోని మాటలను ఎంతదూరం నుంచైనా వినగలనని, తాను ఆత్మలతో మాట్లాడగలనని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడోననే భయంతో సన్నిహితుల అతన్ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. అంకిత్ డ్రెస్.. పలు రంగులతో ముక్కలు ముక్కలుగా విచిత్రంగా ఉంది. ప్రవర్తన కూడా అసాధారణంగా ఉంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేదు. మాటల్లో క్లారిటీ లేదు. చెప్పేది పూర్తి చేయకుండానే మరో అంశంలోకి వెళ్లి పోతున్నాడు. సైకోడయాగ్నసిస్ అనంతరం అతను స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణైంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులను అందరూ విచిత్ర వ్యక్తులని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా టీనేజ్‌లో బయటపడుతుంది. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరం.. పర్సనాలిటీ డిజార్డర్స్కు మందులు లేవు. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరమవుతుంది. దాంతోపాటు డిజార్డర్ ఉన్నవారు తమ జీవనశైలిలో, కోపింగ్ స్ట్రాటజీస్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చు. ► స్కిజోటైపల్ వ్యక్తిత్వ లక్షణాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మొదటి అడుగు. ► పరిచయస్తులతో కొద్దికొద్దిగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు చూపు కలిపేందుకు, పదిమందిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలి ► పెద్ద లక్ష్యాలను చిన్నవిగా, సాధించగలిగేవిగా విభజించుకోవాలి ► ధ్యానం, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను దినచర్యలో భాగం చేసుకోవాలి ► ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుభవాలను పంచుకోవాలి ► క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం, తగినంత నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి ► మానసిక ఆరోగ్యం మీద శారీరక ఆరోగ్యం సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది ► ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగాన్ని వెంటనే ఆపేయాలి. అవి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. చికిత్స ప్రభావానికి అంతరాయం కలిగిస్తాయి ► ఇవన్నీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ పూర్తి అంచనా, పర్సనల్ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి ► వక్రీకరించిన ఆలోచనా విధానాలను సవరించడం, ఆందోళనను తగ్గించడం, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో CBT ప్రభావవంతంగా ఉంటుంది ► SPDకి సంబంధించిన ఇతర లక్షణాలను తగ్గించడానికి అవసరమైతే సైకియాట్రిస్ట్ సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది. భావోద్వేగాలు కనిపించవు.. PD ఉన్నవారు బాల్యంలో ఎవరితోనూ కలవకపోవడం, స్కూల్లో అండర్ పెర్పార్మెన్స్ ఉండవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇతరులు బెదిరించవచ్చు, ఆటపట్టించవచ్చు. టీనేజ్‌లో ఒంటరితనం, సామాజిక ఆందోళన అధికస్థాయిలో ఉంటుంది. ఈ కింది లక్షణాల్లో ఐదు, అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ► ఒంటరిగా ఉండటం, కుటుంబ సభ్యులు తప్ప సన్నిహితులు లేకపోవడం.. ► అసలు ఎమోషన్స్ లేకపోవడం లేదా పరిమిత, అనుచితమైన భావోద్వేగ ప్రతిస్పందనలుండటం.. ► పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన.. ► ప్రమాదంకాని.. లేని పరిస్థితులను, సందర్భాలను కూడా తప్పుగా అర్థం చేసుకోవడం.. ► విచిత్రమైన, అసాధారణమైన ఆలోచనలు, నమ్మకాలు లేదా ప్రవర్తన.. ► ఇతరుల విధేయత గురించి నిరంతరం సందేహాలు, అనుమానాస్పద లేదా మతిస్థిమితం లేని ఆలోచనలు.. ► టెలిపతి వంటి ప్రత్యేక శక్తులపై నమ్మకం.. ► ఎదురుగా లేని వ్యక్తులు కూడా ఉన్నట్లుగా భ్రమలు.. ► చిత్రవిచిత్రంగా దుస్తులు ధరించడం, చిందరవందరగా కనిపించడం.. ► అస్పష్టంగా, అసాధారణంగా మాట్లాడటం, విచిత్రమైన ప్రసంగశైలి.. స్కిజోఫ్రెనియా అని పొరపాటు వ్యక్తిత్వం మనల్ని ప్రత్యేకంగా నిలిపే ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనల కలయిక. మెదడు పనితీరు, జన్యుశాస్త్రం, పర్యావరణ ప్రభావాలు, చూసి నేర్చుకున్న ప్రవర్తనల వల్ల వ్యక్తిత్వంలో లోపాలు ఏర్పడవచ్చు. PD ఉన్నవారిని స్కిజోఫ్రేనియా అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ PDలో భ్రమలు లేదా భ్రాంతులతో సైకోటిక్ ఎపిసోడ్లు క్లుప్తంగా ఉంటాయి. భ్రమలు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరు. స్కిజో ఫ్రేనియా లాంటి మానసిక రుగ్మత ఉన్న బంధువు ఉంటే PD వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆత్మహత్య ఆలోచనలు, పని, పాఠశాల, సంబంధబాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు ఉంటాయి. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
మావాడు ఎవరితోనూ కలవడండీ
‘‘మావాడు చిన్నప్పటి నుంచీ ఎవరితోనూ కలవడు సర్. ఎప్పుడూ ఒంటరిగా తన పని తాను చేసుకుంటాడు. ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ వాడు ఏమాత్రం ఇంట్రెస్ట్ట్ చూపించడం లేదు. ఎవరినైనా ప్రేమించావా? అని అడిగితే అలాంటిదేం లేదంటాడు. సమస్య ఏమిటో అర్థం కావడం లేదు’’ ఆనందమూర్తి ఆవేదన. ఆయన చెప్పింది మొత్తం విన్నాక.. చేతన్‌తో మాట్లాడాలని చెప్పాను. అయితే మాట్లాడటానికి చేతన్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలా మొక్కుబడిగా మాట్లాడాడు. చిన్నప్పటి నుంచీ స్నేహితులెవరూ లేరని చెప్పాడు. ‘ఎందుకలా?’ అని అడిగితే ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’ అని సమాధానమిచ్చాడు. ‘గాళ్ ఫ్రెండ్స్?’ అని అడిగినా అదే సమాధానం. ‘మీరు ఎవరితో క్లోజ్‌గా ఉంటారు?’ అనే ప్రశ్నకు ‘ఎవ్వరితోనూ లేదు. నాతో నేనే’ అని చెప్పాడు. అతని మాటల్లో ఎలాంటి భావోద్వేగాలూ లేవు, ఫ్లాట్‌గా సాగాయి. తన తల్లి కూడా అలాగే ఉంటుందని అతని మాటల్లో తెలిసింది. అతనిది కేవలం సిగ్గు, బిడియం, మొహమాటం కాదని, ఇంట్రావర్ట్ కూడా కాదని అర్థమైంది. క్లినికల్ ఇంటర్వ్యూ, సైకో డయాగ్నసిస్ అనంతరం అతను ‘స్కిజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్’ (ఎస్సీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. మూడు నుంచి ఐదు శాతం వ్యక్తుల్లో ఈ రుగ్మత కనిపిస్తుంది. సైకోథెరపీతోనే పరిష్కారం.. పర్సనాలిటీ డిజార్డర్ అంటే వ్యక్తిత్వంలో లోపాలు రుగ్మతలా మారడం. వీటిని నయం చేయడానికి ఎలాంటి మందులూ లేవు. సైకోథెరపీ ద్వారానే సహాయం చేయగలం. కానీ ఎస్సీపీడీ ఉన్నవారికి ఇతరులతో సంబంధాలే ఇష్టం ఉండదు కనుక థెరపీకి కూడా ఆసక్తి చూపరు. కుటుంబ సభ్యులే తీసుకురావాల్సి వస్తుంది. ఎస్సీపీడీ పరిష్కారానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలను నిశితంగా పరిశీలించి, వారి ఆలోచనలు వారి చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఇతరులతో సంబంధాల ప్రాధాన్యం, ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తారు. సమస్య మూలాన్ని, కుటుంబ కారణాలను అర్థం చేసుకునేందుకు ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది. గ్రూప్ థెరపీ ద్వారా సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడవచ్చు. ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. ఒంటరితనమే ఇష్టం.. ఎస్సీపీడీ లక్షణాలు బాల్యంలో ఉన్నప్పటికీ టీనేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు స్కూల్లో, పనిలో, సామాజిక పరిస్థితుల్లో, ఇతర రంగాల్లో పనితీరును కష్టతరం చేస్తాయి. ఒంటరిగా పనిచేసే ఉద్యోగాలైతే ఫర్లేదు, లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రుగ్మత లక్షణాలు.. ♦ సన్నిహిత సంబంధాలను కోరుకోరు, ఆనందించరు. ♦ ఒంటరిగా ఉంటారు, పనులన్నీ ఒంటరిగా చేయాలనుకుంటారు. ♦ భావోద్వేగాలను వ్యక్తపరచడంలో, ప్రతిస్పందించడంలో కష్టపడతారు. ♦ లక్ష్యాలను చేరుకోవాలనే ఉత్సాహం ఉండదు. ♦ ఇతరుల ప్రశంసలు లేదా విమర్శలకు ప్రతిస్పందించరు. ♦ సరదా, సంతోషం, స్పందనలేని రాయిలా కనిపిస్తారు. ♦ లైంగిక సంబంధాలపై ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. బాల్యంలో నిర్లక్ష్యానికి గురయితే.. పర్సనాలిటీ డిజార్డర్లను గుర్తించడం కష్టం. వాటికి సరైన కారణాలను గుర్తించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎస్సీపీడీకి కూడా కారణమేమిటో తెలియదు. జన్యుపర సంబంధం ఉందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. భావోద్వేగాలను పట్టించుకోని వాతావరణం వల్ల ఈ రుగ్మతకు గురయ్యే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే, బాల్యంలో మానసికంగా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉండే తల్లిదండ్రులను కలిగి ఉండటం ఈ రుగ్మత ఏర్పడటానికి దోహదం చేస్తుంది. నిర్ధారణ కష్టం.. ఎస్సీపీడీతో సహా ఇతర వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించడం చాలా కష్టం, ఎందుకంటే వ్యక్తిత్వ క్రమరాహిత్యం ఉన్న చాలామంది వ్యక్తులు తమ ప్రవర్తన లేదా ఆలోచనా విధానంలో సమస్య ఉందని భావించరు. మీలో కానీ, మీ సన్నిహితుల్లో కానీ ఎస్సీపీడీ ఉందని భావించినప్పుడు ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి. వారు మీ బాల్యం, మానవ సంబంధాలు, పనిలో మీ ప్రవర్తనపై ప్రశ్నలడిగి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి, పరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com. -
విమర్శ లేదా తిరస్కరణను హ్యాండిల్ చేయలేకపోతున్నారా?
విమర్శలు ఎవరికీ నచ్చవు. వివేక్కి అసలే నచ్చవు. నేను సరిగా లేనేమో, నన్ను ఎవ్వరూ పట్టించుకోరేమో, తిరస్కరిస్తారేమో, విమర్శిస్తారేమో అనే భయం నిరంతరం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. తప్పు చేయడం, మాట పడటం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆందోళన చెందుతుంటాడు. ఎవరైనా ఏదైనా మాటంటే చాలు.. నెలల తరబడి దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అందుకే ఆఫీస్ మీటింగ్‌లకు ఏదో ఒక సాకు చెప్పి ఎగవేస్తుంటాడు. టీమ్ లీడర్ అయితే అందరితో మాట్లాడాల్సి వస్తుందని ప్రమోషన్ కూడా వద్దన్నాడు. ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేడు, ఎవరినీ నమ్మలేడు. ఏ అమ్మాయితో మాట్లాడితే ఏమవుతుందోనని దూరదూరంగా ఉంటాడు. అలా మొత్తం మీద అందరికీ దూరంగా ఒంటరిగా గడిపేస్తుంటాడు. వివేక్ సమస్య ఏమిటో పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు అర్థంకాలేదు. అడిగినా ఏమీ చెప్పడు. నాకేం నేను బాగానే ఉన్నానంటాడు. పెళ్లి చేసుకోమంటే ముందుకురాడు. అప్పుడే పెళ్లేంటంటూ వాయిదా వేస్తుంటాడు. ‘ఇప్పటికే 30 ఏళ్లొచ్చాయి, ఇంకెప్పుడ్రా చేసుకునేది?’ అని పేరెంట్స్ గొడవపడుతున్నా పట్టించుకోడు. వివేక్ సమస్యేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివేక్ లాంటి వాళ్లు జనాభాలో 2.5 శాతం మంది ఉంటారు. దీన్ని అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (AVPD) అంటారు. అంటే అది వ్యక్తిత్వంలో ఏర్పడిన సమస్య, రుగ్మత. ఇలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను గుర్తించడం కష్టం. ఎందుకంటే అవి ఆ వ్యక్తి ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో విడదీయలేని భాగంగా ఉంటాయి. బాల్యానుభవాల నుంచే.. ఏవీపీడీకి జన్యు, పర్యావరణ, సామాజిక, మానసిక కారకాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడడంలో పాత్ర పోషించే కొన్ని అంశాలు.. బాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రోత్సాహం లేకపోవడం, తిరస్కరణకు గురయిన పిల్లలు ఈ రుగ్మతకు లోనవుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి. తోటివారి తిరస్కరణ, ఎమోషనల్ అబ్యూజ్, అపహాస్యానికి గురైన వ్యక్తులు చిన్నతనంలో చాలా సిగ్గుపడతారు. పెద్దయినా ఆ సిగ్గును అధిగమించరు. బాల్యంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వారి ఆలోచనా విధానాలు మారడంలో పాత్ర పోషిస్తాయి. అలాంటి అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా, వాటిని తప్పించుకునేందుకు మనుషులనే తప్పించుకు తిరుగుతుంటారని అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల వయసులోనే ఈ లక్షణాలు కనిపించినా పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది. అసమర్థత భావాలే ప్రధాన లక్షణం.. అసమర్థత భావాలు, విమర్శ లేదా తిరస్కరణను తీసుకోలేకపోవడం, సోషల్ ఇన్హిబిషన్ ఏవీపీడీ ప్రధాన లక్షణాలు. యుక్త వయసుకు వచ్చేనాటికి వీటిని అనుభవించి ఉంటారు. వాటితోపాటు ఈ కింది లక్షణాలు కూడా ఉంటాయి. తనను తాను అసమర్థంగా, ఆనాకర్షణీయంగా, తక్కువగా భావించడం విమర్శ లేదా తిరస్కరణ భయం కారణంగా వర్క్ ప్లేస్‌లో వ్యక్తులతో కలసి పనిచేసే అవకాశాలను తప్పించుకోవడం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కచ్చితంగా తెలిస్తే తప్ప ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడకపోవడం అవమాన భయం కారణంగా సన్నిహిత సంబంధాలలో తడబాటు సామాజిక పరిస్థితుల్లో విమర్శల గురించే ఆలోచిస్తూ ఉండటం కొత్త సామాజిక పరిస్థితులను తప్పించుకోవడం రిస్క్ తీసుకోవడానికి లేదా ఇబ్బందికి దారితీసే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం. అయితే ఈ లక్షణాలు కనిపించగానే ఏవీపీడీ ఉందని కంగారుపడిపోకండి. ఈ రుగ్మత నిర్ధారణకు సైకాలజిస్ట్‌తో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ తర్వాతనే ఈ సమస్య ఉందని నిర్ధారిస్తారు. గుర్తించడమే చికిత్సలో తొలిమెట్టు ఏవీపీడీతో బాధపడేవారిలో చాలామంది దాన్ని గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. అందుకే మీకు తెలిసిన లేదా ప్రేమించే వ్యక్తి ఏవీపీడీతో జీవిస్తున్నారని భావిస్తే, సైకాలజిస్ట్‌ను కలిసేందుకు ప్రోత్సహించండి. థెరపీ లేకుండా దీని నుంచి మెరుగుపడే అవకాశం లేదు. ఏవీపీడీ నుంచి బయటపడాలంటే చేయాల్సిన మొదటి పని దాని సంకేతాలను గుర్తించడం. నిర్దిష్ట లక్షణాలను అర్థంచేసుకోవడం ద్వారా, వాటిని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించగలుగుతారు సమస్య నుంచి బయటపడేందుకు స్మోకింగ్, ఆల్కహాల్, అతిగా తినడం లాంటి అనారోగ్యకరమైన కోపింగ్ టెక్నిక్స్ కాకుండా ఆరోగ్యకరమైన సంరక్షణ మార్గాలు పాటించాలి మీ చికిత్సలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా చేర్చుకోండి. మీ సమస్యేమిటో, ఎలా సహాయం చేయాలో వాళ్లకు బాగా అర్థమవుతుంది · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, స్కీమా థెరపీ, గ్రూప్ థెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటివి ఈ రుగ్మత నుంచి బయటపడేందుకు సహాయపడతాయి బాల్యంలోని బాధాకరమైన అనుభవాలను అర్థంచేసుకుని, వాటి తాలూకు నొప్పిని, సంఘర్షణను అధిగమించేందుకు చికిత్స ఉపయోగపడుతుంది · ఏవీపీడీ చికిత్సకోసం మందులు ఏవీ లేనప్పటికీ.. దానివల్ల వచ్చే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సంబంధిత రుగ్మతల నుంచి బయటపడేందుకు మందులు ఉపయోగపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?) -
తను ఎవరు?
అద్దంలో ఒక బొడిపె ఉంటే మిగతా అద్దం కనపడదు...బొడిపే కనిపిస్తుంది.కాగితం మీద ఒక చుక్క ఉంటే ఆ చుక్కే కనిపిస్తుంది...కాగితం కనపడదు. దోషం లేని సృష్టే లేదు. మనసూ అంతే... ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ తెలిసో తెలియకో చందమామలాంటి మనసులో ఒక మచ్చ కనపడవచ్చు. అలాగే వ్యక్తిత్వంలో ఇలాంటి మచ్చలు తొమ్మిది ఏరి మీకు చూపిస్తున్నాం. మచ్చ మంచిదే... అదుపు మీరకుంటే!! ఒక్కొక్క వ్యక్తి వ్యవహరించే తీరు ఒక్కోలా ఉంటుంది. ఈ తీరును బట్టే సమాజం అతడి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి మనిషి వ్యవహారంలో తేడాలున్నప్పటికీ స్థూలంగా అందరూ సమాజం ఆమోదించేలాగే వ్యవహరిస్తారు. అయితే కొందరి వ్యవహారశైలి కొంత ఎక్కువ, తక్కువలతో తేడాగా ఉండి, అది సమాజాన్ని కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాలతో వచ్చే ఇబ్బందులను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. వాటి గురించి అవగాహన, అలాంటి వ్యవహారశైలి ఉన్నవారు తమను ఎలా చక్కదిద్దుకోవాలో తెలియజేయడం కోసం ఈ కథనం. 1 పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు అందరితో సామాజిక సంబంధాలను సరిగా నెరపలేరు. ఇతరులను తేలిగ్గా నమ్మరు. ప్రతివారినీ అనుమానంగా చూస్తారు. ఇతరుల పట్ల వారికి ఉన్న అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు అవసరమైన సమర్థనలను (క్లూస్) ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. తాము ఏదైనా అంశంలో వైఫల్యం చెందినప్పుడు చాలా ఎక్కువగా సెన్సిటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. ఇతరులతో పొసగని సంబంధాలు నెరపుతుండటమే కాకుండా వారితో తగవు పెట్టుకునేందుకు అవసరమైన సాకులు వెతుక్కుంటుంటారు. అంతేకాదు తమకు నచ్చని పని ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది చేయడం ఇష్టం లేక దాని పట్ల తమ అయిష్టం ఎందుకో వివరించేందుకు ఇతరుల ఉదాహరణలు తీసుకొని తమను తాము సమర్థించుకుంటుంటారు. తమను సరిచేయబోయేవారిని ద్వేషించడం ప్రారంభిస్తారు. 2 స్కీజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ వ్యక్తిత్వ సమస్య ఉన్నవారు తాము మిగతా సమాజం నుంచి వేరుగా ఉండటాన్ని ఇష్టపడతారు. తమదైన ప్రపంచంలో, తమ ఊహాలోకపు ఫ్యాంటసీలలో విహరిస్తుంటారు. ఇతరులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను నెరపడానికి ఇష్టపడరు. అంతేకాదు... ఎంతో బలమైనవిగా పరిగణించే లైంగికపరమైన బాంధవ్యాల పట్ల కూడా వీరికి ఆసక్తి ఉండదు. ఉద్వేగపరమైన స్పందనలు (ఎమోషనల్ రెస్పాన్స్) కూడా పెద్దగా ఉండదు. ఒక దీర్ఘకాలిక బంధాన్ని కోరుకుంటున్నప్పటికీ దాన్ని కొనసాగించలేరు. దాంతో నిరాశగా మళ్లీ తమదైన ఒంటరి ప్రపంచంలోకి ముడుచుకుపోతారు. అయితే వారి తాలూకు ప్రవర్తనను పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారు సాధారణంగా తమ ఆలోచనల్లో ఉన్న వైవిధ్యాన్ని ప్రదర్శించరు. దాంతో తమ ప్రవర్తన లోపంతో సమాజానికి ఒక పట్టాన పట్టుబడరు. 3 స్కీజోటైపల్ డిజార్డర్ : ఈ తరహా డిజార్డర్ ఉన్నవారు కనిపించేతీరు, ప్రవర్తన, మాటలు అన్నీ చాలా వింతగా ఉంటాయి. స్కీజోఫ్రీనియా ఉన్నవారిలో కనిపించే ఆలోచనలే వీరిలోనూ ఉంటాయి. స్కీజోఫ్రీనియా ఉన్నవారు కొన్ని రకాల భ్రాంతులకు గురవుతుంటారన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు తమకు ఏవో దెయ్యాలు కనిపిస్తున్నాయనీ, మాటలు వినిపిస్తున్నాయని వారు అంటుంటారు. అలాగే స్కీజోటైపల్ పర్సనాలిటీ ఉన్నవారు ఇతరులు తమకు హానిచేసేందుకు యత్నిస్తున్నారంటూ నమ్ముతూ, సామాజిక బంధాలను కొససాగించరు. చుట్టూ జరిగే సంఘటనలను తమ నమ్మకానికి అనువుగా వ్యాఖ్యానిస్తుంటారు. అందుకే వీరికి సామాజిక బంధాలను కొనసాగించడమే ఇష్టం ఉండదు. ఇక ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే... షైజోటైపల్ పర్సనాలిటీ ఉన్నవారిలో దాదాపు 50 శాతం మంది స్కీజోఫ్రీనియాకు గురవుతుంటారు. అందుకే ఈ కండిషన్‌ను ‘లేటెంట్ స్కీజోఫ్రీనియా’ అని కూడా అంటారు. 4 బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ : భావోద్వేగాల పరంగా స్థిరత్వం లేనివారిని బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌గా చెప్పడం జరుగుతుంటుంది. ఇలాంటివారిలో బలమైన సొంత వ్యక్తిత్వం నిర్మితం కాదు. దాంతో అందరూ తనను తృణీకరిస్తున్నారనే ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. సామాజిక సంబంధాలను స్థిరంగా కొనసాగించలేరు. ఒకసారి బలంగా సంబంధాలు నెరపుతూ అంతలోనే వాటిని బలహీన పరుచుకుంటుంటారు. భావోద్వేగాల వ్యక్తీకరణలోనూ స్థిరత్వం ఉండదు. ఒక్కోసారి చాలా కోపంగా, హింసాత్మకంగా ఉంటారు. ప్రత్యేకంగా తమను ఎవరైనా విమర్శించినప్పుడు తీవ్రమైన ఆగ్రహానికి గురవుతుంటారు. తిరగబడేరీతిలో చాలా త్వరగా ప్రతిస్పందిస్తుంటారు. తాము ఆత్మహత్య చేసుకుంటామనీ లేదా తమకు తాము హాని చేసుకుంటామనే బెదిరింపులు చాలా సాధారణం. వీరిలో అటు నరాలకు సంబంధించిన (న్యూరోటిక్) ప్రవర్తనలతో పాటు ఇటు సైకోటిక్ తరహా ప్రవర్తలు కనిపిస్తుంటాయి. యాంగై్జటీ, స్కీజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి లక్షణాలకు బార్డర్లో ఉండటం వల్ల ఈ వ్యక్తుల ప్రవర్తన తీరుకు ‘బార్డర్‌లైన్’ అని పేరు పెట్టారు. సాధారణంగా చిన్నప్పుడు లైంగికంగా వేధింపులకు గురైనవారిలో ఈ బార్డర్‌లైన్ పర్సనాలిటీ పెరుగుతుంది. ఇది మహిళల్లో ఎక్కువ అని కొందరు విశ్లేషిస్తుంటారు. మహిళల్లో ఈ తరహా పర్సనాలిటీ సమస్యలు ఉన్నవారు ఒకే భాగస్వామితో ఉండరనీ, అదే పురుషులు అయితే హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారనీ కొందరు పేర్కొనడం ఈ వ్యాధి విషయంలో ఉన్న చర్చ. 5 హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్: ఈ తరహా ప్రవర్తన ఉన్నవారిలో సొంత వ్యక్తిత్వం ఉండదు. వీరు ప్రతిపనినీ పక్కవారి దృష్టిని ఆకర్షించడం కోసం చేస్తుంటారు. ప్రతిదానికీ పక్కవారి ఆమోదం కోసం ఎదురుచూస్తుంటారు. ‘హిస్ట్రియానిక్’ అంటే లాటిన్లో ‘నటులకు సంబంధించిన’ అని అర్థం. వీరు కాస్త నాటకీయంగా ప్రవర్తిస్తుండటం వల్ల ఈ వ్యక్తిత్వ సమస్యకు ఆ పేరు వచ్చింది. తాము ఎవరినైనా ఆకర్షించగలమనీ, ఎవరినైనా తమ ప్రవర్తనతో ఆకట్టుకోగలమని భావిస్తారు. ఎప్పుడూ ఎక్సయిట్మెంట్ కోసం కోరుకోవడం వల్ల అకస్మాత్తుగా ఏదైనా సాధించడానికీ లేదా ప్రమాదాల్లో కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. తమకు ఏదైనా దక్కకపోయినా లేదా తమను ఎవరైనా విమర్శించినా చాలా ఎక్కువగా కుంగిపోతారు. దాంతో చాలా చెడ్డగా ప్రవర్తిస్తారు. ఈ గుణం వల్ల మరింత ఎక్కువగా సమస్యలపాలవుతారు. సమస్యల పాలయ్యామని మళ్లీ చెడుగా ప్రవర్తిస్తారు. వీరి ప్రవర్తన విషయంలో ఈ విషవలయం ఇలా సాగుతూనే ఉంటుంది. 6 నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్: వీరు తమనూ, తమ ప్రాధాన్యాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ, తమను ఎల్లప్పుడూ అందరూ మెచ్చుకోవాలని భావిస్తారు. తమలోని గుణాలే ఎదుటివారిలోనూ ఉన్నాయంటూ ఎదుటివారిని మెచ్చుకుంటే వీరు భరించలేరు. ఉదాహరణకు వీరు బాగా నటిస్తారనుకుందాం. అప్పుడు ఏదో సందర్భంలో ఎదుటి నటుడిని మెచ్చుకుంటూ... అతడూ మీలాగే బాగా నటిస్తాడు అన్నా తట్టుకోలేరు. నాతో పోలికేమిటి అన్న భావన ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన ఉన్నవారిలో ఎదుటివారి పట్ల సహానుభూతి ఉండదు. తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం అబద్ధాలు ఆడటం, ఎదుటివారిని ఎంతగానైనా ఎక్స్‌ప్లాయిట్ చేసేందుకు సిద్ధమవుతారు. అందుకే ఇలాంటి వారు ఎదుటివారికి సహనం లేనివారిగా, స్వార్థపరులుగా, ఎదుటివారి సమస్యల పట్ల స్పందించని వారిగా కనిపిస్తుంటారు. వీరిని కాస్త ఆటపట్టించినా లేదా సరదాగా ఛలోక్తులు విసిరినా చాలా తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతుంటారు. ఇలాంటి ప్రతిచర్యనే ‘నార్సిస్టిక్ రేజ్’ అంటారు. ఇది చాలా విధ్వంసపూరితమైన ప్రవర్తన. 7 అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ తరహా ప్రవర్తన ఉన్నవారు సామాజికంగా ఎలాంటి ప్రత్యేకతలు, నైపుణ్యాలు లేకుండా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాస లేమితో ఉంటారు. ఎప్పుడూ బిడియంగా కనిపిస్తూ తమ ఆత్మవిశ్వాస లేమి కారణంగా విమర్శలకు లోనవుతూ ఉంటారు. వీరితో మెలగడం ఎవరికైనా పెద్దగా ఆసక్తిగా ఉండదు. వీరిలో ఏదైనా ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ అంశం కారణంగా కలవాల్సిన వ్యక్తులను మినహాయించి, ఎవరినీ కలవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారు ఎప్పుడూ యాంగై్జటీతో బాధపడుతుంటారు. నిజానికి చిన్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులూ తృణీకరించిన వారిలో ఈ తరహా వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది. దాంతో వీళ్లు కూడా సామాజికంగా అందరితోనూ కలవలేరు. ఇక్కడ కూడా తాము కలవలేకపోవడంతో దూరం జరగడం, దూరం జరగడం వల్ల ఇతరులతో కలవలేకపోవడం అనే ఒక విషవలయం కొనసాగుతూ ఉంటుంది. 8 డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్: ఈ తరహా వ్యక్తిత్వ సమస్యలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. వీరు ప్రతిదానికీ ఇతరుల మీదే ఆధారపడతారు. తమ తరఫున ఇతరులే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. తమను ఎదుటివారు తృణీకరిస్తారేమోనని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దాంతో ఎప్పుడూ సురక్షితమైన బంధాలను కొనసాగించడానికి చాలా తాపత్రయపడుతూ, కష్టపడుతూ ఉంటారు. తను ఏదైనా కీలకమైన విషయాన్ని డీల్ చేయాల్సి వచ్చేటప్పటికి పక్కవారి అధీనంలోకి వెళ్లిపోతారు. ఈ తరహా ప్రవర్తన ఉన్నవారు తమకు అంతగా అనుభవం లేదంటూ ఒప్పుకుంటూ, తమ చేతకాదని చెప్పుకుంటూ, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. సాధారణంగా ఎప్పుడూ తమను ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి, తమను దోచుకోడానికి అవకాశమిస్తూ ఉంటారు. 9 ఎనాన్కాస్టిక్ (అబ్సెసివ్–కంపల్సివ్) పర్సనాలిటీ డిజార్డర్: ఇలాంటి పర్సనాలిటీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ నిబంధనల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ నిబంధన ప్రకారం ఇది తప్పు.. ఆ రూల్‌ను బట్టి ఇలా చేయకూడదు.. ఫలానా మార్గదర్శకాల ప్రకారం ఇది పూర్తిగా సరికాదు.. అంటూ ఎప్పుడూ చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. పనిలో పూర్తిస్థాయి సునిశితత్వం కోసం ఆత్రపడుతుంటారు. వీరి గుణం వల్ల చాలా పనులు సరిగా పూర్తికాకుండా పెండింగ్‌లో పడిపోతుంటాయి. వీరి కారణంగా పనులు ఒక పట్టాన జరగకపోవడంతో అందరూ వీరి నుంచి దూరంగా ఉంటారు. ఇలాంటి ఎనాన్కాస్టిక్ పర్సనాలిటీ ఉన్నవారు ఎప్పుడూ ప్రతిదాన్నీ సందేహిస్తూ, అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కఠినంగా వ్యవహరిస్తుంటారు. ప్రతి విషయంలోనూ మితిమీరిన స్వీయనియంత్రణతో ఉంటారు. హాస్యపూరితమైన ధోరణి, నవ్వుతూ ఉండటం వంటి గుణాలే ఉండవు. ఏమాత్రం లోపం జరిగినా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. అందుకే సహోద్యోగులు, తోటిపనివారు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో సంబంధాలు నెరపడం లేదా ఇలాంటివారితో మిగతావారు సంబంధాలను కొనసాగించడం చాలా కష్టమవుతుంటుంది. చక్కదిద్దడం ఎలా : ఒక మానసిక వ్యాధికీ, ప్రవర్తనపూర్వకమైన సమస్యలకు చాలా తేడా ఉంది. అలాగే సాధారణ ప్రజల వ్యవహారాలకు, ఈ తరహా వ్యక్తిత్వ లోపాలకు మధ్య తేడా కనుగొనడం కూడా చాలా సంక్లిష్టమైన వ్యవహారమే. అందుకే ఇలాంటి లోపాలను కనుగొనడానికి సైకియాట్రిస్టులు ఎంతో నైపుణ్యంతో, సునిశితత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వారి ప్రవర్తన కారణంగా సామాజిక సమస్యలు వచ్చే తీరుతెన్నులను గుర్తించడంతో పాటు చాలా నేర్పుగా ఈ విషయాలను డిజార్డర్‌తో బాధపడేవారికి తెలియజెప్పాల్సి ఉంటుంది. ఈ దిశగా వారిని చక్కదిద్దే ప్రయత్నంలో కౌన్సెలింగ్‌తో పాటు, పర్సనాలిటీ డెవలప్ ట్రైయినింగ్ కార్యకలాపాలు బాగా దోహదపడతాయి. వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంటుందంటే? ఒకరి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైన అంశం జన్యువులు. తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధానభూమిక వహించినప్పటికీ అవే పూర్తిగా వ్యక్తిత్వాన్ని నిర్మించలేవు. ఎందుకంటే.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లో వేర్వేరు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. అందుకే జన్యువులతో పాటు వారు పెరిగిన వాతావరణం, చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, ఏవైనా అఘాయిత్యాలకు గురికావడం, కొన్ని అంశాల పట్ల అతిగా స్పందించడం (హైపర్ రియాక్టివిటీ), చుట్టుపక్కలవారి స్నేహాలు (పియర్), బలమైన వ్యక్తిత్వం గల ఇతరులతో ప్రభావితం కావడం... ఇలాంటి ఎన్నో అంశాలు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే అందరు వ్యక్తులు సమాజంతో వ్యవహరించాలి. సమాజం అంటే వేరే ఏమిటో కాదు... ఎదుట ఉన్న వ్యక్తులే. ఒకరు ఒక సమూహంతో ఒకలాగా మరో సమూహంతో ఒకలాగా వ్యవహరించవచ్చు. ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించే యజమాని ఇంటి సభ్యులతో ప్రేమగా ఉండవచ్చు. ఇంటి సభ్యులతో కఠినంగా ఉండే వ్యక్తి స్నేహితులతో ఆప్యాయంగా ఉండొచ్చు. కొందరి ప్రవర్తన వ్యక్తికీ వ్యక్తికీ మారుతుండవచ్చు. ఇవి సాధారణ స్థాయిలో ఉంటే సరేగానీ శృతి మించి అవి సమాజానికి చెరపు చేస్తున్నప్పుడు... మనస్తత్వశాస్త్రం వాటిని వ్యక్తిత్వానికి సంబంధించిన రుగ్మతలుగా పేర్కొంటుంది. వాటినే ఇంగ్లిష్‌లో పర్సనాలిటీ డిజార్డర్స్‌గా చెప్పవచ్చు. -
ఆయనతో వేగలేకపోతున్నాను.!?
నా వయసు 50, మా వారి వయసు 54. మా పెళ్లై పాతికేళ్లయింది. మావారిది చిత్రమైన స్వభావం. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండటం వల్ల ఈయన ఉద్యోగం చేయటంలేదు. టీవీకి అతుక్కుపోయి హెల్త్ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. వాటిలో కొన్ని జబ్బులకి డాక్టర్లు చెప్పిన లక్షణాలలో ఒకటీ అరా తనకు ఉన్నా, ఆ జబ్బును తనకే ఆపాదించుకోవడం, డాక్టర్లు ఉప్పు, కారం, నూనె తగ్గించమంటే ఇంటిల్లిపాదినీ పథ్యం పెట్టడం, అందరినీ తిండి తినద్దంటూ ఇబ్బంది పెడతారు. ఎప్పుడు పడితే అప్పుడు యోగా చేయడం, వర్షం పడుతున్నా, స్విమ్మింగ్కెళ్లటం... ఇంట్లో ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే పట్టించుకోరు. ముందు ముందు ఆయనతో జీవితం ఎలా గడపాలో అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కృష్ణవేణి, విశాఖపట్నం మీరు రాసిన లెటర్‌ను చదివాక మీరు ఆయనతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోంది. మీ వారి ప్రవర్తన ‘పర్సనాలిటీ డిజార్డర్’ కిందికి వస్తుంది. ఇటువంటి వారు తమకు తోచింది చేస్తూ, ఇతరులు ఏమైపోతున్నా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ప్రతిదానిలోనూ తమదే కరెక్టనీ, అందరూ తమలాగే ఉండాలనీ, తాము చెప్పిందే చేయాలనీ అనుకుంటారు. ఫలితంగా తమకంటూ స్నేహితులెవరూ మిగలకుండా చేసుకుంటారు. బంధుత్వాలు వదులుకుంటారు. మీది... అన్నీ పద్ధతి ప్రకారం జరగాలనుకునే మనస్తత్వంలా కనిపిస్తోంది. మీ ఇద్దరి స్వభావాలూ పరస్పర విరుద్ధమైనవి. ఇన్నాళ్లపాటు మీరు ఆయనతో అడ్జస్ట్ అవడం అభినందనీయం. మీరు తరచు ఆయన మనస్తత్వం గురించే ఆలోచించడం, బాధపడటం మంచిది కాదు. ఇటువంటివారిని వారి మానాన వారిని వదిలేసి, దేనికీ వారిపై ఆధారపడకుండా, వాదించకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోవటం మంచిది. దానిమూలంగా మీరు కూడా మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు, ఆయన ఇద్దరూ కలిసి పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో బాధపడేవారిని డీల్ చేయడంలో నిపుణులైన మంచి సైకాలజిస్టును లేదా సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం అవసరం. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్