విమర్శలు ఎవరికీ నచ్చవు. వివేక్‌కి అసలే నచ్చవు. నేను సరిగా లేనేమో, నన్ను ఎవ్వరూ పట్టించుకోరేమో, తిరస్కరిస్తారేమో, విమర్శిస్తారేమో అనే భయం నిరంతరం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. తప్పు చేయడం, మాట పడటం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆందోళన చెందుతుంటాడు. ఎవరైనా ఏదైనా మాటంటే చాలు.. నెలల తరబడి దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అందుకే ఆఫీస్ మీటింగ్‌లకు ఏదో ఒక సాకు చెప్పి ఎగవేస్తుంటాడు. టీమ్ లీడర్ అయితే అందరితో మాట్లాడాల్సి వస్తుందని ప్రమోషన్ కూడా వద్దన్నాడు. ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేడు, ఎవరినీ నమ్మలేడు. ఏ అమ్మాయితో మాట్లాడితే ఏమవుతుందోనని దూరదూరంగా ఉంటాడు. అలా మొత్తం మీద అందరికీ దూరంగా ఒంటరిగా గడిపేస్తుంటాడు.
వివేక్ సమస్య ఏమిటో పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు అర్థంకాలేదు. అడిగినా ఏమీ చెప్పడు. నాకేం నేను బాగానే ఉన్నానంటాడు. పెళ్లి చేసుకోమంటే ముందుకురాడు. అప్పుడే పెళ్లేంటంటూ వాయిదా వేస్తుంటాడు. ‘ఇప్పటికే 30 ఏళ్లొచ్చాయి, ఇంకెప్పుడ్రా చేసుకునేది?’ అని పేరెంట్స్ గొడవపడుతున్నా పట్టించుకోడు. వివేక్ సమస్యేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
వివేక్ లాంటి వాళ్లు జనాభాలో 2.5 శాతం మంది ఉంటారు. దీన్ని అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (AVPD) అంటారు. అంటే అది వ్యక్తిత్వంలో ఏర్పడిన సమస్య, రుగ్మత. ఇలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను గుర్తించడం కష్టం. ఎందుకంటే అవి ఆ వ్యక్తి ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో విడదీయలేని భాగంగా ఉంటాయి.
బాల్యానుభవాల నుంచే..
ఏవీపీడీకి జన్యు, పర్యావరణ, సామాజిక, మానసిక కారకాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడడంలో పాత్ర పోషించే కొన్ని అంశాలు.. బాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రోత్సాహం లేకపోవడం, తిరస్కరణకు గురయిన పిల్లలు ఈ రుగ్మతకు లోనవుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి. తోటివారి తిరస్కరణ, ఎమోషనల్ అబ్యూజ్, అపహాస్యానికి గురైన వ్యక్తులు చిన్నతనంలో చాలా సిగ్గుపడతారు. పెద్దయినా ఆ సిగ్గును అధిగమించరు.
బాల్యంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వారి ఆలోచనా విధానాలు మారడంలో పాత్ర పోషిస్తాయి. అలాంటి అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా, వాటిని తప్పించుకునేందుకు మనుషులనే తప్పించుకు తిరుగుతుంటారని అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల వయసులోనే ఈ లక్షణాలు కనిపించినా పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది.
అసమర్థత భావాలే ప్రధాన లక్షణం..
- అసమర్థత భావాలు, విమర్శ లేదా తిరస్కరణను తీసుకోలేకపోవడం, సోషల్ ఇన్‌హిబిషన్ ఏవీపీడీ ప్రధాన లక్షణాలు. యుక్త వయసుకు వచ్చేనాటికి వీటిని అనుభవించి ఉంటారు. వాటితోపాటు ఈ కింది లక్షణాలు కూడా ఉంటాయి.
- తనను తాను అసమర్థంగా, ఆనాకర్షణీయంగా, తక్కువగా భావించడం
- విమర్శ లేదా తిరస్కరణ భయం కారణంగా వర్క్ ప్లేస్‌లో వ్యక్తులతో కలసి పనిచేసే అవకాశాలను తప్పించుకోవడం
- పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కచ్చితంగా తెలిస్తే తప్ప ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడకపోవడం
- అవమాన భయం కారణంగా సన్నిహిత సంబంధాలలో తడబాటు
- సామాజిక పరిస్థితుల్లో విమర్శల గురించే ఆలోచిస్తూ ఉండటం
- కొత్త సామాజిక పరిస్థితులను తప్పించుకోవడం
- రిస్క్ తీసుకోవడానికి లేదా ఇబ్బందికి దారితీసే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం.
అయితే ఈ లక్షణాలు కనిపించగానే ఏవీపీడీ ఉందని కంగారుపడిపోకండి. ఈ రుగ్మత నిర్ధారణకు సైకాలజిస్ట్‌తో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ తర్వాతనే ఈ సమస్య ఉందని నిర్ధారిస్తారు.
గుర్తించడమే చికిత్సలో తొలిమెట్టు
ఏవీపీడీతో బాధపడేవారిలో చాలామంది దాన్ని గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. అందుకే మీకు తెలిసిన లేదా ప్రేమించే వ్యక్తి ఏవీపీడీతో జీవిస్తున్నారని భావిస్తే, సైకాలజిస్ట్‌ను కలిసేందుకు ప్రోత్సహించండి. థెరపీ లేకుండా దీని నుంచి మెరుగుపడే అవకాశం లేదు.
- ఏవీపీడీ నుంచి బయటపడాలంటే చేయాల్సిన మొదటి పని దాని సంకేతాలను గుర్తించడం.
- నిర్దిష్ట లక్షణాలను అర్థంచేసుకోవడం ద్వారా, వాటిని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించగలుగుతారు
- సమస్య నుంచి బయటపడేందుకు స్మోకింగ్, ఆల్కహాల్, అతిగా తినడం లాంటి అనారోగ్యకరమైన కోపింగ్ టెక్నిక్స్ కాకుండా ఆరోగ్యకరమైన సంరక్షణ మార్గాలు పాటించాలి
- మీ చికిత్సలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా చేర్చుకోండి. మీ సమస్యేమిటో, ఎలా సహాయం చేయాలో వాళ్లకు బాగా అర్థమవుతుంది ·
- కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, స్కీమా థెరపీ, గ్రూప్ థెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటివి ఈ రుగ్మత నుంచి బయటపడేందుకు సహాయపడతాయి బాల్యంలోని బాధాకరమైన అనుభవాలను అర్థంచేసుకుని, వాటి తాలూకు నొప్పిని, సంఘర్షణను అధిగమించేందుకు చికిత్స ఉపయోగపడుతుంది ·
- ఏవీపీడీ చికిత్సకోసం మందులు ఏవీ లేనప్పటికీ.. దానివల్ల వచ్చే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సంబంధిత రుగ్మతల నుంచి బయటపడేందుకు మందులు ఉపయోగపడతాయి.
--సైకాలజిస్ట్ విశేష్
(చదవండి: మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?)
Comments
Please login to add a commentAdd a comment