మావాడు ఎవరితోనూ కలవడండీ | Psychologist Guidences to Schizoid Personality Disorder on Sakshi Funday | Sakshi
Sakshi News home page

మావాడు ఎవరితోనూ కలవడండీ

Published Sun, Jan 14 2024 6:00 AM | Last Updated on Sun, Jan 14 2024 6:00 AM

Psychologist Guidences to Schizoid Personality Disorder on Sakshi Funday

‘‘మావాడు చిన్నప్పటి నుంచీ ఎవరితోనూ కలవడు సర్‌. ఎప్పుడూ ఒంటరిగా తన పని తాను చేసుకుంటాడు. ఎలాగోలా ఇంజినీరింగ్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ వాడు ఏమాత్రం ఇంట్రెస్ట్ట్‌ చూపించడం లేదు.

ఎవరినైనా ప్రేమించావా? అని అడిగితే అలాంటిదేం లేదంటాడు. సమస్య ఏమిటో అర్థం కావడం లేదు’’ ఆనందమూర్తి ఆవేదన. ఆయన చెప్పింది మొత్తం విన్నాక.. చేతన్‌తో మాట్లాడాలని చెప్పాను. అయితే మాట్లాడటానికి చేతన్‌ పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలా మొక్కుబడిగా మాట్లాడాడు.

చిన్నప్పటి నుంచీ స్నేహితులెవరూ లేరని చెప్పాడు. ‘ఎందుకలా?’ అని అడిగితే ‘ఐ యామ్‌ నాట్‌ ఇంట్రెస్టెడ్‌’ అని సమాధానమిచ్చాడు. ‘గాళ్‌ ఫ్రెండ్స్‌?’ అని అడిగినా అదే సమాధానం.

‘మీరు ఎవరితో క్లోజ్‌గా ఉంటారు?’ అనే ప్రశ్నకు ‘ఎవ్వరితోనూ లేదు. నాతో నేనే’ అని చెప్పాడు. అతని మాటల్లో ఎలాంటి భావోద్వేగాలూ లేవు, ఫ్లాట్‌గా సాగాయి. తన తల్లి కూడా అలాగే ఉంటుందని అతని మాటల్లో తెలిసింది.

అతనిది కేవలం సిగ్గు, బిడియం, మొహమాటం కాదని, ఇంట్రావర్ట్‌ కూడా కాదని అర్థమైంది. క్లినికల్‌ ఇంటర్వ్యూ, సైకో డయాగ్నసిస్‌ అనంతరం అతను ‘స్కిజాయిడ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ (ఎస్సీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. మూడు నుంచి ఐదు శాతం వ్యక్తుల్లో ఈ రుగ్మత కనిపిస్తుంది.

సైకోథెరపీతోనే పరిష్కారం..
పర్సనాలిటీ డిజార్డర్‌ అంటే వ్యక్తిత్వంలో లోపాలు రుగ్మతలా మారడం. వీటిని నయం చేయడానికి ఎలాంటి మందులూ లేవు. సైకోథెరపీ ద్వారానే సహాయం చేయగలం. కానీ ఎస్సీపీడీ ఉన్నవారికి ఇతరులతో సంబంధాలే ఇష్టం ఉండదు కనుక థెరపీకి కూడా ఆసక్తి చూపరు. కుటుంబ సభ్యులే తీసుకురావాల్సి వస్తుంది. 

ఎస్సీపీడీ పరిష్కారానికి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (ఇఆఖీ) బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలను నిశితంగా పరిశీలించి, వారి ఆలోచనలు వారి చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఇతరులతో సంబంధాల ప్రాధాన్యం, ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తారు. 

సమస్య మూలాన్ని, కుటుంబ కారణాలను అర్థం చేసుకునేందుకు ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది. గ్రూప్‌ థెరపీ ద్వారా సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడవచ్చు. ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. 

ఒంటరితనమే ఇష్టం..
ఎస్సీపీడీ లక్షణాలు బాల్యంలో ఉన్నప్పటికీ టీనేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు స్కూల్లో, పనిలో, సామాజిక పరిస్థితుల్లో, ఇతర రంగాల్లో పనితీరును కష్టతరం చేస్తాయి. ఒంటరిగా పనిచేసే ఉద్యోగాలైతే ఫర్లేదు, లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రుగ్మత లక్షణాలు.. 

♦ సన్నిహిత సంబంధాలను కోరుకోరు, ఆనందించరు. 
♦ ఒంటరిగా ఉంటారు, పనులన్నీ ఒంటరిగా చేయాలనుకుంటారు. 
♦ భావోద్వేగాలను వ్యక్తపరచడంలో, ప్రతిస్పందించడంలో కష్టపడతారు. 
♦ లక్ష్యాలను చేరుకోవాలనే ఉత్సాహం ఉండదు.
♦ ఇతరుల ప్రశంసలు లేదా విమర్శలకు ప్రతిస్పందించరు. 
♦ సరదా, సంతోషం, స్పందనలేని రాయిలా కనిపిస్తారు. 
♦ లైంగిక సంబంధాలపై ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. 

బాల్యంలో నిర్లక్ష్యానికి గురయితే..
పర్సనాలిటీ డిజార్డర్‌లను గుర్తించడం కష్టం. వాటికి సరైన కారణాలను గుర్తించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎస్సీపీడీకి కూడా కారణమేమిటో తెలియదు. జన్యుపర సంబంధం ఉందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు.

భావోద్వేగాలను పట్టించుకోని వాతావరణం వల్ల ఈ రుగ్మతకు గురయ్యే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే, బాల్యంలో మానసికంగా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉండే తల్లిదండ్రులను కలిగి ఉండటం ఈ రుగ్మత ఏర్పడటానికి దోహదం చేస్తుంది.

నిర్ధారణ కష్టం..
ఎస్సీపీడీతో సహా ఇతర వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించడం చాలా కష్టం, ఎందుకంటే వ్యక్తిత్వ క్రమరాహిత్యం ఉన్న చాలామంది వ్యక్తులు తమ ప్రవర్తన లేదా ఆలోచనా విధానంలో సమస్య ఉందని భావించరు.

మీలో కానీ, మీ సన్నిహితుల్లో కానీ ఎస్సీపీడీ ఉందని భావించినప్పుడు ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి. వారు మీ బాల్యం, మానవ సంబంధాలు, పనిలో మీ ప్రవర్తనపై ప్రశ్నలడిగి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి, పరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు. -సైకాలజిస్ట్‌ విశేష్‌, psy.vishesh@gmail.com.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement