Jaipur Literature Festival 2024: చిల్డ్రన్‌ ఫస్ట్‌ | Jaipur Literature Festival 2024: The thought of children is paramount for everyone | Sakshi
Sakshi News home page

Jaipur Literature Festival 2024: చిల్డ్రన్‌ ఫస్ట్‌

Published Sat, Feb 3 2024 6:38 AM | Last Updated on Sat, Feb 3 2024 6:38 AM

Jaipur Literature Festival 2024: The thought of children is paramount for everyone - Sakshi

‘మన దేశంలో అన్నింటికీ కోర్సులు ఉన్నాయి... పేరెంటింగ్‌కి తప్ప. పిల్లల మానసిక సమస్యల గురించి చాలా తక్కువ పట్టింపు ఉన్న దేశం. పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్న దేశం మనదే. పిల్లల గురించిన ఆలోచనే అందరికీ ప్రధానం కావాలి’ అన్నారు జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌లు డాక్టర్‌ శేఖర్‌ శేషాద్రి, డాక్టర్‌ అమిత్‌ సేన్, పిల్లల మానసిక చికిత్సా కేంద్రం నిర్వాహకురాలు నేహా కిర్‌పాల్‌. ఇంకా వారేమన్నారు?

‘మన దేశంలో పదికోట్ల మంది బాల బాలికలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వారిలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే నాణ్యమైన మానసిక చికిత్స, థెరపీ అందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రపంచం, పిల్లల ప్రపంచం వేరు వేరుగా ఉంది. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య కనెక్టివిటీ లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి’ అని తెలిపారు పిల్లల మానసిక ఆరోగ్యరంగంలో పని చేస్తున్న నేహా కిర్‌పాల్, శేఖర్‌ శేషాద్రి, అమిత్‌ సేన్‌.జైపూర్‌లో జరుగుతున్న జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ‘రీక్లయిమింగ్‌ హోప్‌’ అనే సెషన్‌లో వీరు పాల్గొన్నారు.

చదువుల ఒత్తిడి – ఆత్మహత్యలు
పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఆత్మహత్య లకు ఉసిగొల్పుతోంది. రాజస్థాన్‌లోని ‘కోటా’లో కోచింగ్‌ సంస్థల వ్యాపారం 12 వేల కోట్లకు చేరుకుంది. ఏటా లక్షమంది విద్యార్థులు అక్కడ జెఇఇ, నీట్‌ ర్యాంకుల కోసం చేరుతున్నారు. తీసుకున్న ఫీజు కోసం నిర్వాహకులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజుకు 12గంటల రొటీన్‌ వల్ల పిల్లలకు కొద్దిగా కూడా రిలీఫ్‌ లేదు. రోజువారీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఒకరకమైన ట్రీట్‌మెంట్, మార్కులు రాక స్ట్రగుల్‌ చేస్తున్నవారికి ఒక ట్రీట్‌మెంట్‌ ఉంటోంది. పిల్లలు తమ మీద తాము విశ్వాసం కోల్పోతున్నారు.

చెప్పుకుందామంటే తల్లిదండ్రుల నుంచి కనీస సానుభూతి దొరకడం లేదు. దాంతో ఆత్మహత్యల ఆలోచనలు, చర్యలు పెరుగుతున్నాయి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకుండా వారు చదువుకునే గదుల్లో ఫ్యాన్లు తీసేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. పిల్లలే మనకు ప్రధానం అనుకోక΄ోవడం వల్ల ఈ దారుణ స్థితి ఉంది’ డాక్టర్‌ అమిత్‌ సేన్‌ అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌ పిల్లలకు ఎలాగైనా మానసిక చికిత్స అందించాలని ‘చిల్డ్రన్‌ ఫస్ట్‌’ అనే ఆన్‌లైన్‌ క్లినిక్‌ని నడుపుతున్నారు. కాని పల్లెటూరి పిల్లలకు ఇలాంటి సాయం ఉంటుందని కూడా తెలియడం లేదు అని వా΄ోయారాయన. వందమంది పిల్లల్లో ఒక్కరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు.

పరీక్షల మేళాలు జరగాలి
‘పరీక్షలంటే మార్కులు అని పిల్లల బుర్రల్లో ఎక్కించాం. కాని పరీక్ష రాస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం వచ్చింది అనే భావన పిల్లల్లో ఎక్కించాలి. నేర్చుకుని, ఆ నేర్చుకున్నది చూపుదాం అని పిల్లలు అనుకోవాలి తప్ప మార్కులు చూపిద్దాం అనుకోకూడదు. నా దృష్టిలో పిల్లలు పరీక్షలు ఎంజాయ్‌ చేయాలంటే పరీక్షల మేళాలు జరగాలి. మైదానాల్లో రకరకాల పరీక్షలు రాసేందుకు పిల్లలను ఆహ్వానించాలి. అక్కడే ఆ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ ఉంచాలి. పురాణాలు, క్రీడలు, భౌగోళిక ్రపాంతాలు, ఆరోగ్యం... ఇలా అనేక అంశాల మీద పరీక్షలు అక్కడికక్కడ రాయించాలి.

దాంతో పరీక్షల భయంపోతుంది’ అన్నారు నిమ్‌హాన్స్‌ (బెంగళూరు) సీనియర్‌ చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌ శేఖర్‌ శేషాద్రి. ‘పిల్లలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ముగ్గురు వారితో సున్నితంగా వ్యవహరించాలి. ఒకరు కుటుంబ సభ్యులు... రెండు స్కూల్‌ టీచర్లు... మూడు సమాజం అనే చుట్టుపక్కలవారు, బంధువులు. పిల్లలకు గౌరవం ఇవ్వాలి అని కూడా చాలామంది అనుకోరు’ అన్నారాయన. ‘చైల్డ్‌ అబ్యూజ్‌ జరిగినప్పుడు పిల్లలు వచ్చి చెప్పుకుంటే వారిని దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి... నువ్వే దీనికి కారణం అని నిందించే స్థితి ఉంది’ అన్నారాయన.

కోవిడ్‌ చేసిన మేలు
‘కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు కలిసి ఎక్కువసేపు గడిపే వీలు వచ్చింది. అప్పటికి గాని మన దేశంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారో పరస్పరం అర్థం కాలేదు. కోవిడ్‌ వల్ల బంధాలు బలపడ్డాయి. అది జరిగిన మేలు. అదే సమయంలో పిల్లల మానసిక సమస్యలు, ప్రవర్తనలు తల్లిదండ్రులకు తెలిసి వచ్చాయి. కాని వాటికి సరైన చికిత్స చేయించాలని మాత్రం అనుకోవడం లేదు’ అన్నారు నేహా కిర్‌పాల్‌. ఈమె పిల్లల మానసిక చికిత్స కోసం ‘అమాహహెల్త్‌’ అనే క్లినిక్‌ల వరుసను నడుపుతున్నారు.

‘పిల్లల మానసిక ఆహ్లాదానికి కళలు చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటీవల పిల్లల మానసిక సమస్యలకు ఆర్ట్స్‌ బేస్డ్‌ థెరపీలు బాగా ఉనికిలోకి వచ్చాయి’ అని తెలిపారు వారు.

– జైపూర్‌ నుంచి సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement