అర్ధరాత్రి.. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి లేచారు. ఈ టైంలో ఫోనా?! ఎవరికి ఏమైందోనన్న ఆందోళనతో మంచం పక్కనే ఉన్న ఫోన్ అందుకుని కంగారుగా స్క్రీన్ వైపు చూశారు. అంతే, ఆశ్చర్యం, కాసింత గందరగోళం.. ఎందుకంటే మీకు అస్సలు ఫోనే రాలేదు.
జన సమ్మర్థం ఉన్న ప్రాంతం.. అక్కడ మీరూ ఉన్నారు. అంతలో ఎవరిదో ఫోన్ రింగవుతోంది. ఆ వెంటనే మీ చేయి కూడా మీ జేబులో ఉన్న ఫోన్ మీదికి వెళ్లింది. మీ పక్కనే ఉన్న వ్యక్తి ‘హలో..’ అనడంతో మీకు అర్థమైంది.. రింగైంది మీ ఫోన్ కాదని. అసలు ఆ రింగ్ టోన్ కూడా మీ ఫోన్‌ది కాదు. ఆ విషయం మీకూ తెలుసు.. అయినా రింగ్ వినపడగానే మీ చేయి అలా మీ ఫోన్ మీదికి వెళ్లిపోయింది.
ఫుల్ ట్రాఫిక్.. బైక్‌పై వెళుతున్నారు. జేబులో ఉన్న మీ ఫోన్ అప్పటికే రెండు మూడు సార్లు రింగైంది. కానీ ఫోన్ బయటకు తీసి మాట్లాడలేని పరిస్థితి. ఎవరు ఎందుకు కాల్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ.. వేగంగా ట్రాఫిక్‌ను దాటి వెళ్లి బైక్‌ను అలా రోడ్డు పక్కన నిలిపి ఫోన్ బయటకు తీసి చూసి షాకయ్యారు. అక్కడ ఎలాంటి కాల్ రాలేదు. మరి రెండు మూడు సార్లు మీరు విన్న ఆ రింగ్ ఎక్కడిది?
ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలు..
ఓ అందమైన ఇల్లు.. ఆ ఇంట్లో మీరూ, మీ భార్య, ఇద్దరు పిల్లలు. మీరు బయటికి వెళ్లింది మొదలు.. ఇంట్లో ఎదురు చూపులు మొదలవుతాయి. ఉండబట్టలేక పిల్లలు అడిగేస్తారు.. నాన్న ఇంకెప్పుడొస్తారమ్మా? అని. ఆ నాన్న కోసమే ఎదురుచూస్తున్న అమ్మ.. ‘కాసేపట్లో వచ్చేస్తారులే’ అంటూ పిల్లలను సముదాయిస్తుంది. మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ఇక ఆ ఇంట్లో సందడే సందడి. పిల్లల అల్లరితో అది తార స్థాయికి చేరుతుంది. అప్పుడు ఆ ఇల్లు.. నందనవనాన్ని తలపిస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్న నానుడిని మరిపిస్తుంది.
అలాకాకుండా, మీరు ఇంట్లోకి వచ్చీ రావడంతోనే జేబులోంచి మొబైల్ తీసి దానికి అంకితమైపోతే.. గంటల తరబడి దానికే దాసోహమైతే.. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయేంతగా మీ ఫోనే మీకు ప్రపంచమైతే.. మీ ఇల్లాలి సంగతేంటి? నాన్నతో కలిసి అల్లరిచేయడం కోసం ఎదురుచూస్తున్న ఆ పసిబిడ్డల పరిస్థితేంటి? అటు మొబైల్‌తో మీరు.. ఇటు మీ పలకరింపు కోసం నిరీక్షిస్తూ మీ ఇల్లాలు, మీకు బోలెడన్ని కబుర్లు చెప్పాలని పరితపిస్తూ మీ పిల్లలు. ఇంట్లో నలుగురు ఉన్నా.. అంతా నిశ్శబ్ధం! మీకు, మీ భార్యాపిల్లలకు మధ్య అంతులేని అగాథం!
కుటుంబానికి టైం కేటాయించడానికి, మొబైల్‌తో టైంపాస్ చేయడానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి..
మనల్ని మనకు కాకుండా చేస్తుంది..
మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే యావత్ ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. అవసరం మేరకు దానిని వినియోగించుకుంటే.. అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా దానితో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఇలా అతిగా ఫోన్ వాడేవారు దానికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు, యువత పలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ వ్యసనం చాలా ప్రమాదకరం. మన జీవితంపై, మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మనల్ని మనకు కాకుండా చేస్తుంది. మన వారిని మనకు దూరం చేస్తుంది. సెల్‌ఫోనే మనకు జీవితమైనప్పుడు.. ఒంటరి తనాన్ని ఆశ్రయిస్తాం. స్నేహితులకు, బంధువులకు దూరమవుతాం. భార్యాబిడ్డలతోనే ఉంటున్నా.. వారికి అందనంత దూరంలో సెల్‌ఫోన్‌తో సేదదీరుతాం. నిద్ర రాదు.. ఆకలి వేయదు. కళ్లకు తప్ప మెదడుకు పని లేకపోవడంతో మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి తగ్గడమేగాక.. పలు మానసిక రుగ్మతలకు ద్వారాలు తెరుస్తుంది.
ఇలా అయితే బానిస అయినట్టే!
మీరు అదే పనిగా ఫోన్ చెక్ చేసుకుంటున్నారా? ఎలాంటి కాల్ రాకుండానే.. వ చ్చినట్టు, ఏ నోటిఫికేషన్ రాకుండానే ఏదో మెసేజ్ వ చ్చినట్టు భ్రమపడుతున్నారా? మీకు ఎలాంటి కాల్ వచ్చే పరిస్థితి లేకున్నా.. ఎవరైనా కాల్ చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారా? ఫోన్‌కు మెసేజ్ రావడమే ఆలస్యం.. చేస్తున్న పనిని ఉన్నఫళంగా వదిలేసి క్షణాల్లోనే వాటిని చూసేస్తున్నారా? సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్నారా? అవసరం ఉన్నా లేకున్నా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ లక్షణాలు, లేదా వీటిలో కొన్ని అయినా మీలో కనిపిస్తే.. మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అయినట్టే లెక్క.
ఒక్కసారి పరీక్షించుకుందాం..
మనం బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా ఓ సారి మొబైల్‌ను ఇంట్లోనే ఉంచుదాం. ఆ తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో గమనిద్దాం. ఏదో పోగొట్టుకున్నట్టు.. దేని మీదా ధ్యాస లేనట్టు.. చేసే పనిమీద ఏకాగ్రత కుదరనట్టు.. ఫోన్‌లో మునిగిఉన్న వాళ్లను చూస్తే ఉక్రోషం తన్నుకొస్తున్నట్టు.. ఆకలేస్తున్నా అన్నం తినబుద్ధికానట్టు.. చికాకు.. చిరాకు.. పిచ్చెక్కుతున్నట్టు.. వెంటనే ఇంటికి వెళ్లి ఫోన్ తీసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నట్టు.. ఇలా మనలో మెదులుతున్న ఆలోచనల స్థాయిని బట్టి తెలుసుకోవచ్చు.. మనం ఏ స్థాయిలో మొబైల్‌కు బానిసయ్యామో. ఫోన్‌కు బానిసవ్వడం అన్నది తీవ్రంగా ఉందనిపించినప్పుడు వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి.
సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం
ప్రతి దానికి సెల్ ఫోన్ మీద ఆధారపడటం ఎక్కువైంది. ఈ అడిక్షన్ అనేది.. సెల్‌ఫోన్ లేకుంటే రోజు గడవదేమో అన్న స్థితికి చేరుకుంది. కొద్దిసేపు మొబైల్ కనపడకపోయినా, చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోయినా ఆందోళనకు గురవుతున్నారు. ఫోన్ రింగ్ కాకున్నా రింగ్ టోన్ వినిపిస్తున్నట్టు అనిపించడాన్ని రింగ్సైటీ అంటారు. అదేపనిగా ఫోన్ వినియోగించడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. ఈ సమస్యకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం. – ఎం.లహరి, సైకాలజిస్ట్
నోటిఫికేషన్‌లు ఆపేద్దాం..
మన పనిలో మనం తలమునకలై ఉన్నప్పుడు ఫోన్‌కు వచ్చే అనవసర నోటిఫికేషన్లు మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. వాటి ప్రభావం మన పనితీరుపైనా పడుతుంది. ఫోన్‌కు నోటిఫికేషన్ రాగానే ఏదైనా ముఖ్యమైన మెస్సేజ్ వ చ్చిందేమోనని తెగ ఆరాటపడిపోతాం.
అందుకే సోషల్ మీడియా యాప్‌లకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లను ఆఫ్‌లో పెట్టుకోవడం ఉత్తమం.
అంతకు మించి సమయం ఇవ్వొద్దు..
రోజుకు ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం.. ఏయే యాప్‌లలో ఎక్కువసేపు గడుపుతున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందుకోసం మన మొబైల్లోనే ఆప్షన్‌లుంటాయి. మొబైల్ స్క్రీన్‌పై మనం గడుపుతున్న సమయాన్ని వాటి సాయంతో అంచనా వేస్తూ.. మన అవసరం మేర మాత్రమే ఫోన్‌ను వినియోగిస్తూ.. ఫోన్ వాడకం సమయాన్ని క్రమంగా తగ్గించుకుందాం.
ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం..
సాధారణంగా మనం ఖాళీగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. అలాగే వీకెండ్‌లలో వీడియోలు చూస్తూనో, గేమ్‌లు ఆడుతూనో లేదా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు చేస్తూనో గంటల తరబడి గడిపేస్తాం. అలా కాకుండా ఖాళీ వేళల్లో,సెలవులు, వీకెండ్‌లలో విశ్రాంతి తీసుకోవడం, స్నేహితులను కలవడం, లేదా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం వంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ప్రతి సమాచారానికి ఫోన్ల మీదే ఆధారపడకుండా.. పుస్తకాల నుంచీ పొందుతుండాలి.
బెడ్‌కు దూరంగా..
మొబైల్ మనకు పక్కనే ఉంటే దానిని వాడాలనిపిస్తుంది. నిద్రపట్టకపోయినా, మెలకువ వచ్చినా.. పక్కన ఫోన్ ఉంటే ఇట్టే అందుకుంటాం. ఈ అలవాటును అధిగమించాలంటే మన బెడ్‌కు దూరంగా.. మన చేతికి అందనంత దూరంలో ఫోన్ పెట్టుకోవడం ఉత్తమం. అసలు స్విచ్ఛాఫ్ చేసుకుంటే మరీ మేలు.
– తమనంపల్లి రాజేశ్వరరావు,ఏపీ సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment