ఆయనతో వేగలేకపోతున్నాను.!? | Suggest Remedy for Personality Disorder | Sakshi
Sakshi News home page

ఆయనతో వేగలేకపోతున్నాను.!?

Published Fri, Sep 13 2013 10:57 PM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

ఆయనతో వేగలేకపోతున్నాను.!?

ఆయనతో వేగలేకపోతున్నాను.!?

నా వయసు 50, మా వారి వయసు 54. మా పెళ్లై పాతికేళ్లయింది. మావారిది చిత్రమైన స్వభావం. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండటం వల్ల ఈయన ఉద్యోగం చేయటంలేదు. టీవీకి అతుక్కుపోయి హెల్త్‌ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. వాటిలో కొన్ని జబ్బులకి డాక్టర్లు చెప్పిన లక్షణాలలో ఒకటీ అరా తనకు ఉన్నా, ఆ జబ్బును తనకే ఆపాదించుకోవడం, డాక్టర్లు ఉప్పు, కారం, నూనె తగ్గించమంటే ఇంటిల్లిపాదినీ పథ్యం పెట్టడం, అందరినీ తిండి తినద్దంటూ ఇబ్బంది పెడతారు. ఎప్పుడు పడితే అప్పుడు యోగా చేయడం, వర్షం పడుతున్నా, స్విమ్మింగ్‌కెళ్లటం... ఇంట్లో ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే పట్టించుకోరు. ముందు ముందు ఆయనతో    జీవితం ఎలా గడపాలో అర్థం కావడం లేదు.  దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
  - కృష్ణవేణి, విశాఖపట్నం

 
 మీరు రాసిన లెటర్‌ను చదివాక మీరు ఆయనతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోంది. మీ వారి ప్రవర్తన ‘పర్సనాలిటీ డిజార్డర్’ కిందికి వస్తుంది. ఇటువంటి వారు తమకు తోచింది చేస్తూ, ఇతరులు ఏమైపోతున్నా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ప్రతిదానిలోనూ తమదే కరెక్టనీ, అందరూ తమలాగే ఉండాలనీ, తాము చెప్పిందే చేయాలనీ అనుకుంటారు. ఫలితంగా తమకంటూ స్నేహితులెవరూ మిగలకుండా చేసుకుంటారు. బంధుత్వాలు వదులుకుంటారు.
 
 మీది... అన్నీ పద్ధతి ప్రకారం జరగాలనుకునే మనస్తత్వంలా కనిపిస్తోంది. మీ ఇద్దరి స్వభావాలూ పరస్పర విరుద్ధమైనవి. ఇన్నాళ్లపాటు మీరు ఆయనతో అడ్జస్ట్ అవడం అభినందనీయం.
 
 మీరు తరచు ఆయన మనస్తత్వం గురించే ఆలోచించడం, బాధపడటం మంచిది కాదు. ఇటువంటివారిని వారి మానాన వారిని వదిలేసి, దేనికీ వారిపై ఆధారపడకుండా, వాదించకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోవటం మంచిది. దానిమూలంగా మీరు కూడా మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు, ఆయన ఇద్దరూ కలిసి పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో బాధపడేవారిని డీల్ చేయడంలో నిపుణులైన మంచి సైకాలజిస్టును లేదా సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం అవసరం.
 
 డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
 సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement