కాశ్మీర దేశాన్ని పూర్వం వసువు అనే మహారాజు పరిపాలించేవాడు. ధర్మాధర్మాలు ఎరిగిన వసువు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. నిత్యం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ దేవతలను తృప్తిపరచేవాడు. నిరంతరం శ్రీమన్నారాయణుడినే మనసులో నిలుపుకొని ధర్మబద్ధ జీవనాన్ని కొనసాగించేవాడు.
కొన్నాళ్లకు వసు మహారాజుకు మోక్ష కాంక్ష ఎక్కువైంది. రాజ్యభారాన్ని విడిచి, తపస్సు ద్వారా మోక్షాన్ని సాధించాలనే కోరిక పెరగడంతో, ఒకనాడు తన సోదరుల్లో సర్వసమర్థుడైన వివస్వంతుడిని పిలిచి, అతడి కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించాడు. తర్వాత బంధుమిత్ర పరివారాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.
కాలినడకన సాగుతూ దారిలో ఉన్న తీర్థాలన్నీ దర్శించుకుంటూ పరంధాముడైన శ్రీమన్నారాయణుడు పుండరీకాక్షుడిగా కొలువైన పుష్కర తీర్థానికి చేరుకున్నాడు. తన తపస్సుకు అనువైన క్షేత్రం పుష్కర తీర్థమేనని తలచి, అక్కడ తగిన చోటు వెదుక్కుని తపోదీక్షలో కూర్చున్నాడు. శరీరం శుష్కించిపోయేలా కఠోర తపస్సు సాగించాడు. పుండరీకాక్షుడే పరమదైవంగా భావిస్తూ ఒకనాడు ఆశువుగా స్తోత్రాన్ని పఠించసాగాడు.
‘నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన/ నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే/ విశ్వమూర్తి మహాబాహుం వరదం సర్వతేజసమ్/ నమామి పుండరీకాక్షం విద్యా విద్యాత్మకం ప్రభుం/ ఆదిదేవం మహాదేవం వేద వేదాంగ పారగం/ గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనం..’ అంటూ వసు మహారాజు పుండరీకాక్ష పారస్తుతిని పఠిస్తుండగా, ఒక్కసారిగా అతడి ముందు ఒక భయంకరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. తుమ్మమొద్దులాంటి నల్లని దేహంతో, చింతనిప్పుల్లాంటి ఎర్రని కళ్లతో ఉన్నాడు. అతడు ‘రాజా! ఏమి ఆజ్ఞ!’ అని అడిగాడు.
ఈ పరిణామానికి వసు మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘ఓయీ కిరాతకా! ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాడు.
‘రాజా! పూర్వం నువ్వు దక్షిణపథాన ధర్మప్రభువుగా ఉన్నావు. ఒకనాడు మృగయావినోదం కోసం అడవికి వెళ్లావు. అక్కడ జంతువులను వేటాడుతూ నువ్వు సంధించిన బాణం పొరపాటున ఒక మునికి తగిలింది. ముని ఆర్తనాదం విని నువ్వు హుటాహుటిన అతడి వద్దకు చేరుకున్నావు. అప్పటికే అతడు మరణించాడు. అనుకోని ఆ సంఘటనకు నీలో ఆందోళన కలిగింది. బ్రహ్మహత్యకు పాల్పడినందుకు బాధతో లోలోపలే కుమిలిపోయావు. రాజ్యానికి చేరుకున్న తర్వాత ఈ వృత్తాంతాన్ని నీ ఆంతరంగికుడికి చెప్పావు. అయినా అపరాధ భావన నీ మనసును తొలిచేయసాగింది. ఎలాగైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుదామని భావించావు. శ్రీమన్నారాయణుడిని మనసారా ధ్యానించి ద్వాదశినాడు ఉపవాసం ఉన్నావు. ఆ పుణ్యదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం ఒక బ్రాహ్మణుడికి గోదానం చేశావు. ఆ వెంటనే ఉదరశూలతో బాధపడుతూ నువ్వు ప్రాణాలు వదిలావు. ప్రాణాలు వదులుతున్న సమయంలో అప్పటి నీ భార్య ‘నారాయణి’ పేరును ఉచ్చరించావు. ఆ కారణంగా నీకు ఒక కల్పం వరకు విష్ణులోక నివాసయోగం లభించింది.
రాజా! నేనొక బ్రహ్మరాక్షసుడిని. అత్యంత ఘోరమైన వాణ్ణి. నీ దేహంలోనే ఉన్న నాకు ఇదంతా తెలుసు. నేను నిన్నెలాగైనా పీడించాలని అనుకున్నాను. ఇంతలో విష్ణుదూతలు నన్ను బయటకు లాగి రోకళ్లతో చావగొట్టారు. ఇక లోపలికి ప్రవేశించలేక నీ రోమకూపాల నుంచి పూర్తిగా బయటపడ్డాను. నువ్వు స్వర్గంలోకి ప్రవేశించావు. నీలో నా తేజస్సును నింపి నేను కూడా నీతో పాటు స్వర్గానికి వచ్చాను. ఇదంతా గడచిన కల్పంలో జరిగిన చరిత్ర.
ఈ కల్పంలో నువ్వు కాశ్మీర రాజకుమారుడిగా జన్మించావు. ఆనాటి నుంచి నేను నీ రోమకూపాల్లోనే ఉండిపోయాను. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప యాగాలు చేశావు. అవేవీ నన్ను ఏమీ చేయలేకపోయాయి. అయితే, రాజా! ఇప్పుడు నువ్వు పుండరీకాక్ష పారస్తుతిని పఠించగానే నేను నీ రోమకూపాల నుంచి బయటపడి, ఇలా కిరాతుడిలా ఏకరూపాన్ని పొందాను. పరమాత్ముడి స్తోత్రాన్ని విని పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి విముక్తిని పొందాను. నాకిప్పుడు ధర్మబుద్ధి కలిగింది’ అని చెప్పాడు.
కిరాతుడి ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న వసు మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. తన జన్మాంతర వృత్తాంతాన్ని చెప్పిన కిరాతుడిని వరం కోరుకోమన్నాడు. పరమాత్మ జ్ఞానం తప్ప తనకు వరమేదీ అక్కర్లేదన్నాడు కిరాతుడు.
‘ఓ కిరాతుడా! నీ వల్ల నా పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసుకున్నాను. నీకు అనేకానేక కృతజ్ఞతలు. ఇకపై నువ్వు నా అనుగ్రహంతో ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధి పొందుతావు. జ్ఞానమార్గంలో మోక్షం పొందుతావు. పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుడే పరమదైవమని తలచి, భక్తిశ్రద్ధలతో ఈ పుండరీకాక్ష పారస్తుతిని పారాయణం చేసిన వారికి, ఆలకించిన వారికి పుష్కరతీర్థంలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది’ అని పలికాడు వసు మహారాజు. వెంటనే అతడి ముందు ఒక దివ్యవిమానం వచ్చి నిలిచింది. దేవదూతలు అతడికి సాదరంగా స్వాగతం పలికారు. తమతో పాటు విమానంలోకి ఎక్కించుకుని, వసు మహారాజును స్వర్గానికి తీసుకుపోయారు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment