ఆ ఇంట్లో ఇల్లాలు వంటచేస్తూ అందులో నిమగ్నమై పోయింది. ఆ రోజు భిక్షు సంఘాన్ని భిక్ష కోసం ఆహ్వానించారు ఆ గృహస్తులు. ఆమెకు ఒక నెలల బిడ్డ. ఆ బిడ్డడిని ఇంటిముందు దుప్పటి మీద పడుకోబెట్టారు. ఇద్దరు పిల్లలు ఆడిస్తున్నారు. ఆ పసివాడు వెల్లకిలా పడుకుని, కాళ్ళూ చేతులూ ఆడిస్తూ బోసినవ్వులు చిందిస్తున్నాడు.
ఆమె వంటగదిలోంచి అప్పుడప్పుడూ ఆ పిల్లలకేసి చూస్తూనే ఉంది. కొంత సమయం గడిచింది. ఇంటి యజమాని కావడితో మంచినీరు తెచ్చి ఇంట్లో విశాలమైన మధ్య గదిలో ఉంచాడు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు పెద్దగా అరిచాడు.
‘‘అమ్మా! భిక్షువులు వస్తున్నారు’’ అంటూ ఆ వీధి చాలా ΄÷డవైంది. ఆ వీధిలోకి అప్పుడే వచ్చారు భిక్షుగణం. భిక్షగా సమర్పించే ఆహార పదార్థాలన్నీ పూర్తయ్యాయి. వాటిని గిన్నెల్లోకి సర్దుతోంది. ఇంతలో బయట ఏదో శబ్దం వినపడింది. కోడె దూడ ఒకటి చెంగుచెంగున ఎగురుతూ, తోక ఎత్తి అటుకేసి వచ్చింది. పసి పిల్లవాణ్ణి అక్కడే ఉంచి, మిగిలిన ఇద్దరు పిల్లలూ ఇంట్లోకి పరుగు తీశారు. ఇల్లాలికి విషయం అర్థమై, వేగంగా బైటికి పరుగు తీసింది.
కానీ... అప్పటికే ఆ గిత్తదూడ వచ్చేసింది. ఆరుబయట పడుకున్న పిల్లవాడి మీదగా దూకి వెళ్ళిపోయింది. ఆమెకు గుండె ఆగినంత పని అయింది. ఆమె వెళ్ళేసరికి... చిరునవ్వులు చిందిస్తూ బోసి నోటితో ఊ కొడుతున్నాడు ఆ బిడ్డ. కొంతసేపటికి భిక్షువులు వచ్చారు. వారు భిక్ష పూర్తి చేశాక ధర్మోపదేశం చేశారు. అప్పుడు వారికి ప్రమాదం తప్పిన పిల్లవాని గురించి తెలిసింది.
‘‘చేశారా! ఆ బాలుడు స్థిరచిత్తుడు. స్థిత ప్రజ్ఞుడు. చావు ముందుకొస్తున్నా చిరునవ్వు చెదరనివాడు’’ అన్నాడు ఆ భిక్షువు.
‘‘అవును. కుశల సంపన్నుడు అజేయుడు’’ అన్నాడు మరో భిక్షువు. పాపకర్మలు చేయనివాడు, మోసపు మాటలు ఎరుగని వాడు, పాప సంకల్పాలు తెలియని వాడు. అందుకే స్థిరచిత్తుడు’’ అన్నాడు మొదటి భిక్షువు.
వారు అలా వాద సంవాదాలు చేసుకుంటూ ఆరామానికి చేరారు. అక్కడా ఇదే సంఘటన చెప్పి, అదే చర్చ కొనసాగించారు. అలా చర్చించే వారంతా కొత్తగా వచ్చిన వారే.
వారి మధ్య మాటలు జరుగుతూ ఉండగా బుద్ధుడు అక్కడికి వచ్చాడు. భిక్షువులందరూ నిశ్శబ్దం పాటించారు.
‘‘భిక్షువులారా! ఇపుడు మీరు వాదులాడుకుంటున్న విషయం ఏమిటి?’ అని అడిగాడు.
విషయమంతా తెలుసుకున్నాడు.
‘‘భిక్షువులారా! శరీరంతో పాప కర్మలు చేయని వారు, పాపపు మాటలు మాట్లాడనివారు, పాప సంకల్పాలు చేయని వారు, పాప జీవనం కొనసాగించనివారు ఈ నాలుగు ధర్మాల్ని పాటించేవారు కుశల సంపన్నులే. అజేయులే! అత్యున్నత స్థితిని పొందినవారే! అయితే పసివారు ఇవేవీ చేయరు కాబట్టి వారు అజేయులు కారు. ఎందుకంటే.... వారు వెల్లకిలా పడుకుని మాత్రమే ఉండగలరు. వారు తమ శరీరంతో ఏ కర్మలూ చేయలేరు. వారికి నోరుంటుంది.
నవ్వు, ఏడుపులు ఉంటాయి తప్ప, తప్పు ఒప్పులు మాట్లాడలేరు. అంటే... మాటల ద్వారా కర్మలాచరించలేరు. అలాగే... అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఆలోచనలు వారికి ఉండవు. కాబట్టి సంకల్పాలూ ఉండవు. ఇక, తాను అది తినాలి ఇది తినాలిఅని ఎలా ఉండదో... ఆ తిండిని ఏదో ఒక మార్గంలో, మంచిగానో చెడుగానో సంపాదించి తినాలి అనే కోరికా ఉండదు. తల్లిపాలు తాగడం తప్ప... మరే విధమైన జీవన కర్మలు చేయరు. పసిపిల్లవాణ్ణి కర్మలతో కొలవకూడదు.
పెరిగి పెద్దయ్యాక కలిగే అనేక వికారాల నుండి, దోషాల నుండి, స్వార్థాల నుండి బైటపడిన వారినే కుశల సంపన్నులుగా, అజేయునిగా భావించాలి. అలాంటి నిస్వార్థ జీవనాన్ని కీర్తించాలి. అ నాలుగు ధర్మాల్ని ధరించిన వారికి అపజయం కలగదు. ప్రమాదం వచ్చి మీద పడుతున్నా చిరునవ్వు చెరగదు.’’ అన్నాడు. పాపకర్మలు చేసే అవకాశం ఉన్నా చేయని వారు పాపపు జీవన విధానం ఎదుటే ఉన్నా దాన్ని స్వీకరించని వారు... ఇలాంటి వారు మాత్రమే అజేయులు. ఎందుకంటే వారు తమని తాము జయించుకుంటారు కాబట్టి అనే విషయం వారికి అర్థమైంది. ఆ కొత్త భిక్షువులు బుద్ధునికి ప్రణమిల్లారు. – డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment