మాస్టర్ యాన్
కొత్త కోణం
బౌద్ధాన్ని వ్యాప్తి చేయడానికి అక్కడి సంస్కృతినీ, సాహిత్యాన్నీ, భాషనూ, సంగీతాన్నీ, సాధనాలుగా వాడుకోవాలే తప్ప బయటి సంస్కృతీ సంప్రదాయాలను భాషను స్థానిక ప్రజలపై రుద్దకూడదనేది ఆయన బలమైన అభిప్రాయం. స్థానిక సంస్కృతిని పరిరక్షిస్తూనే బుద్ధుని బోధనలను అక్కడి ప్రజల జీవితాల్లో భాగం చేయాలనేది కూడా మాస్టర్ సింగ్ యూన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి విషయాన్నీ స్థానిక భాషల్లోకి అనువదించి బోధించాలనేది మాస్టర్ ఆదేశం.
‘ఫో గ్వాంగ్ షాన్’ ఇవి మూడు పదాలు. ‘మాస్టర్ సింగ్ యూన్’ అనేవి కూడా మూడు పదాలే. ఫో గ్వాంగ్ షాన్ అంటే చైనా భాషలో బౌద్ధకాంతి పర్వతం అని అర్థం. ఆ పర్వతం ఈ రోజు ప్రపంచమంతటికీ వెలుగులు విరజిమ్ముతోంది. అలనాడు బౌద్ధం పంచిన వెలుగును నేడు కూడా విశ్వవ్యాప్తం కావడానికి ఒకే ఒక్క వ్యక్తి కృషి, పట్టుదల కారణమవుతున్నాయంటే నమ్మశక్యం కాదేమో కానీ, అదే నిజం. ఆ వ్యక్తి మాస్టర్ సింగ్ యూన్. ఆయన వయస్సు ఇప్పుడు 90 ఏళ్లు. ఇప్పటికీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన ఆయన జన్మదినం. వేలాది మంది బౌద్ధ భిక్షువులతో ఆ సందర్భంగా జరిగిన సమావేశం, అందులో దర్శనమిచ్చిన సంఘటిత శక్తి ఆయన కృషికి ప్రత్యక్ష నిదర్శనం.
మాస్టర్ సింగ్ యూన్ 1927లో చైనాలోని చియాంగ్స్ రాష్ట్రంలోని చియాంక్తులో జన్మించారు. పన్నెండవ యేటనే బౌద్ధ భిక్షువుగా మారారు. ఆయన భిక్షువుగా మారిన తీరు కూడా ఆశ్చర్యకరమే. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సమయమది. వ్యాపారం చేసిన ఆయన తండ్రి సమీపంలోని పట్టణానికి తరచూ వెళ్లి వస్తుండేవాడు. అలా వెళ్లిన తండ్రి ఒకరోజు తిరిగి రాలేదు. ఆయనను వెతుక్కుంటూ తల్లితో పాటు వెళ్లిన సింగ్ యూన్‌కు నిరాశే ఎదురయ్యింది. తిరిగి వస్తుండగానే ఒక బౌద్ధ భిక్షువు కనిపించి క్షేమ సమాచారాలు అడిగారు.
నీవు భిక్షువుగా మారమని ఆయనే సూచించారు. దానికి యూన్ వెంటనే సరేనంటూ∙సమాధానం ఇచ్చినట్టు తన ప్రసంగాలలో పేర్కొంటూ ఉంటారు. కానీ తల్లి మాత్రం ‘భర్తను పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోలేను’ అని తేల్చి చెప్పింది. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేననీ, బౌద్ధ భిక్షువుగా మారతాననీ చెప్పి యూన్ వెళ్లిపోయారు. పదేళ్లు చైనాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొంది, 1949లో బౌద్ధం వ్యాప్తి కోసం తైవాన్ ద్వీపానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులు మాస్టర్ సింగ్ యూన్‌ను కలవరపరిచాయి. ప్రజలు మూఢ నమ్మకాలతో, వ్యసనాలతో, ముఖ్యంగా నల్లమందు బానిసలుగా జీవనం గడుపుతున్నారు.
అయితే సింగ్ యూన్ మొదటే అలాంటి వారితో బౌద్ధం గురించి ముచ్చటించకుండా సంగీతం, విద్యాబుద్ధులు నేర్పుతూ, ఇతర నైపుణ్యాలను అందిస్తూ చేరువయ్యారు. ఆయన మొదటిగా ఒక పత్రికను కూడా స్థాపించారు. బౌద్ధం అవసరాన్నీ, మనిషిగా జీవించడానికి కావలసిన విధానాన్నీ ఆ పత్రిక ద్వారా అందించారు. స్వయంగా చిత్రకారుడు కూడా కావడంతో ఆ ప్రాంతంలోని బాలలను సమీకరించి, మంచి జీవితాన్ని ఎలా కొనసాగించాలో చిత్రకళతో నేర్పారు.
హ్యూమనిస్టిక్ బుద్ధిజం
అదొక ప్రారంభం మాత్రమే. ఇక్కడే సింగ్ యూన్ నూతన ఒరవడికి పునాది వేశారు. తన ఆచరణ నుంచే కొత్త ఆలోచనలకు రూపకల్పన చేశారు. అప్పటివరకు భిక్షువులు ఆరామాలకు పరిమితమై సజీవమైన ఆలోచనలకూ, ఆచరణకూ దూరమయ్యారు. అటువంటి విధానానికి స్వస్తి పలికి, బౌద్ధం ఒక ఆదర్శవంతమైన జీవన విధానానికి మార్గదర్శకంగా ఉండేందుకు, ప్రజలందరికీ చేరువ కావడానికి కార్యక్రమం రూపొందించుకోవాలని యూన్ నిర్ణయించుకొన్నారు. దానినే ఆయన హ్యూమనిస్టిక్ బుద్ధిజం అని పేర్కొన్నారు.
ఇది మూడు నాల్గు అంశాలను ప్రముఖంగా ముందుకు తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనవి– మనిషి కేంద్రంగా ధర్మం పనిచేయాలి, మనిషి అభివృద్ధిలో అది భాగం కావాలి, బుద్ధుని ఆలోచనలు నిత్యజీవితంలో ఆచరణ యోగ్యంగా ఉండాలి. బుద్ధుని అష్టాంగ మార్గం నుంచి మూడు విషయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఒకటి మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి చేతలు ఉండాలని ఉద్బోధించారాయన. ఆరామాలను కేవలం ధ్యానమందిరాలుగా, ప్రార్థనా స్థలాలుగా మిగల్చకుండా ప్రతీ చోటా బాలల కోసం విద్యాలయాలను నెలకొల్పి వాటితో అనుసంధానం చేశారు. చదువుతోపాటు నైపుణ్యాలను జోడించి జీవితాన్ని స్వతంత్రంగా, స్వేచ్ఛగా గడపడానికి కావాల్సిన పునాదులను వేశారు.
అందులోనే మానవత్వాన్ని ముఖ్యమైన అంశంగా మాస్టర్ యూన్ ముందుకు తీసుకొచ్చారు. అనాథలు, వృద్ధులు, పేదలలో ఒక విశ్వాసాన్ని కలిగించడానికి కావలసిన కార్యక్రమాలను రూపొందించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే కేంద్రాలుగా బౌద్ధారామాలను మార్చారు. సాంస్కృతిక పరమైన చైతన్యాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసారు. ప్రతీ బౌద్ధారామంలో గ్రంథాలయం, పురావస్తు ప్రదర్శన శాలలతో పాటు ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. చిన్నారుల నుంచి వృద్ధులదాకా బుద్ధుని బోధనలను చిత్రలేఖనంతో ప్రచారం చేసే నైపుణ్యాన్ని ఆర్ట్ గ్యాలరీల ద్వారా అందించారు.
భిక్షువులే సమాజ సేవకులు
భిక్షువులను తయారు చేసేందుకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం బౌద్ధారామాలలో కొత్తదేమీ కాదు. కానీ, ఫో గ్వాంగ్ షాన్ కేంద్రాలు వీటికి మాత్రమే పరిమితం కాలేదు. బౌద్ధ భిక్షువులకు సామాజిక సేవాకార్యకర్తలుగా కూడా తర్ఫీదునిస్తున్నాయి. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు గానీ మరే ఇతర అవసరాల సమయంలోగానీ వీరంతా సామాజిక సేవలో భాగమవుతున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్యలతో పాటు విశ్వవిద్యాలయం స్థాయి చదువులను కూడా ఈ సంస్థ అందిస్తున్నది. అందులో భాగంగానే తైవాన్‌లో రెండు, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఆఫ్రికాలో కూడా ఒక్కొక్కటి చొప్పున విశ్వవిద్యాలయాలను స్థాపించి, నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు దాదాపు వేలాది మంది యువతీయువకులకు బౌద్ధ భిక్షువులుగా శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే, రెండోవైపు కోట్లాదిగా ఉన్న బౌద్ధ అనుయాయులను సంఘటితపర్చడం కోసం ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేశారు. దానిపేరే ‘బుద్ధిస్టు లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్’(బిఎల్‌ఐఏ). 1992లో ప్రారంభమైన ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమితి గుర్తింపును కూడా పొందింది. కాలిఫోర్నియాలోని సిలాయీ బౌద్ధ విహారం దీని ప్రధాన కేంద్రం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో దీనికి శాఖలున్నాయి.
మన దేశంలో తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో దీని విభాగాలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థ చాలా సేవా కార్యక్రమాలను చేపడుతున్నది. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించడంతో పాటు అనేక పత్రికలను, టీవీ చానళ్లను, ప్రచురణలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. ఎన్నో ప్రాంతాల్లో సంచార గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. బౌద్ధంలో క్రియాశీలకంగా ఉన్న వారి కోసం ప్రత్యేకించి స్కౌట్స్, అండ్ గైడ్స్ సంస్థను కూడా ప్రారంభించారు.
మరొక ముఖ్యమైన అంశం ఫో గ్వాంగ్ షాన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం. ఈ కార్యాలయం తైవాన్‌లోని కౌషియాంగ్ రాష్ట్రంలోనే దాష్ పట్టణం సమీపంలో ఒక కొండ మీద కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిం చారు. ఈ కేంద్ర కార్యాలయాన్ని మూడు భాగాలుగా విభజించారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ప్రవచించిన బౌద్ధం, ధమ్మం, సంఘం అనే త్రిరత్నాలు దీనికి ప్రాతిపదిక. మొదట సంఘ విహారాన్ని నిర్మించాడు.
ఇందులో బౌద్ధ భిక్షువులకు శిక్షణ మందిరాలు, విడిదిగదులతో పాటు దాదాపు పదివేల మంది ఒకేసారి సమావేశమయ్యేందుకు వీలుగా మందిరాలను నిర్మించారు. పదివేల బుద్ధ ప్రతిమలతో నిర్మించిన ఒక సమావేశ మందిరం అద్భుతం. నాగార్జునసాగర్‌లో నెలకొల్పబోతున్న బుద్ధవనం ప్రాజెక్టులో ఫో గ్వాంగ్ షాన్ తరహాలోనే ఒక సంస్థను రూపొందించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ఈ వ్యాసకర్త సహా ఒక బృందం ఇటీవల తైవాన్‌లో పర్యటించి వచ్చింది.
బుద్ధ స్మారక కేంద్ర నిర్మాణం రెండవది.. దీని విస్తీర్ణం 250 ఎకరాలు. ఇందులో 150 అడుగుల బుద్ధుని విగ్రహంతో పాటు దాని అడుగు భాగాన ఒక మందిరంలో గౌతమ బుద్ధుని ధాతువు కూడా ఉంచారు. బుద్ధుని అష్టాంగమార్గానికి సంకేతంగా 8 పగోడాలను నిర్మించారు. చైనా ఆర్కిటెక్చర్‌లో పగోడా ఒక విధమైన కట్టడం. ఈ ఎనిమిది పగోడాలలో ఎనిమిది విషయాలకు సంబంధించిన అంశాలను పొందుపర్చారు.
ఒకటి బోధనకు. రెండవది సమావేశం. మూడవది మూడు మంచి విషయాలు, మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి చేతలు, నాల్గవది ఇతరులకు విశ్వాసాన్నీ, సంతోషాన్నీ, భరోసాను ఆదరణను అందించేది, ఐదవది సామరస్యం, ఆరు పరిపూర్ణత, ఏడు చెడును దరిచేరనీయక పోవడం, ఎనిమిది అష్టాంగమార్గాన్ని బోధించేందుకు సంకేతాలుగా నిర్మించారు. ఫో గ్వాంగ్ షాన్‌లోని మూడవ భాగాన్ని ధమ్మ సంకేతంగా ఒక భవనాన్ని ఇటీవలే నిర్మించారు. ఇందులో ప్రధానంగా ధ్యాన మందిరం, గ్రంథాలయం, ఆర్ట్ గ్యాలరీ లాంటివి నిర్మిస్తున్నారు.
భారతదేశమంటే గౌరవం
ఇప్పటికీ ప్రపంచంలోని దాదాపు 200 కేంద్రాల్లో ఈ సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు శాక్యముని బుద్ధగా వారు పిలుచుకుంటున్న గౌతమ బుద్ధుని జన్మస్థలం భారత దేశ మంటే వారికి ఎనలేని గౌరవం. ఫో గ్వాంగ్ షాన్ సంస్థ బౌద్ధంలోని మహా యాన మార్గాన్ని అనుసరిస్తున్నది. ఆచార్య నాగార్జునుడు వ్యవస్థాపకుడుగా రూపొందిన మహాయానం వారికి అత్యంత పవిత్రమైనది. మహాయానం ఆవిర్భవించిన తెలుగునేల అంటే కూడా వారికి అభిమానం. ఈ సంస్థ మహా యాన మార్గాన్ని విశ్వసిస్తున్నప్పటికీ బౌద్ధంలోని అన్ని శాఖలను సమాన స్థాయిలోనే గౌరవిస్తున్నది. అంతేకాకుండా ప్రపంచంలోని ప్రధాన మతాలపట్ల సంస్థ స్నేహభావంతో వ్యవహరిస్తున్నది. ప్రతి సంవత్సరం క్రిస్‌మస్ రోజున సర్వమత సమ్మేళనాలు నిర్వహించడం వీరి ప్రత్యేకత.
ఈ సంస్థ వ్యవస్థాపకుడు మాస్టర్ సింగ్ యూన్ ప్రతిపాదించిన మరొక ముఖ్యమైన అంశం స్థానిక సంస్కృతి పరిరక్షణ. బౌద్ధాన్ని వ్యాప్తి చేయడానికి అక్కడి సంస్కృతినీ, సాహిత్యాన్నీ, భాషనూ, సంగీతాన్నీ, సాధనాలుగా వాడుకోవాలే తప్ప బయటి సంస్కృతీ సంప్రదాయాలను భాషను స్థానిక ప్రజలపై రుద్దకూడదనేది ఆయన బలమైన అభిప్రాయం. స్థానిక సంస్కృతిని పరిరక్షిస్తూనే బుద్ధుని బోధనలను అక్కడి ప్రజల జీవితాల్లో భాగం చేయాలనేది కూడా మాస్టర్ సింగ్ యూన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి విషయాన్నీ స్థానిక భాషల్లోకి అనువదించి బోధించాలనేది మాస్టర్ ఆదేశం. బ్రెజిల్ నుంచి ఇండియా దాకా ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఈ సంస్థ బౌద్ధాన్ని అక్కడి స్థానిక పరిస్థితులకు జోడించి అన్వయించి ప్రబోధిస్తున్నది. వ్యాప్తి చేస్తున్నది. ఫో గ్వాంగ్ షాన్ చేస్తున్న కృషి బౌద్ధాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తం చేసే బౌద్ధ కాంతి శిఖరంగా వెలుగొందుతుంది.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మల్లెపల్లి లక్ష్మయ్య
97055 66213