సద్ధర్మంఅది శ్రావస్తి నగరానికి దాపున ఉన్న జేతవనం. ఆ వనం మధ్యలో ఉన్న ఆనందబోధి వృక్షం కింద ప్రశాంత వదనంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షు సంఘం ఆ చెట్టు చల్లని నీడలో కూర్చొని ఉన్నారు. వారు ధరించిన కాషాయ వస్త్రాలు కాంతిమంతంగా ఉన్నాయి. ఆ వెలుగు వారి దేహం మీద పడి ప్రకాశిస్తోంది. ‘‘భిక్షువులారా! మనం ఎలాంటి ధర్మాన్ని తెలుసుకోవాలి? ఎలాంటి ధర్మాన్ని సేవించాలి? ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి? అని ఆలోచించాలి’’ అన్నాడు గంభీరంగా.
భిక్షువులందరూ ప్రశాంతంగా వినసాగారు. మనం పాటించే ధర్మం నాలుగు విధాల ఫలితాలనిస్తుంది. అందులో మొదటిది విషపదార్థం కలిసిన చేదు గుమ్మడికాయ రసం లాంటిది. దీని రుచీ, వాసన, రంగూ ఏదీ బాగోదు. పైగా తాగితే ప్రమాదం కూడా. అలాగే... వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దుఃఖాన్ని ఇచ్చే ధర్మం అలాంటిది.అలాంటి కుశలం ఇవ్వని ధర్మాన్ని గ్రహించి దూరంగా ఉండాలి.
ఇక, రెండోరకం ధర్మాచరణ బంగారు పాత్రలో ఉన్న కుళ్ళిన పదార్థం లాంటిది. ఈ పదార్థం రంగు, రుచి, వాసనలు ఇంపుగా ఉంటాయి. పైగా బంగారు పాత్రలో ఉంది. కానీ, దీన్ని సేవిస్తే అనారోగ్యం కలిగి, ప్రాణాలకే ముప్పు. వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘకాలంలో దుఃఖాన్ని ఇచ్చే ధర్మాచరణ ఇలాంటిది. మరి, భిక్షువులారా! ఒక చెక్క పాత్ర ఉంది. దానిలో ఎన్నో మూలికలతో మరిగిన మూత్రం ఉంది. పాండు రోగానికి అది మంచి ఔషధం. దాని రంగు, రుచి, వాసనలు ఏవీ బాగోలేదు. అయినా దాన్ని సేవిస్తే రోగం తగ్గుతుంది. ఉపశమనం కలుగుతుంది. అలాగే... వర్తమానంలో దుఃఖాన్ని, దీర్ఘకాలంలో సుఖాన్ని ఇచ్చే ధర్మాచరణ కూడా ఇలాంటిదే!’’ అన్నాడు.
‘‘అలాగే... ఒక పాత్రలో పెరుగు, తేనె, నెయ్యి కలిపిన బెల్లం రసం ఉంది. అది కడుపులో బాధల్ని హరించే ఔషధం. ఆ బెల్లం రసం రంగు బాగుంటుంది. రుచి బాగుంటుంది. వాసన కూడా బాగుంటుంది. అది చేసే మేలు కూడా బాగుంటుంది. ఇలా వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘ కాలంలో కూడా సుఖాన్ని ఇచ్చేది సద్ధర్మం.’’
‘‘భిక్షువులారా! సద్ధర్మం అనేది శరత్కాలంలోని సూర్యుని కాంతి లాంటిది. అది ప్రకాశిస్తుంది. మనిషి దుఃఖాన్ని పారద్రోలుతుంది’’ అని చెప్పి, అందరి వంకా ఓసారి చూశాడు. అందరి మనస్సుల్లోని ఉషస్సు వారందరి ముఖాల్లో తేజస్సుగా ప్రతిఫలిస్తోంది!
– డా. బొర్రా గోవర్ధన్
(చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా ప్రకాశిస్తూ నేఉంటుంది!)
Comments
Please login to add a commentAdd a comment