
మనుష్యుల మధ్య మాటల కన్నా స్పర్శ ఎన్నో అనుభూతులను, ఎన్నో సంగతులను చెబుతుంది. భావోద్వేగాలను తెలియజేయడానికి కౌగిలి ఒక శక్తిమంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది. ప్రేమ, కృతజ్ఞతల నుంచి కోపం భయం వరకు స్పర్శ ద్వారా వ్యక్తీకరించబడిన భావోద్వేగాలను కౌగిలి, శబ్ద భాషకు మించిన సంబంధాన్ని పెంపొందిస్తుంది, అవగాహనను, సానుభూతిని ప్రోత్సహిస్తుంది.
శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని రాజ్యానికి వెళ్లిపోతాడు. కణ్వమహర్షి తన కూతురిని, మనుమడిని శిష్యులతో దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు. శకుంతల నిండు కొలువులో తానెవరో చెప్తుంది. కానీ దుష్యంతుడు మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడు. ‘నీ కొడుకును పరిష్వంగం చేసుకో... అపుడు నీ కొడుకు అవునో కాదో తెలుస్తుంది’ అని చెప్తుంది. అంటే పరిష్వంగంలోని శక్తి అదన్నమాట.
దమయంతిని దూరం చేసుకొని నలుడు మారుపేరుతో, దేశదేశాలు తిరిగి ఋతుపర్ణ మహారాజు దగ్గర కాలం గడుపుతుండేవాడు. దమయంతి బాహుకుని పేరుతో ఉన్న నలుడిని గుర్తించాలని తనకు ద్వితీయ వివాహం జరుగుతున్నట్లు ఋతుపర్ణ మహారాజుకు చెప్పి పంపిస్తుంది. ఆ వివాహానికి ఋతుపర్ణ రాజు నలుడిని అంటే బాహుకుడిని తన రథసారథిగా చేసుకొని దమయంతి దగ్గరకు వస్తారు.
బాహుకుని రూపంలో ఉన్న నలుని గుర్తించడానికి తన చెలికత్తె ద్వారా తన కూతురిని, కొడుకును వంటచేసుకొంటున్న బాహుకుడి దగ్గరకు పంపుతుంది. ఆ పిల్లలను చూడగానే బాహుకుడు చేతులు చాపి వారిని అక్కున చేర్చుకుంటాడు. కంటతడి పెడ్తాడు. తండ్రీ పిల్లల ముఖకవళికలను చూసి దమయంతి ఆ వంటవాడే తన భర్త నలుడని గుర్తిస్తుంది. పిల్లల పరిష్వంగంలోని శక్తి అది అన్నమాటే కదా.
సీతమ్మ క్షేమవార్త చెప్పిన ఆంజనేయుడికి చేతులు చాపి గాఢ పరిష్వంగాన్ని రాముడు ఇచ్చాడు. లంకలో సీతమ్మను చూసి, రావణునిలో భయం కలిగించి, ధైర్యాన్ని సీతమ్మలో నింపి వచ్చిన హనుమకి ప్రాణ సముడవు అని చెప్పడానికి రెండు చేతులు చాపి కౌగిలించుకున్నాడు రాముడు. పరిష్వంగం ద్వారానే రాముడు తన కుమారులుగా లవకుశులను గుర్తించినట్లు కొన్ని రామాయాణాల్లో కనిపిస్తుంది.
– ఆనంద‘మైత్రేయ’మ్
Comments
Please login to add a commentAdd a comment