‘ఆర్‌ఎమ్‌పి ఫ్లవర్స్’ అధినేత 14 ఏళ్ల పూజిత. ఆర్‌డీవై ఫ్రేమర్స్ యజమాని యశస్వి. ఎకో ఫ్రెండ్లీ షాంపూ తయారీతో ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనే ఆలోచనలో ఉన్నాడు మహబూబ్. వీళ్లందరూ స్కూల్ విద్యార్థులే. వీళ్లలో ఎవరూ సంపన్నులు కాదు. పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచనే వారి మూలధనం. మరో విషయం... వీళ్లెవరూ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కాదు. హైదరాబాద్‌లోని టచ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్‌లో పెరుగుతున్న అనాథ పిల్లలు.
పూజిత తొమ్మిదవ తరగతి. ఆమె తల్లిని, ఒక చెల్లిని తండ్రి పాశవికంగా హతమార్చాడు. ఆ సంఘటనతో పూజిత చెల్లితోపాటు టచ్ ఫౌండేషన్‌కు వచ్చింది. ఆర్ఫనేజ్‌కు వచ్చిన తర్వాత కూడా మిగిలిన పిల్లలతో కలవకుండా విచారంగా, కోపంగా ఉండేది. ఒంటరిగా గడిపేదని తెలియచేశారు నిర్వహకులు విజయ్‌కుమార్. అలాంటి పూజిత ఈ రోజు ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని చెబుతోంది.
ఆశ్రమం ఆవరణలో ఉన్న పూలు, ఆకులతో బొకేలు చేసి అమ్మవచ్చని స్నేహితులకు చెప్పి వారిని ప్రోత్సహించింది పూజిత. అలా ఓ చిన్నపాటి వ్యాపారవేత్తగా మారింది. ఇక యశస్వి విషయానికి వస్తే... ‘హైదరాబాద్‌లో జరిగిన 2024 స్టార్టప్ ఫెస్టివల్‌లో ఐదు ఫొటోఫ్రేములు అమ్మగలిగాను. ఈ నంబర్ చిన్నదే కావచ్చు. ఈ ఈవెంట్‌లో పాల్గొనడం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం చాలా పెద్దది. నా ఉత్పత్తుల గురించి కస్టమర్‌కి ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా నేర్చుకున్న మెళకువలను అమలు చేయడం తెలుసుకున్నాను’ అంటోంది.
ఆమె తల్లిదండ్రులను కోవిడ్ పొట్టన పెట్టుకుంది. బంధువులు యశస్విని, ఆమె సోదరుడిని ఆర్ఫనేజ్‌కు తీసుకువచ్చారు. రీ యూజ్‌డ్ మెటీరియల్‌తో ఫొటోఫ్రేములను చేస్తోంది యశస్వి. స్నేహితులతో కలిసి పేపర్, కార్డ్‌బోర్డ్, రాళ్లు వంటి తమకు అందుబాటులో ఉన్న వస్తువులకు తమ క్రియేటివిటీ జోడించి ఫొటోఫ్రేములను తయారుచేస్తోంది. మహమ్మద్ మహబూబ్ పదవ తరగతి విద్యార్థి. అతడు తామున్న హోమ్ ఆవరణలో ఉన్న కుంకుడు కాయలతో ఎకోఫ్రెండ్లీ షాంపూ తయారు చేసి సమీపంలో ఉన్న దుకాణాలకు సప్లయ్ చేయాలనుకుంటున్నాడు.
పిల్లల్లో వ్యాపారవేత్త కావాలనే ఆలోచనను ప్రోత్సహించడానికి ‘యంగ్ టింకర్ ఫౌండేషన్’ ఒక్కో స్టూడెంట్‌కి వెయ్యి రూపాయలిస్తోంది. ఆ డబ్బుతో ఏం చేయాలి, ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి తిరిగి మరింత డబ్బు సంపాదించడం ఎలా? ఇందుకోసం వారి బుర్రల్లో ఎలాంటి ఆలోచనలు ఆవిష్కరిస్తాయనే అంశాలను పిల్లలకే వదిలేస్తారు. ఈ ప్రయత్నంలోనే పూజితకు ఫ్లవర్ బొకే ఆలోచన వచ్చింది. యశస్వికి ఫొటో ఫ్రేములు చేయాలనిపించింది. మహబూబ్ షాంపూ తయారు చేయాలనుకున్నాడు. పిల్లలకు అవకాశం ఇస్తే వారి మెదళ్లు ఎంత చురుగ్గా ఆలోచిస్తాయో తెలియచేసే గొప్ప నిదర్శనం ఇది.
(చదవండి: కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..)
Comments
Please login to add a commentAdd a comment