ఐఐటీ చెన్నైతో మొదలైంది ఆమె ఉద్యోగ ప్రస్థానం. బిర్లా ఫార్మా, అద్వానీ ఆర్లికాన్, జండు ఫార్మా గ్రూప్ కంపెనీల్లో సాగింది. పెళ్లి తరవాత హైదరాబాద్‌కు వచ్చారామె. హైదరాబాద్‌లో టాటా క్రెడిట్ కార్ట్స్‌లో ఉద్యోగం. ఎంబీయే హెచ్‌ఆర్ చేసిన కాత్యాయని రెండు దశాబ్దాలకు పైగా ప్రఖ్యాతి చెందిన పెద్ద కంపెనీల్లో హెచ్‌ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.
ఓ సారి ప్రశాంతంగా సింహావలోకనం చేసుకున్నప్పుడు తెలిసింది ఏమిటంటే... ఇప్పటి వరకు తన మేధను, శ్రమను ఆయా కంపెనీల వృద్ధికే వెచ్చించడమైంది. ఇన్నేళ్ల తర్వాత తన ఐడెంటిటీ ఏమిటి? ఫలానా, ఫలానా కంపెనీల మాజీ ఉద్యోగి అనేది మాత్రమే. రిటైర్‌మెంట్ వరకు ఉద్యోగం చేసినా తన గుర్తింపు ఇదే.
‘జీవితం అంటే ఇది కాదు’ అని ఆమెకి అనిపించిన క్షణాలు చాలా బలమైనవే కావచ్చు. తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలా సాగిన ఆలోచనలకు ప్రతిరూపమే త్రిష ట్రెండ్స్. ఇప్పుడామె త్రిష ట్రెండ్స్ ఫౌండర్‌నని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటున్నారు.
ప్రయోగాల పర్వం!
‘‘మా కుటుంబ మూలాలు కడప జిల్లాలో ఉన్నాయి. నాన్న వ్యాపార ఉద్యోగాల రీత్యా నేను పెరిగింది, చదువు చెన్నైలోనే. పెళ్లితో హైదరాబాద్ వచ్చాను. ఈ నగరంతో మమేకమైపోయాననే చెప్పాలి. నా లైఫ్ జర్నీని ఉద్యోగం చేసిన రోజులు, ఉద్యోగాలిస్తున్న రోజులుగా విభజించుకోవచ్చు. సృజనాత్మకతకు అవకాశం ఉండాలి, నా మార్కు ప్రతిబింబించే పని చేయాలి, నా ఆలోచనలకు ఒక రూపం ఇవ్వాలి...
ఇలా ఆలోచించి డిజైనర్ ట్రెండ్స్‌తో కొత్త పంథాలోకి వచ్చేశాను. డిజైనర్ క్లాత్ ఇండస్ట్రీ నిర్వహణ ఎంత సంతృప్తినిస్తోందంటే... ఏ రోజుకారోజు చైతన్యవంతంగా ఉంచుతోంది. ఒక కొత్త డిజైన్‌కి రూపకల్పన చేయడంలో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. మధురై, కంచి, కోయంబత్తూర్, భాగల్‌పూర్, కోట, అస్సాం, కోల్‌కతాల నుంచి మెటీరియల్ తెస్తాను.
దక్షిణాది మెటీరియల్ మీద ఉత్తరాది ట్రెడిషనల్ డిజైన్స్, అక్కడి వస్త్రాల మీద మన దక్షిణాది డిజైన్‌ల సమ్మేళనంతో అనేక ప్రయోగాలు చేయడం... కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మ్యాగజైన్‌లు, ఇంటర్‌నెట్ సర్ఫింగ్‌తో దేశంలోని అన్ని ప్రాంతాల ట్రెడిషనల్ డిజైన్‌లను, ఆలయాల మీద చెక్కిన శిల్పాల నుంచి కొత్త డిజైన్‌లను సేకరిస్తాను.
ఆ పేపర్‌ని బ్లాక్ మేకర్స్‌కి ఇచ్చి బ్లాక్ చేయించుకుంటాను. అలా నేను సేకరించిన కళల నిధి, జ్ఞాన నిధి వేలాది బ్లాక్‌ల రూపంలో ఉంది. ప్రతి బ్లాక్ డిజైన్ వెనుక ఓ చరిత్ర, సంస్కృతి ఉంటుంది. గుజరాత్, సింద్, రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన అజ్రక్ ప్రింట్ మీద కూడా స్టడీ చేసి బ్లాక్‌లు చేయించాను.
మహిళలకు మార్గదర్శనం
సగటు మహిళల విషయానికి వస్తే... సొంతంగా ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు సరైన దిశానిర్దేశం చేసే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ద్వారా ఇండస్ట్రీ పెట్టాను. నా దగ్గరకు వచ్చిన వాళ్లకు మొదట నేను అనుసరించిన విధానాన్ని వివరిస్తాను.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్‌ప్రైజెస్) ద్వారా ప్రభుత్వ పథకాలను ఎలా అందుకోవాలో వివరిస్తాను. ఏదైనా చేయాలనే ఉత్సాహం ఉండి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండే మహిళలకు నా సూచన ఒక్కటే... సమాజంలో అవసరాన్ని గుర్తించి ఆ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి. ఓ ఇరవై ఏళ్ల కిందట టెలిఫోన్ బూత్‌లు వీథికి రెండు–మూడు ఉండేది.
మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అవి కనుమరుగయ్యాయి. మొబైల్ ఫోన్‌లు, రీచార్జ్, యాక్సెసరీస్ షాపులు కనిపిస్తున్నాయి. ఇక ఎప్పటికీ డిమాండ్ తగ్గని రంగాలు ప్రధానంగా మూడు... ఆహారం, ఔషధాలు, దుస్తులు. మనిషి పుట్టినప్పటి నుంచి ఆయుష్షు ఉన్నంత వరకు వీటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత స్థానం బ్యూటీ ఇండస్ట్రీది. తమ అభిరుచిని, మార్కెట్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుంటే జాబ్ సాటిస్‌ఫాక్షన్, ఇండస్ట్రీ గ్రోత్ రెండూ ఉంటాయి’’ అని తన జీవనప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు కాత్యాయని.
స్కూళ్లు, కాలేజీల్లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కి ఈ పాఠాలు, ప్రాజెక్ట్ వర్క్‌లు ఉంటున్నాయి. మా యూనిట్‌కి వచ్చే పిల్లలకు రంగులు కలపడం, డిజైన్ అద్దడం, బ్లాక్‌ల గురించి థియరీ వివరిస్తాను. మనం నేర్చుకున్న విద్య ఇచ్చే సంతోషం మాటల్లో వర్ణించనలవి కాదు.
ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చిన పిల్లలు వాళ్లు నేర్చుకున్న ఆర్ట్‌ని క్లాత్ మీద ముద్రించుకుని ఎంతగా మురిసిపోతారో! దానిని భద్రంగా పట్టుకోవడం, నలగకుండా జాగ్రత్తగా బుక్‌లో పెట్టుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. నేను ఈ రంగంలో దాదాపుగా రీసెర్చ్ చేశాననే చెప్పాలి. నేను సేకరించిన వివరాలు, తెలుసుకున్న విషయాలను శాస్త్రబద్ధంగా గ్రంథస్తం చేయాలి. – పులికుంట కాత్యాయని, ఫౌండర్, త్రిష ట్రెండ్స్
– వాకా మంజులారెడ్డి
చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే..
International Disability Day: నిశ్శబ్ద విజయం
Comments
Please login to add a commentAdd a comment