
మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఏవిధంగా ప్రవర్తించాలి అని తెలిపే జైన్ కథలు మానావళి ఓ గోప్ప వరం. అవి మనిషి బుద్ధిని వికసింప చేసి ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ధర్మా ధర్మాలని చాలా చక్కగా విపులీకరించి ఎంతటి చిన్నపిల్లవాడికైన సులభంగా అర్థమవుతాయి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కథలు మనస్సు ప్రశాంతతకు ఓ చక్కటి ఔషధంలా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ జైన్ కథలు. ఈ రోజు చెప్పే జైన్ కథ దేని గురించి తెలుసా..!
అసలైన మహత్యం అంటే..
జెన్ గురువు ‘బన్‌కెయి’ ఓ నాడు బౌద్ధ విహారంలో ప్రవచనం చేస్తుండగా వేరే బౌద్ధ శాఖకు చెందిన ఒకాయన అక్కడకు వచ్చి సభలో పెద్దగా మాట్లాడుతూ అలజడి సృష్టించాడు. బన్‌కెయికి వచ్చిన మంచిపేరంటే అతడికి అసూయ. బన్‌కెయి మాట్లాడటం ఆపి గొడవకు కారణం ఏమిటని అడిగాడు. వచ్చిన ఆ ఆగంతకుడు అన్నాడు:
‘మా శాఖను స్థాపించిన గురువు ఎటువంటి గొప్ప మాహాత్మ్యాలు చెయ్యగలడంటే, నదికి ఇవతల గట్టు మీద కుంచె పుచ్చుకొని ఉండి, అవతల గట్టుమీద ఎవరైనా అట్ట పుచ్చుకొని ఉంటే, దానిమీద ఆ కుంచెతో బొమ్మ గీయగలడు. నీవు అలాంటి మహత్తు చెయ్య గలవా?’ బన్‌కెయి సమాధానం చెప్పాడు: ‘అలాంటి తంత్రం మీ గురువు చెయ్యగలడేమో కాని, అది జెన్ పద్ధతి కాదు. నేను చేసే మహత్తు ఏమిటంటే, నాకు ఆకలైనప్పుడు తింటాను. దాహమైనప్పుడు తాగుతాను.’
అదే అత్యంత శుభదాయకం
ఓ ధనవంతుడు, జెన్ గురువు ‘సెన్‌గయి’ని అడిగాడు, తన వంశాభివృద్ధికి శుభదాయకమైన వాక్యం ఒకటి వ్రాసివ్వమనీ, దాన్ని తరతరాలుగా దాచి ఉంచుకొంటామనీ! సెన్‌గయి పెద్ద కాగితం ఒక దాన్ని తెప్పించుకొని, దాని మీద ఇలా రాశాడు: ‘తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మన వడు చనిపోతాడు. ’ధనవంతుడికి కోపం వచ్చింది. ‘నేను నిన్ను నా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఏదైనా రాసివ్వమని అడిగాను. నీవేంటి ఇలా నన్ను ఎగతాళి పట్టిస్తున్నావు?’
‘ఇందులో ఎగతాళి ఏం లేదు’ వివరించాడు సెన్‌గయి. ‘నీవు చనిపోకముందే నీ కొడుకు చనిపోయినాడనుకో. అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. నీకంటే, నీ కొడుకు కంటే ముందే, నీ మనవడు చనిపోయినాడనుకో, మీ ఇద్దరి గుండె పగిలిపోతుంది. అలా కాకుండా, నీ కుటుంబం తరతరాలుగా నేను పేర్కొన్న వరుసలో గతించినారనుకో, అది సహజమైన జీవన గమనం అవుతుంది. దీన్ని నేను శుభదాయకం అంటాను.’
– దీవి సుబ్బారావు