జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తాం... వాటిని ఏ కోణంలో చూస్తామనే విషయం మీదే మన అభివృద్ధి, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.. మనసు బాగోలేనపుడు చాలా విషయాలను మనం సమస్యలుగా చూస్తాం.. ప్రశాంతంగా ఉన్నపుడు అవే పరిస్థితులను సవాళ్లుగా భావిస్తాం. అందువల్ల మన అభివృద్ధి ఏదైనా అది మనం ఆయా సమస్యలను స్వీకరించే స్థితి మీదే ఆధార పడి ఉంటుంది..
మనిషి జీవితం పూల పాన్పు కాదు.. అదేవిధంగా ముళ్ళ కిరీటం కూడా కాదు.. ఈప్రాథమిక సూత్రాన్ని అవలోకనం చేసుకుని మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించినపుడే మన జన్మకు సార్ధకత లభిస్తుంది.. బతుకూ పండుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు వెరుస్తూ, మార్పును ఆహ్వానించకపోతే అది మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది.
ఒక పనిలో విఫలమైనపుడు దానిలో ఎందుకు విఫలమయ్యామా... అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు పాడు చేసుకునే కన్నా, ఏం జరిగినా అది మన మంచికోసమేనని ఆత్మను సంతృప్తి చేసుకుంటే మనసు కుదుట పడుతుంది. ఆనందం సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే మార్పును ఎప్పటికప్పుడు ఆహ్వానించి, దానిని మన జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి తప్ప, ఆత్మన్యూనతతో కుంగి పోకూడదు.
కనుక మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా సంఘపరంగా, ఆత్మపరంగా ఇంకా అనేకానేక కోణాలలో, అనేకానేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి... అనివార్యం గా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పునూ మనం అంగీకరించాలి.
కురుక్షేత్ర సంగ్రామంలో తాను అస్త్ర సన్యాసం చేస్తానని అర్జునుడు చింతించినపుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. మార్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, ఇది çసృష్టి ధర్మమని, మార్పును అంగీకరించినపుడే భవిష్యత్ నిర్దేశం కలుగుతుందని బోధించాడు. అలా శ్రీ కృష్ణభగవానుడి స్ఫూర్తితో అర్జునుడు యుద్ధం చేసి ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాడు.
ప్రతి ఒక్కరూ మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మనతో మనం పోటీ పడాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుంది. కనుక మొదట్నుంచీ తల్లిదండ్రులు మార్పుకు అనుగుణంగా జీవితాలను మలచుకోవాలనే దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలి.
వర్తమాన ప్రపంచానికి, పరిస్థితులకనుగుణంగా వారికి వారు నైపుణ్యాలు పెంచుకునే విధంగా ్రపోత్సహించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఇవ్వాలి అలాగే, వారి వ్యక్తిత్వాలు, ్రపాధాన్యతలు, పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. కుటుంబాలు, పాఠశాలలు పిల్లల సామర్థ్యం, ఉత్సుకత, సృజనాత్మకత, అలవాట్లను పిల్లల భావి జీవితానికనుగుణంగా తీర్చిదిద్దినపుడు జీవితంలో వస్తున్న మార్పులను అంగీకరించే సామర్థ్యాన్ని ΄÷ంది, పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారన్న వాస్తవాన్ని గుర్తించి మసలుకోవాలి.
దాసరి దుర్గాప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment