తృప్తిని మించిన ధనం... భక్తిని మించిన మోక్షం లేవు! | Seen is yours title is ours | Sakshi
Sakshi News home page

తృప్తిని మించిన ధనం... భక్తిని మించిన మోక్షం లేవు!

Published Sun, Mar 10 2019 12:26 AM | Last Updated on Sun, Mar 10 2019 12:26 AM

Seen is yours title is ours - Sakshi

కె.వి.రెడ్డి దర్శకత్వంలో సహజకవి జీవితంపై రూపొందించిన చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

‘నారాయణ...రామకృష్ణ,,,,గోవింద నారాయణ’ అంటూ భక్తిపరవశంతో భజన జరుగుతుంది. ఈ సందడిలోనే ఒకడు దేవుడి దీపంతో చుట్ట వెలిగించుకున్నాడు.‘‘ఎవడ్రా నువ్వు దేవుడి గుడిలో  దీపానికి చుట్ట ముట్టిస్తావా!’’ అని నిప్పులు చెరుగుతూ వాడికి రెండు అంటించాడు మల్లన్న.ఈ దెబ్బకు చుట్ట ఎగిరివెళ్లి జనాల మధ్య పడింది.‘‘ఏ...నీ అబ్బ గంటా ఇది... పోరా’’ అని మండిపడ్డాడు చుట్టవాడు.ఈ గొడవ విని ‘‘మల్లన్నా...’’ అని కొడుకును పిలిచారు కవిగారు.‘‘నాన్నా...వీడి విషయంలో జోక్యం చేసుకోకు. వీడికి శాస్తి జరగాలి. ఈ పశువును ఇలా సాగనిస్తే....మనం ఒక్క క్షణం కూడా ఈ ఊళ్లో కాపురం చేయలేము’’ ఆవేశంగా అన్నాడు మల్లన్న.‘‘నీకెందుకు నాయనా ఇంతకోపం! మానవుల పాపపుణ్యాలను పాలించడానికి దేవుడున్నడుగా. నువ్వు ఊర్కో’’ అని కొడుకును శాంతింపజేయడానికి ప్రయత్నించారుకవిగారు.‘‘తమరు అలా సెలవీయకండీ...వీడి దుర్మార్గం రోజురోజుకూ మితిమీరి పోతోంది’’ అని చుట్టోడిపై ఫిర్యాదుల చిట్టా విప్పాడు ఒక భక్తుడు.‘‘దేవుడికి నీవు నేను ఎంతో. వీడూ అంతే...’’ అన్నారు శాంతస్వరంతో కవిగారు.

 ఆ రాత్రి కుక్కలు మొరిగేవేళ...‘‘అమ్మా...అన్నపూర్ణ...మాదాకవళం తల్లీ’’ అని అరుస్తున్నాడు ఒక యాచకుడు.‘‘సరిగ్గా సమయానికి వచ్చావు. పోయిరా’’ అంది కవిగారి భార్య.అతడు పోలేదు.‘‘గంజినీళ్లకు కూడా దిక్కులేదమ్మా. ప్రాణం పోయేలా ఉంది’’ దీనంగా అన్నాడు యాచకుడు.ఇది విని బయటికి వచ్చి యాచకుడిని ఇంట్లోకి తీసుకెళ్లి,  పక్కనకూర్చొని మరీ భోజనం వడ్డించారు కవిగారు.ఆ యాచకుడి కళ్లలో అంతులేని కృతజ్ఞత.యాచకుడిని ఇంటిగుమ్మం వరకు సాగనంపి వచ్చి భార్యతో అన్నారు కవిగారు:‘‘పాపం ఎంతో ఆకలితో వచ్చాడు. నీ భోజనంతో  పూర్తిగా సంతోషించి ఉంటాడు’’‘‘సంతోషించే కాదుదీవించి కూడా వెళ్లాడు. పస్తు ఉంటే బాధపడేది మనమేగానీ వాడికేం!’’ వ్యంగ్యంగా అంది ఆ ఇంటి ఇల్లాలు.‘‘పిచ్చిదానా! ఇళ్లు వాకిలీ ఉన్నంత వరకు ఏదో కలోగంజీ ఇచ్చాడు మనకు దేవుడు.ఆకలిగొన్నవానికి పెట్టిన ఒక కబళం, ఆపన్నుల కోసం విడిచిన ఒక కన్నీటిబొట్టు నూరు సత్రయాగాలు, వెయ్యి కుంభాభిషేకాలతో సమానం’’ అంటూ దానం విలువను చెప్పే ప్రయత్నం చేశారు కవిగారు.కాని ఆయన మాటలు ఆమెకు రుచించలేదు.‘‘మరీ బాగుంది మీ వేదాంతం. ఇక మన సంగతి ఆ దేవుడే విచారించాలి’’ నిర్వేదంగా  అన్నది ఆమె.‘‘తప్పకుండా! తన భక్తుల బరువుబాధలు ఆ పరంధామునికి బాగా తెలుసు. అవన్నీ ఆయనే తీరుస్తాడు’’ అనడంతో పాటు...‘‘వెర్రిదానా ఆశకు అంతుండాలి. రత్నాలవంటి పిల్లలు,  ఈ రైతుజీవితం...తృప్తిని మించిన ధనం, భక్తిని మించి మోక్షసాధనం లేదు తెలుసా’’ అని ఇల్లాలికి  హితబోధ  చేశారు కవిగారు.

ఎవరో చుట్టాలు వస్తున్నట్లు కలకలం మొదలైంది.ఎవరో కాదు...కవిగారి బావగారు....పల్లకిలో నుంచి దిగారు. సేవకులు హడావిడి పడుతున్నారు.‘‘ఏం బావగారూ, ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. మా శారద కూడా అలాగే ఉంది. ఆభరణాలతో సహజంగా ఉండే సౌందర్యం చెడుతుందనా!  ఏమ్మా?’’ అన్నారు ఖరీదైన బావగారు వ్యంగ్యస్వరంతో.‘‘అన్నయ్యా...ప్రశ్నలు తరువాత....భోజనం వేళ అయింది...’’ అనితొందర చేయబోయింది  నర్సమాంబ.అన్నయ్యగారి మాటల్లో మళ్లీ వ్యంగ్యం...‘‘లక్షణం చూస్తే...ఇంట్లో అది కూడా ఉంటుందా!’’‘‘దైవకృప వల్ల ఇప్పటి వరకు అలాంటి  ఇబ్బంది లేదు బావగారు. వచ్చిన వాళ్లకు ఏదో విధంగా పెడుతూనే ఉన్నాం’’ అన్నారు కవిగారు.నర్సమాంబ అన్నగారు తెచ్చిన నగలు వేసుకొని ధగధగలాడుతుంది ఆమె కూతురు శారద.‘‘ఇప్పుడెంత అందంగా  ఉందో చూడండి. ఇలా సర్వాలంకారాలతో రాచకన్యలా ఉండకుండా పల్లెటూరి గబ్బిలాయిలా దిశ మెడలు, దిశ కాళ్లు...మీరూ’’ అని చురక అంటిస్తూ మేనల్లుడి వైపు తిరిగి...‘‘మల్లన్నా,  నువ్వు  ఇంకా అలాగే ఉన్నావేం. ఆ బట్టలు కట్టుకోరాదూ’’ అన్నారు కవిగారి బావగారు.‘‘ఆ చీనిచీనాంబరాలు వాడికెందుకు బావగారూ...రైతుకు పీతాంబరాలు చాలా దూరం. అంతేకాదు...సాటి రైతులకు కూడా దూరం అవుతాం. కోట్లాదిమంది భారతీయులు కొల్లాయితో సరిపెట్టుకుంటున్నారు. మాకు మాత్రం ఈ జరీపంచెలు ఎందుకు?’’ అన్నారు కవిగారు.

‘‘అవసరం వేరు. అలంకరణ వేరు బావగారు. ప్రజలు కూటికి గుడ్డకు లేక దరిద్రం వెళ్లబుచ్చుతున్నారంటే...తృప్తి కలిగి కాదు. విధి లేక చేతకాక. అంతే! కావాలని ఎవడూ దరిద్రుడు కాదు. కానీ అది తీరే దారి లేక దరిద్రం అనుభవిస్తున్నారు’’ అన్నారు  ఆయన.‘‘సరిగపంచెలు కట్టినంత మాత్రానా ధనవంతులవుతారా బావగారు! భక్త ధనం కలవారే ధనవంతులు. వారే వాంఛారహితులు. సుఖసంపన్నులు’’ అన్నారు కవిగారు.‘మీరేదో కవిత్వగానం చేస్తున్నారుగానీ మామూలు రైతువలే మాట్లాడటం లేదు బావ. యదార్థజీవితంతో సంబంధం లేని ఈ భావోన్మోదం ఒక్క కవులకు మాత్రమే ఉంటుంది. ఈ మహత్తరభావాలను చేర్చి ఒక మహత్తర కావ్యం రాయరాదు. అదైనా కొంచెం ఉపయోగపడుతుంది’’ అన్నారు ఆయన.ఆయన ప్రతిమాటలో బావను మార్చే ప్రయత్నమేదో కనిపిస్తూ ఉంది..‘‘మామయ్య...మామయ్యా...నాన్న నిజంగా పెద్ద పుస్తకం రాస్తున్నారు. నాకు అందులో చాలా పద్యాలు వచ్చు..’’ అంది కవిగారి అమ్మాయి.‘‘నిజంగానే రాస్తున్నావా బావ?’’ అడిగారు ఆయన.‘‘లేదు బావ...అది భగవతాజ్ఞ. భగవంతుని రచన’’ అన్నారు కవిగారు∙∙ ‘‘నీవు భోగినిదండకం రచనలో చూపిన కవితావిలాసం  ఇంకను సింగభూపాలుడు మరవలేదు బావ’’ అంటూ పేదకవిగారిని మహారాజుకుచేరువ చేయ ప్రయత్నం చేశారు బావగారు.‘‘అపచారం’’ అన్నారు కవిగారు.అంతేకాదు...దరిద్రానికి తనదైన నిర్వచనం ఇచ్చారు...‘‘అత్యాశపరుడే దరిద్రుడు. తృప్తి కలిగినవాడికి కలిమిలేమి లేవు’’  ఈ మాటలు విని బావగారికి కోపం వచ్చినట్లుంది. ఆయన ఇలా అన్నారు:‘‘సంసారంలో ఉన్నంత వరకు సంసారి వలెనే మాట్లాడవలెనుగానీ సర్వసంగపరిత్యాగిలా మాట్లాడవద్దు. ఆశ్రయం లేని చోట కవిత, వనిత, లత శోభించవని పెద్దలు అన్నారు’’
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement