PGT
-
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
26 నుంచి టీజీటీ, పీజీటీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి సంబంధించి టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) అర్హత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. సబ్జెక్టుల వారీగా తేదీలను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) గురువారం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాల్లో 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీజీటీ కేటగిరీలో 56,421 మంది, పీజీటీ కేటగిరీలో 62,604 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తికావడంతో పరీక్షల ఏర్పాట్లకు బోర్డు ఉపక్రమించింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. పరీక్ష తేదీకి పది రోజుల ముందే హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు. అర్హత పరీక్షలను మూడు పేపర్లుగా విభజించారు. పేపర్–1 పరీక్ష కామన్‌గా ఒకేరోజు (అక్టోబర్ 6న) నిర్వహిస్తుండగా పేపర్–2, పేపర్–3 పరీక్షలు మాత్రం సబ్జెక్టుల వారీగా వేర్వేరు తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. -
పీజీటీ–టీజీటీల్లో ఒకదాన్ని వదులుకోండి
సాక్షి, హైదరాబాద్ : పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు రెండింటికీ ఎంపికైన అభ్యర్థులు.. వాటిల్లో ఒకదానికి వదిలేసుకుంటున్నట్టుగా ఆప్షన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ సూచించింది. టీజీటీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ తుదిదశలో ఉందని.. అభ్యర్థులు ఆప్షన్ ఇస్తే తద్వారా ఖాళీ అయ్యేచోట తదుపరి అర్హులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. -
పీజీటీ ఎంపిక జాబితాలో మూడు మార్పులు
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాలో 3 మార్పులు చోటుచేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఉన్నత విద్యా మండలి నివేదిక ప్రకారం మార్పులు జరిగాయని పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను తమ వెబ్సైట్ www.tspsc.gov.inలో పొందవచ్చని వెల్లడించింది. -
513 పీజీటీ ఫలితాల విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఖాళీగా ఉన్న 513 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీలో భాగంగా పీజీటీ మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ ఆదివారం ప్రకటించింది. 126 పీజీటీ మ్యాథమెటిక్స్ పోస్టులకుగాను 114 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా మిగతా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల మెడికల్ రిపోర్టులు అందాక ఫలితాలు ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అలాగే 22 బయోలాజికల్ సైన్స్ పోస్టులకుగాను 21 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 177 పీజీటీ సోషల్ స్టడీస్ పోస్టుల్లో 166 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా పోస్టుల్లో వికలాంగులకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు వచ్చాక ఫలితాలు ప్రకటించనుంది. 188 ఫిజికల్ సైన్స్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా 174 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇటీవల పీజీటీ లాంగ్వేజెస్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులతోపాటు తాజా ఎంపిక జాబితాను కలుపుకొని మొత్తం గా 921 పోస్టుల పలితాలను ప్రకటించింది. ఫారెస్టు కాలేజీ పోస్టుల ఫలితాలు విడుదల ఫారెస్టు కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 19 పోస్టులకుగాను (2 ప్రొఫెసర్ పోస్టులకు ఒకే దరఖాస్తు రాగా, 4 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులే రాలేదు) 12 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా 11 పోస్టులకే దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో వాటిలో 7 పోస్టులే భర్తీ అయ్యాయి. లైబ్రేరియన్ పోస్టుకు జనవరి 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. -
ఆదర్శం.. ఆగమాగం..
మందమర్రి రూరల్ : జిల్లాలోని ఆదర్శ పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే అరకొర సౌకర్యాలతో నెట్టుకువస్తున్న ఆదర్శ పాఠశాలలకు కొత్త ఆపద వచ్చిపడింది. జిల్లాలో ఏడు పాఠశాలలు ఉన్నాయి. వాటిని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆకర్షణీయమైన వేతనాలు, అన్ని అలవెన్సులు, బోధనకు కావాల్సిన అన్ని వసతులూ ఉంటాయనే ఆశతో పోటీ పరీక్షల్లో నెగ్గి మరీ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్లలో చేరారు. ఇప్పుడు వారి పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. అర్హత, సర్వీస్, సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోలేక స్కూల్ పాయింట్లకు పయనమవుతున్నారు. 14 మంజూరు.. ఏడు ప్రారంభం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గత విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు మొత్తం గతేడాదే 14 పాఠశాలలు మంజూరు కాగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దండేపల్లి, జైనథ్, మందమర్రి, కుంటాల, బజార్‌హత్నూర్‌లలో స్కూళ్లను ఏర్పాటు చేశారు. 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. బోధనకు ప్రభుత్వం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), టైయిస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ)ను ఎంపిక చేసింది. ఒక్కో స్కూల్‌కు ఒక ప్రిన్సిపాల్ 13 మంది పీటీజీలు, ఆరుగురు టీజీటీలు మొత్తం 20 మంది స్టాఫ్ ఉండాలి. కాగా.. ఈ ఏడు పాఠశాలన్నింటిలో ఇద్దరు మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. ఇక పాఠశాలలో ముగ్గురు నుంచి నలుగురు వరకు స్టాఫ్ తక్కువగా ఉంది. సుమారు 20 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. సర్సీస్ రూల్స్, వేతనాలతోనే సమస్య.. ప్రభుత్వ పాఠశాల ఎస్జీటీలకు నెలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860 మూల వేతనాలు ఉండ గా ఆదర్శ పాఠశాలలో పనిచేసే టీజీటీలకు నెలకు రూ.14,860, పీజీటీలకు రూ.16,150 ఖరారు చేసింది. ఎక్కువ వేతనం వస్తుందని ఆశతో అప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో ఎస్జీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ రాత పరీక్షల ద్వారా ఎంపికై మోడల్ స్కూళ్లలో చేరారు పలువురు. ఎస్జీటీలను టీజీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లను పీజీటీ ప్రిన్సిపాల్స్‌గా తీసుకుంది. నియామకాలు బాగానే ఉన్నా.. తర్వాత వీరిని ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. సర్సీస్ రూల్స్, బదీలీలపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. వీరి నియామకం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఏ రెండు సార్లు (17.12) శాతం పెరిగింది. ఆదర్శ పాఠశాలల అధ్యాపకులకు మాత్రం పాత మూల వేతనమే అందుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే పీజీటీలకు ప్రతి నెలా రూ.7,125, టీజీటీలు రూ.6,556 తక్కువ వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసి మోడల్ స్కూళ్లలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తిస్తుందా? కొత్త పింఛన్ విధానమా? అనే అశంపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీలు, పీజీటీలకు ఇది వర్తించకపోవడంతో భవిష్యత్తులో పీఆర్సీలో నష్టపోయే ప్రమాదం ఉంది. తిరిగి పాత స్థానాలకు.. మోడల్ స్కూళ్లలో పోస్టింగ్ పొందిన తర్వాత వాటిలో పనిచేయడం ఇష్టం లేకపోతే రెండేళ్లలోపు తిరిగి స్కూల్ పాయింట్లకు తిరిగి వచ్చే వెసులు బాటును ప్రభుత్వం కల్పిం చింది. దీంతో ఈ నిబంధన ఆధారంగా ఆదర్శ పాఠశాల బోధకులు పాత స్థానాలకు వెళ్తున్నారు. ఇక్కడే కొనసాగితే భవిష్యత్తులో సర్వీస్ పరంగా, వేతనాల పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్‌లోని పాఠశాలలో ఇద్దరు పీజీటీ లు, మందమర్రిలో ఒకరు సర్కారు బడిలోకి వెళ్లిపోయారు. మరో 20 మంది మోడల్ స్కూళ్ల నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. వసతులు, భవనాలులేక అనేక అసౌకర్యాల మధ్య విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఇష్టపడటం లేదు. మోడల్ స్కూళ్లలో ఇప్పటికే పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బోధకులు కూడా వెళ్లిపోతే విద్యాబోధన, ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో టీజీటీలు, పీజీటీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు - సత్యనారాయణ, డీఈవో ఆదిలాబాద్ పోస్టింగ్‌లు తీసుకున్న రెండేళ్లలో ఇష్టం లేకుంటే టీజీటీలు, పీజీటీలు తిరిగి స్కూల్ పాయింట్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుగానే స్పష్టం చేసింది. వారికి కొన్ని సమస్యలున్నాయని అంటున్నారు. వారు వెళ్లిపోతే ఖాళీలతో కొత్తగా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. -
మో‘డల్’ పాఠశాలలు
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాలల(మోడల్ స్కూళ్లు)ను గతేడాది ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పాఠశాలల భవనాల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయినా ఈ భవనాల్లోనే తరగతులు ప్రారంభించారు. పాఠశాలకు ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల నియమించాలి. కాని పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో ఉన్న కొద్ది మంది టీచర్లే మిగలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. మరి కొన్ని సబ్జెక్టులకు విద్యార్థుల తల్లిదండ్రులే టీచర్లను నియమించి జీతాలు చెల్లిస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలీచాలని తరగతి గదులు మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లెలో ఈ ఏడాది మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. పాఠశాల్లో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారు. ఒక్కొక్క తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుని రెండు సెక్షన్లుగా విభజించాలి. 6, 7, 8 తరగతుల్లో 240 మందికిగానూ 225 మంది, ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 మందికిగానూ 53 మంది చేరారు. ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను కేటాయించాల్సి ఉంది. కానీ టీచర్ల కొరతతో 75 మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి విద్యనందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్ లేకపోవడంతో కొందరు కిందే కూర్చొంటున్నారు. సిబ్బంది కొరత మోడల్ పాఠశాలకు ప్రిన్సిపాల్, 14 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఆరుగురు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను నియమించాలి. కానీ ఇప్పటి వరకు ప్రిన్సిపాల్, ఆరుగురు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను మాత్రమే తీసుకున్నారు. దీంతో పాఠశాల్లోని పీడీ, ఇతర టీచర్లే మిగిలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థికసాయంతో టీచర్లకు జీతాలు ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులకు టీచర్లు లేరు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు టీచర్లతో తమ పిల్లలకు పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఈ టీచర్లకు తల్లిదండ్రులే జీతాలు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రిన్సిపాల్ కూడా బోధన చేస్తున్నారు. సౌకర్యాలు నిల్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. కానీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి వద్ద నుంచే పాఠశాలకు హాజరవుతున్నారు. పాఠశాలలో మంచినీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. మరి కొందరు ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలకు ల్యాబ్ సామగ్రి రాలేదు. దీంతో ప్రయోగశాలలు నిరుపయోగంగా మారాయి. త్వరలోనే భర్తీ చేస్తాం: వెంకటేశ్వరరెడ్డి, మోడల్ స్కూల్స్ ఇన్ చార్జి మోడల్ స్కూల్లో టీచర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మిట్టమీదపల్లెలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖా మంత్రి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తాం. -
మో‘డల్’ విద్య
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మోడల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత తీవ్రంగా ఉంది. 2011 లోనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో 2013 విద్యా సంవత్సరంలో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలున్నారు. వీటిలో ప్రిన్సిపాల్స్, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లు పూర్తి స్థాయిలో లేరు. టీజీటీ (టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించినప్పటికీ వీరిలో కొంత మందిని మాత్రమే నియమించారు. ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టుల కోసం అభ్యర్థులు అర్హత పరీక్ష రాసినప్పటికీ కొంతమంది విధుల్లో చేరకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో 16 మంది ప్రిన్సిపాల్స్‌కు ఐదుగురు, 160 మంది పీజీటీలకు 131 మంది, 112 మంది టీజీటీలకు ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఐదు చోట్లే ప్రిన్సిపాళ్లు విద్యాపరంగా వెనకబడిన మండలాల్లో మోడల్ పాఠశాల లు ఏర్పాటు చేశారు. కేవీబీపురం, కేవీపల్లి, కురబలకోట, పుంగనూరు, ఎర్రావారిపాళెం మండలాల్లోని పాఠశాలల్లో మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలిన చోట్ల ఎంఈవోలు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరికి మండల స్థాయిలో అనేక పనులు ఉండడంతో మోడల్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారనే విమర్శలున్నాయి. టీజీటీలు హిందీ సబ్జెక్టుకు మాత్రమే కేవీబీపురం, కేవీపల్లి, కలకడ, కు రబలకోట, పుంగనూరు మండలాల్లో ఉన్నారు. పీజీటీలు ఒక్కో పాఠశాలలో 10 మంది ఉండాల్సి ఉండగా బి.కొత్తకోటలో ఆరుగురు, బెరైడ్డిపల్లెలో తొమ్మిది మంది, గుడిపల్లిలో ఇద్దరు, కలకడలో తొమ్మిది మంది, కుప్పంలో ఏడుగురు, కేవీబీపురంలో తొమ్మిదిమంది, కేవీపల్లిలో తొమ్మిది మంది, కురబలకోటలో ఆరుగురు, పెద్దమండ్యంలో తొమ్మిది మంది, పీటీఎంలో ఐదుగురు, పుంగనూరులో ఏడుగురు, శాంతిపురంలో తొమ్మిది మంది, తంబళ్లపల్లిలో ఐదుగురు, ఎర్రావారిపాళెంలో తొమ్మిది మంది మంది ఉన్నారు.