సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ జాబితా రూపొందించారన్నారు.
జనరల్ కేటగిరీలో ఎంపిక కావాల్సిన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అలసత్వంతో రిజర్వేషన్ కేటగిరీ జాబితాలో వచ్చారని, దీంతో రిజర్వ్‌డ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం అభ్యర్థులు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాదాపు పది మంది అభ్యర్థుల పేర్లు ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీలో ఎంపికైనట్లు పేర్కొంటూ హాల్‌టికెట్ నంబర్లు, మార్కులతో కూడిన పత్రాలను అధికారులకు సమర్పించారు.
టీఎస్‌పీఎస్సీకి ఆర్.కృష్ణయ్య లేఖ
టీజీటీల ఎంపికలో తప్పులు దొర్లాయని, వెంటనే పూర్తిస్థాయి విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క అభ్యర్థి ఎంపికలో తప్పు జరిగినా జాబితా మొత్తం తలకిందులు అవుతుందన్నారు. ఈమేరకు టీఎస్‌పీఎస్సీకి లేఖ రాశారు.
నియామక విధానంలోనూ క్రమపద్ధతి పాటించడం లేదన్నారు. వెబ్ ఆప్షన్ అనేది పాలనా ప్రక్రియకు సంబంధించిందని, దీన్ని ఎంపికైన తర్వాతే చేపట్టాలని, అలా కాకుండా ముందస్తుగా ఆప్షన్లు ఇవ్వడంతో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment