సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరిధికి కత్తెర పడింది. ఉద్యోగాల భర్తీలో ఆలస్యం జరుగుతుండటంతో టీఎస్‌పీఎస్సీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విద్యుత్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుల తరహాలో శాఖలవారీగా నియామక బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6 వేల పోస్టులను భర్తీ చేసే బాధ్యతను టీఆర్‌ఈఐఆర్‌బీకి అప్పగించింది.
గతేడాది గురుకులాలకు సంబంధించిన పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రమే టీఎస్‌పీఎస్పీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టింది. 8వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పటికీ నియామకాల ప్రక్రియ సాగుతూనే ఉంది. నోటిఫికేషన్ జారీ నుంచే టీఎస్‌పీఎస్సీకి, రెసిడెన్షియల్ సొసైటీల మధ్య సమన్వయ లోపం ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. నియామకాల్లో అంతులేని జాప్యానికి కారణమైంది. గురుకులాలతోపాటు అన్ని నియామకాల్లోనూ టీఎస్‌పీఎస్సీ పనితీరు విమర్శల పాలైంది. దీంతో టీఎస్‌పీఎస్సీకి బదులుగా రెసిడెన్షియల్ రిక్రూట్‌మెంట్ బోర్డుకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాలుగో వంతు కూడా..
రాష్ట్రంలోని అన్ని శాఖల్లో మొత్తం 1.10 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ ఇప్పటి వరకు 84,548 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే 54,724 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో 28,116 పోస్టుల భర్తీ మాత్రమే పూర్తయింది. ఖాళీల తో పోలిస్తే నాలుగో వంతు పోస్టులు కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. టీఎస్‌పీఎస్సీ వల్లే ఉద్యోగాల భర్తీలో జాప్యం జరిగిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రత్యామ్నాయంగా శాఖల వారీగా నియామకాలు
ప్రస్తుతం పోలీస్, విద్యుత్ శాఖలకు ప్రత్యేక బోర్డులున్నాయి. వీటి ద్వారానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ సొంత ఏర్పాట్లు చేసుకుంది. టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన పోస్టుల భర్తీని కూడా తిరిగి వైద్య శాఖనే సొంతంగా నియమించుకునేందుకు ఫైళ్లు కదుపుతోంది. అదే తరహాలో సంక్షేమ శాఖలు, వ్యవసాయ శాఖలోనూ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.
అమలు కాని సీఎం హామీ
84 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినా నియామక ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. అవినీతికి అవకాశం ఇవ్వరాదన్న పేరుతో పోలీసు మినహా టీచర్ల నియామకాలతో సహా అన్ని ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. అయితే టీఎస్‌పీఎస్సీ ఒక్కటే ఇన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టలేకపోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సిబ్బంది లేకపోవడం వల్లే నియామక ప్రక్రియ ఆలస్యమవుతోందని టీఎస్‌పీఎస్సీ చెబుతోంది. కార్యాలయంలో సిబ్బంది కొరతతోపాటు సాంకేతిక సాయం సమకూర్చే సీజీజీతో సమన్వయ లోపం, ప్రభుత్వ విభాగాల నుంచి తగిన సమాచారం అందకపోవటంతోనే నియామక ప్రక్రియ ఆలస్యమవుతోందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగ అర్హతలు, నిబంధనలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, లోకల్ కేడర్ వివరాలన్నీ శాఖలు రూపొందిస్తుండగా, నియామక ప్రక్రియ టీఎస్‌పీఎస్సీ చేపడుతోంది. ప్రభుత్వ శాఖలతో సమన్వయం కుదరక వివాదాలు కోర్టు మెట్లెక్కుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment