సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి, బండి సంజయ్, తరుణ్‌ఛుగ్, ఈటల రాజేందర్, ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే అసెంబ్లీని నడవనీయబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుని ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తారని, బయట కార్యకర్తలు, నిరు ద్యోగులు అసెంబ్లీని దిగ్బంధిస్తారని అన్నారు. నోటి ఫికేషన్ల కోసం బీజేపీ ఉద్యమాలతో ఒత్తిడి తెస్తున్నందున, నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు.
ప్రజాసమస్యలపై పోరాడుతున్న బీజేపీని ప్రజలు విశ్వసించి 2023లో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’లో ఆయన మాట్లాడారు.
ఉద్యోగాల భర్తీని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఏమి లాభమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మూర్ఖపు పాలన, తుగ్లక్ నిర్ణయాలతో స్థానికత అనేది ప్రశ్నార్థకంగా మారిందని, ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి ఈ నిర్ణయాలతో బాధపడుతున్నా, ఉద్యోగ సంఘా లు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సీఎం ఇకనైనా అర్థం చేసుకోవాలి
ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా, పోలీసుల వలయాన్ని చేధించుకుని దీక్షాశిబిరం వద్దకు వచ్చిన యువత ఆవేశాన్ని, ఆక్రందనను సీఎం ఇకనైనా అర్థం చేసుకోవాలని సంజయ్ అన్నారు. కేంద్రంపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తే, సీఎం సంగతి తేలుస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలెవరినీ వదలబోమని హెచ్చరించారు. ‘నాది దొంగ దీక్ష అని కేటీఆర్ అంటుండు. వాళ్ల నాయనను అడిగితే దొంగదీక్షలు ఎట్లా చేస్తారో చెబుతారు.
ఉద్యమప్పుడు కేసీఆర్ చేసింది ముమ్మాటికీ దొంగదీక్షే. బాత్రూంలో ఇడ్లీలు తిన్న నీచమైన చరిత్ర ఆయనది. నువ్వు.. నన్నా దొంగ దీక్ష అనేది’అని ధ్వజమెత్తారు. ఏడేళ్లలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జీ తరుణ్ ఛుగ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోగా వివిధ శాఖల్లోని 50 వేల మంది కాంట్రాక్ట్, ఇతర ఉద్యోగులను తొలగించిందని ఆరోపించారు.
బంగారం తెలంగాణ అంటున్న కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైం దని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగ దీక్షకు వివిధ నిరు ద్యోగ, ఓయూ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు, సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కార్యక్రమంలో బీజేపీ నేతలు డా.కె.లక్ష్మణ్, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, డా.జి.మనోహర్‌రెడ్డి, విజయరామారావు, ఎ.చంద్రశేఖర్, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, శాంతికుమార్, కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, తీన్మార్ మల్లన్న, విఠల్, డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డి, కొల్లి మాధవి, జయశ్రీ, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment