రిమాండ్‌లో ఉన్న ఎంపీ బండి సంజయ్‌ను పరామర్శించి తిరిగి వస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వివేక్, తదితరులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం / హైదరాబాద్: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం కనుసన్నల్లో పోలీసు దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పరామర్శించిన అనంతరం ఎంపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
‘ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా, ఎంపీ కార్యాలయంలో కోవిడ్ నిబంధనల ప్రకారం సంజయ్ దీక్ష చేయడం పోలీసులకు నేరంగా కనిపించిందా? ప్రజల కోసం నడిచే ఈ కార్యాలయం తలుపులను గ్యాస్ కట్టర్లు, గునపాలతో బద్దలు కొట్టారు. కార్యకర్తలపై లాఠీచార్జి చేసి, మహిళలనే కనికరం లేకుండా దాడులు చేసి వారి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఈ పరిణామాలన్నీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగాయి’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు కూడా లక్ష్మణ రేఖ దాటకూడదని హితవు పలికారు.
ప్రజాక్షేత్రంలో ఎండగడతాం..
టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగతామని, బీజేపీ పోరాడే పార్టీ అని కిషన్ రెడ్డి చెప్పారు. ధర్నా చౌక్‌ను ఎత్తేసిన సీఎం అక్కడే ధర్నా చేయొచ్చు.. టీఆర్‌ఎస్ నేతలు భారత్‌బంద్‌లో పాల్గొనొచ్చు.. రాస్తారోకోలు చేయొచ్చు.. కానీ, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే తప్పుగా కనిపిస్తోందన్నారు. తాము ఢిల్లీలో రైతులు ఏడాది దీక్ష చేస్తే సదుపాయాలు కల్పించామే తప్ప వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏనాడూ చేయలేదని చెప్పుకొచ్చారు.
పోలీసుల చర్యపై తాము ఇప్పటికే కేంద్రం, హోంశాఖకు ఫిర్యాదు చేశామన్నారు. ఇంకా స్పీకర్, పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీతోపాటు జాతీయ మానవహక్కుల సంఘం తదితర అన్ని వేదికల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టంచేశారు. లాఠీచార్జిలో గాయపడ్డ బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన కిరణ్, నగర సెంట్రల్ జోన్ దళిత మోర్చా అధ్యక్షుడు ప్రసన్నలను పరామర్శించారు.
ఉద్యోగులను సొంత జిల్లాల్లోనే పరాయి వారిని చేసిన జీవో 317ను సవరించేదాకా పోరాటం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, బండి సంజయ్ రిమాండ్‌కు నిరసనగా బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటలవరకు రా్రçష్టవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్య క్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
అశాస్త్రీయంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ
అంతకుముందు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అశాస్త్రీయంగా జరుగుతోందని చెప్పారు. జీవో 317 ప్రశాంతంగా ఉన్న ఉద్యోగుల జీవితాల్లో కల్లోలం రేపిందన్నారు. బండి దీక్షను భగ్నం చేయడంలో కరీంనగర్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారని, హోంగార్డు, కానిస్టేబుల్, ఎస్సై పనులను కూడా ఆయనే చేశారని విమర్శించారు.
అంతకుముందు కిషన్‌రెడ్డి, ఈటల, మాజీ ఎంపీ వివేక్‌లు పోలీసులు దాడి చేసిన ఎంపీ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలో పగిలిన తలుపులు, కిటికీలు, అద్దాలు, చెల్లాచెదురైన ఫర్నిచర్‌ను పరిశీలించారు. తర్వాత వీరు బండి సంజయ్ ఇంటికెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు
రిమాండ్‌లో ఉన్న బండి సంజయ్‌తోపాటు పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కంచు రవి, మర్రి సతీశ్ తరఫున మంగళవారం కరీంనగర్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఐపీసీ 333 సెక్షన్ పెట్టారని, సదుద్దేశంతో దీక్షకు తాము అనుమతి కోరామన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా పెద్దఎత్తున పోలీసులు వచ్చి ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు.
సంజయ్‌పై చూపిన పది కేసులు ఇదివరకే కోర్టులు కొట్టివేశాయని.. ఎంపీగా సంజయ్ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిలు మంజూ రు చేయాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కరీంనగర్ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బండి సంజయ్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment