సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన నోటిఫికేషన్ అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హతల్లో స్పష్టత ఉన్నప్పటికీ నియామకాలకు సంబంధించి స్థానికత విషయంలో అయోమయం నెలకొంది. జ్యుడీషియల్ కోర్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ విభాగాల్లో మొత్తం 592 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈనెల మూడో తేదీన నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
ఇందులో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్–173, టైపిస్ట్–104 కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–3, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ కేటగిరీల్లో జిల్లాల వారీగా ఖాళీలను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు–1975ని ప్రస్తావిస్తూ అప్పటి స్థానికత నిబంధనలను వర్తింపజేయనున్నట్లు ప్రకటన పేర్కొంది.
1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాల్గోతరగతి నుంచి పదోతరగతి వరకు చదువుకున్న ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో గరిష్టంగా నాలుగేళ్లు ఒకే దగ్గర చదివితే ఆ ప్రాంతాన్ని స్థానికత కింద పరిగణిస్తారు. ఇక 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని బట్టి స్థానికతను నిర్ధారిస్తారు. ఇందులో గరిష్టంగా నాలుగేళ్లు ఒకే చోట చదివినా దాన్ని స్థానికత కింద గుర్తిస్తారు. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 ప్రకారం రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లో ఉంది.
దీంతో పలువురు అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. మరోవైపు ఉమ్మడి రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనడంతో స్థానికత ధ్రువీకరణ పత్రాల జారీపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల ప్రకారం రాష్ట్రంలో స్థానికతను ధ్రువీకరిస్తున్నారు. మరిప్పుడు పూర్వ జిల్లాల ప్రకారం స్థానికత ధ్రువీకరణ పత్రాలు ఎవరు జారీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది.
బీసీలకు లేని ఫీజు రాయితీ
న్యాయస్థానాల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ఫీజును రూ.800గా హైకోర్టు నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చింది. దీంతో వీరు రూ.400తో పాటు సర్వీసు చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. దీంతో బీసీ అభ్యర్థులు నిరుత్సాహ పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ సమయంలో నియామక సంస్థలు ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ అభ్యర్థులకు కూడా ఫీజు రాయితీ ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50 శాతం రాయితీ ఇస్తూ.. బీసీలు పూర్తి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో తమకూ ఫీజులో రాయితీ ఇవ్వాలని బీసీ అభ్యర్థులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment