సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై మంగళవారం స్పష్టత రానుంది. మంగళవారం తాము విచారించి చెప్పేంతవరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు హైకోర్టు సూచించడంతో నోటిఫికేషన్ విడుదల ఏమవుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు ఎస్‌ఈసీ వర్గాల సమాచారం. మంగళవారానికి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో న్యాయనిపుణులు అభిప్రాయాలు, న్యాయసలహాదారుల సలహాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్‌ఈసీ ఉన్నతస్థాయి వర్గాలు తాజా పరిస్థితులను బేరీజు వేసుకున్నట్టు సమాచారం. నోటిఫికేషన్ జారీకి సంబంధించి సోమవారం కోర్టులో జరిగిన వాదనలు, ఇతర అంశాలను బేరీజు వేసుకుని, మంగళవారం హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తిచేసి, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నందున.. నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు రాకపోవచ్చనే భావిస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు, మేయర్, చైర్మన్ల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ఖరారు చేసి ఎస్‌ఈసీకి అందజేసినందున నోటిఫికేషన్ ప్రకటనకు సంబంధించి అడ్డంకులు ఎదురుకాకపోవచ్చని మున్సిపల్, ఎస్‌ఈసీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ల జారీ..
అన్ని జిల్లాస్థాయిల్లో వార్డుల రిజర్వేషన్లు, సంబంధిత ప్రక్రియకు సంబంధించి కలెకర్లు కూడా గెజిట్ నోటిఫికేషన్లు జారీచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. మొదట ఎస్‌ఈసీ సిద్ధం చేసుకున్న ఎన్నికల కార్యక్రమంలో భాగంగా 120 మున్సిపాలిటీల పరిధిలోని 2,727 వార్డులకు, 10 కార్పొరేషన్లలోని 385 డివిజన్లకు.. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, బుధవారం నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరించాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 22న ఎన్నికల నిర్వహణ, 25న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసుకుంది కూడా. మంగళవారం కోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్‌ఈసీ వర్గాలను బట్టి తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఎస్‌ఈసీ వైఖరిని తెలుసుకునేందుకు సోమ వారం ‘సాక్షి’ప్రతినిధి ఫోన్లో ప్రయత్నించిగా కమిషనర్ అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment