సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డం కులు తొలగిపోయాయి. మున్సిపల్ పదవులకు రిజర్వేషన్లు ఖరారుచేయకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చట్టవ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరిం చింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం వరకు విడుదల చేయొద్దని సోమవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. రిట్ పిటిషన్‌పై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చుతూ ఏకవాక్య తీర్పు చెప్పిం ది. పూర్తి తీర్పు పాఠం వారం పది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విచారణ సందర్భంగా ధర్మాసనం.. పొన్నుస్వామి కేసులో ఎన్నికల నోటిఫికేషన్ తేదీ ఖరారయ్యాక న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ తీర్పు ప్రకారం ఈ కేసులో జోక్యం చేసుకునే అవకాశం లేదని, దీంతో తమ చేతులు కట్టేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ఐదేళ్లు పూర్తి అయ్యేలోగా ఎన్నికలు నిర్వహించాలని, తెలంగాణలో మున్సిపాలిటీలకు 2019 జులై 2న ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఇప్పటికైనా నిర్వహించాల్సిన అవసరాన్ని ధర్మాసనం నొక్కి చెప్పింది. గత నెల 23న వెలువడిన ఎన్నికల షెడ్యూల్‌లో మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, ఈ నెల 22న పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కచ్చితంగా చెప్పిందని, ఈ నేపథ్యం లో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పలానా తేదీన ఎన్నికలని చెప్పిన తర్వాత న్యాయ సమీక్ష చేసే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది.
గడువు ఉండేలా చూడాలి..
పిటిషనర్ ఉత్తమ్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. ఎన్నికల షెడ్యూల్‌ను మాత్రమే తాము సవాల్ చేశామని, ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదని, జారీ కాబోయే నోటిఫికేషన్‌ను కూడా ప్రశ్నించట్లేదని పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీకి, నామినేషన్ల దాఖలుకు కనీసం వారం, పది రోజుల వ్యవధి ఉండేలా ఎన్నికల సం ఘాన్ని ఆదేశించాలని కోరారు. ఒక్క రోజే గడువు ఉంటే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులను ఖరారు చేసే రాజకీయ పార్టీలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ధర్మాసనం కల్పించుకుని.. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు వంటివి ముందుగానే ప్రకటించినప్పుడు పోటీ చేయబోయే అభ్యర్థులు సన్నద్ధంగానే ఉంటారని అభిప్రాయపడింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడమంటే ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసినట్లేనని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు కూడా ముందే సిద్ధపడతాయని పేర్కొంది. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ఖరారు, ఇందుకు అవసరమైన సర్వే, ఎన్నికల ముందస్తు ప్రక్రియ కోసం గరిష్టం గా 70 రోజులు కావాలని ఎస్‌ఈసీ గతంలో హైకో ర్టుకు చెప్పిన దానికి భిన్నంగా చేస్తోందని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం 4 రోజుల్లోనే రిజర్వేషన్లను ఎలా ఖరారు చేసిందని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు కాబట్టి రాజ్యాంగంలోని 226 అధికరణ ప్రకారం ఎన్నికల షెడ్యూల్‌ను మార్పు చేయాలని ఆదేశించే విస్తృతాధికారాలు హైకోర్టుకు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాకముందు రాజ్యాంగ ధర్మాసనాలు న్యాయ సమీక్ష చేయొచ్చని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.
న్యాయ సమీక్షకు ఆస్కారం లేదు: ఎస్‌ఈసీ
ఎస్‌ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదిస్తూ.. మున్సిపల్ చట్టంలోని పలు నిబంధనలకు లోబడే ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, రిట్ పిటిషన్ పాక్షికంగా ఆమోదయోగ్యమే అయినా ఎన్నికల నోటిఫికేషన్ జారీని అడ్డుకోడానికి వీల్లేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ కూడా ఖరారు అయిందని, హైకోర్టు ఉత్తర్వుల కారణంగానే నిలిపేశామని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయరాదనే అంశంపై హైకోర్టు న్యాయ సమీక్ష చేయకూడదని, ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ ప్రారంభమైనందున ఇందులో కోర్టుల జోక్యానికి ఆస్కారమే లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి దశకు చేరిందని, దీంతో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు రద్దు చేయాలని మోహన్‌రెడ్డి కోరారు. సాయంత్రం 6 గంటల తర్వాత మరో న్యాయవాది రచనారెడ్డి బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందంటూ వేసిన వ్యాజంపై వాదనలు ముగిసిన తర్వాత 6.40 గంటలకు ధర్మాసనం.. ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు తీర్పు చెప్పింది. రచనారెడ్డి పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
కరీంనగర్‌లో3 డివిజన్లలో ఎన్నికలకు బ్రేక్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 3, 24, 25 డివిజన్ల ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మూడు డివిజన్లతో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నిర్మల్ మున్సిపాలిటీలపై దాఖలైన వేర్వేరు కేసుల్లో కూడా పిటిషనర్లు లేవనెత్తిన లోటుపాట్లను సరిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. మూడు డివిజన్ల ఎన్నికలపై స్టే ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment