మున్సిపల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వొద్దు | High Court Order The State Election Commission Over Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వొద్దు

Published Tue, Jan 7 2020 1:58 AM | Last Updated on Tue, Jan 7 2020 8:35 AM

High Court Order The State Election Commission Over Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీలు, మున్సి పల్‌ కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ముందుగా గత నెల 23న ఎన్నికల షెడ్యూల్, ఈ నెల 4న ఓటర్ల జాబితా.. ఆపై ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడం ద్వారా తగిన సమయం ఇచ్చినట్లు కాదని ధర్మా సనం అభిప్రాయపడింది. అందుకే చట్ట నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరిగిందో లేదో తేల్చేందుకు మంగళవారం జరిగే విచారణ వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల మాన్యువల్‌ను తమకు నివేదించాలని ఈసీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడాన్ని తప్పుపడుతూ టీపీసీసీ చీఫ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయక ముందే ఎన్నికల నోటిఫికేషన్‌ ఎలా విడుదల చేశారని ధర్మాసనం ప్రశ్నించింది.

కనీసం జాబితా కూడా సిద్ధంగా లేదు.. 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. 2019 డిసెంబర్‌ 23న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారని, అప్పటికీ రిజర్వేషన్లను ఖరారు చేయలేదని, కనీసం ఓటర్ల జాబితానూ సిద్ధం చేయలేదన్నారు. రిజర్వేషన్లు ఖారారు చేశాక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాలన్నారు. కానీ అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. రిజర్వుడ్‌ స్థానాలు, ఓపెన్‌ కేటగిరీల్లో పోటీ చేసే వారికి తగినంత సమయం లేకుండా రిజర్వేషన్లను ఖరారు చేసిన మరుసటి రోజే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడబోతుందని చెప్పారు. రిజర్వేషన్లను ఖరారు చేశాక ఆయా రిజర్వుడ్‌ వర్గాల వారు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు సమయం లేకుండా హడావుడిగా చేస్తున్నారని తెలిపారు

 రిజర్వేషన్ల ఖారారు, ఎన్నికల నోటిఫికేషన్‌కు మధ్య 5 రోజులైనా గడువు ఉండేలా ఉత్తర్వులివ్వకపోతే రిజర్వ్‌ అయిన చోట పోటీ చేసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానందున రాజ్యాంగంలోని 243 కే, 243 జే (జీ)ల ప్రకారం ఎన్నికల షెడ్యూల్‌ తిరిగి వెలువరించొచ్చని చెప్పారు. ఈసీ తరఫు న్యాయ వాది సీవీ మోహన్‌రెడ్డి వాదిస్తూ.. ఎన్నికల షెడ్యూల్‌ గత నెల 23న వెలువడిందని, దీని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ మంగళవారం వెలువడుతుందని చెప్పారు. దీంతో.. రిజర్వేషన్లను ఖరారు చేయకుండానే ఎన్నికల షెడ్యూల్‌ ఎలా ప్రకటిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.

రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నోటిఫికేషన్లను బేరీజు వేసి ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందుల కోణంలో చూడాలని హితవు చెప్పింది. దీనిపై మోహన్‌రెడ్డి కల్పించుకుని, రిజర్వేషన్‌ అభ్యర్థులు పోటీకి కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేదన్నారు. ఆ అభ్యర్థులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని నింపి గెజిటెడ్‌ అధికారి లేదా డిప్యూటీ తహసీల్దార్‌ స్థాయి అధికారితో సంతకం చేయిస్తే చాలన్నారు. రిజర్వేషన్లను ఖరారు చేసేది ఈసీ కాదని, రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు.

అందరికీ అన్నీ తెలుసు: ఎన్నికల్లో పోటీకి ముందు నుంచే ఆసక్తిగా ఉంటారని, ఈ ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరముండదని, కింది స్థాయిలో నేతలకు అన్నీ తెలుసని మోహన్‌రెడ్డి వాదించారు. అయితే ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. మున్సిపల్‌ చట్టంలో ఎలా ఉందో శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాలని, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాక రిజర్వేషన్లు ప్రకటించారని కోర్టు వ్యాఖ్యానించింది. మ్యాన్యువల్‌ ప్రకారమే చేశామని మోహన్‌రెడ్డి చెప్పారు.

ఆయా కులాల వారు తమ వార్డుల్లో లేదా మున్సిపల్‌ పరిధిలో ఎంతమంది ఉన్నారో పోటీ చేయబోయే నేతలకు తెలుస్తుందని, ఈ నెల 4న ఓటర్ల జాబితా సిద్ధంగా ఉంచామన్నారు. షెడ్యూల్‌ తర్వాత ఓటర్ల జాబితా ప్రకటన ఆ తర్వాత రిజర్వేషన్ల ఖారారు చేయడం ద్వారా తగిన సమయం ఇచ్చినట్లు కాబోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ మ్యాన్యువల్‌ ప్రతి అందజేయాలని ధర్మాసనం కోరగా.. తన వద్ద లేదని బదులు చెప్పడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాన్యువల్‌తో పాటు ఎన్నికలకు సంబంధించి మున్సిపల్‌ చట్ట నిబంధనలను తమకు నివేదించాలని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement