సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా నిర్దిష్టమైన ఇతర గుర్తులున్నా వాటినీ లెక్కించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించబోమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు జోక్యం చేసుకొనే అధికారం న్యాయస్థానాలకు ఉందని స్పష్టం చేసింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వులతో ఒక డివిజన్ ఫలితాలు మాత్రమే ఆగిపోయాయని, సోమవారం ఈ కేసును సింగిల్ జడ్జి మొదటి కేసుగా విచారించనున్న నేపథ్యంలో అభ్యంతరాలుంటే అక్కడే చెప్పుకోవాలని సూచించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరికాదని ఎస్‌ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదించగా... ఏ గుర్తు ఉన్నా ఆ బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కిం చాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీచేయడం నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పీల్‌కు అంత తొందరెందుకు?
‘‘ఎన్నికల ప్రక్రియను ఆపాలని సింగిల్ జడ్జి ఆదేశించలేదు. అన్ని డివిజన్ల ఫలితాలు ఆపాలని ఆదే శించలేదు. బ్యాలెట్ పేపర్‌పై ఏ గుర్తులు ఉన్నా లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్ అర్ధరాత్రి ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. 150 డివిజన్లకుగాను 149 డివిజన్ల ఫలితాలు శుక్రవారమే వెలువడ్డాయి. ఒక డివిజన్ ఫలితం మాత్రమే ఆగింది. దాని వల్ల ఎటువంటి నష్టం లేదు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఎన్నికల సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల కొన్ని కేంద్రాల్లో ఓటర్లకు స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులను ఇచ్చి తప్పిదం చేశారు.
స్వస్తిక్ గుర్తుకు బదులుగా పోలింగ్ కేంద్రం నంబర్ సూచించే గుర్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్‌పై ఏ రకమైన గుర్తులు ఉన్నాయనే విషయంలో స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల కమిషన్‌ను కౌంటర్ దాఖలు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రెండు రోజులు కూడా ఆగకుండా అంత అత్యవసరంగా ఎందుకు అప్పీల్ దాఖలు చేశారు? ఆ ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సింగిల్ జడ్జి దగ్గరే నివేదించండి’’అని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment