రైల్వే, ఆర్టీసీలకు కాసుల వర్షం
♦ దసరా సర్వీసులతో రైల్వేకు రూ.8 కోట్లు...
♦ ఆర్టీసీకి రూ.1.25 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీ రవాణా సంస్థలకు కాసుల వర్షం కురిపించింది. దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.8 కోట్లు, ఆర్టీసీకి రూ.1.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ ఆక్యుపెన్సీ సైతం భారీగా పెరిగింది. గతేడాది దసరా సందర్భంగా 82 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ఈసారి 94 శాతానికి చేరింది. 3,500 రెగ్యులర్ బస్సులకు అదనంగా 3,060 బస్సులు నడిపింది.
మరోవైపు రైళ్లలోనూ ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఎక్స్‌ప్రెస్‌లే కాకుండా ప్యాసింజర్లు సైతం ప్రయాణికులతో పోటెత్తాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి రోజూ నడిచే వందకు పైగా ప్రధాన రైళ్లతో పాటు దసరా సందర్భంగా మరో 52 రైళ్లు అదనంగా నడిపారు. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 150 రైళ్లు అదనంగా వేశారు. గత ఏడాది దాదాపు 12 లక్షల మంది సొంతూళ్లకు తరలివెళ్లగా... ఈ దసరాకు ఆ సంఖ్య 15 లక్షల వరకు ఉందని అంచనా.
తిరుగు ప్రయాణంలోనూ రద్దీ...
దసరా సెలవులు ముగించుకొని తిరిగి నగరానికి వచ్చే ప్రయాణికులతో గురువారం రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు రద్దీగా కనిపించాయి. గౌతమి, నారాయణాద్రి, గరీబ్థ్,్ర చార్మినార్ ఎక్స్‌ప్రెస్, పుష్‌ఫుల్ తదితర రైళ్లు ఆలస్యంగా నడిచాయి.