బస్టాండ్‌లలో రూపాయికే వైద్యం | One rupee clinic scheme to be launched in RTC busstaions | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లలో రూపాయికే వైద్యం

Published Mon, Jul 17 2017 7:25 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

One rupee clinic scheme to be launched in RTC busstaions

ముంబై: లోకల్, మెట్రో రైల్వే స్టేషన్‌ల మాదిరి బస్టాండ్‌లలో కూడా వన్‌ రూపీ క్లినిక్‌ పథకాన్ని ప్రారంభించాలని మహారాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ నిమగ్నమైంది. ముంబైలో లోకల్‌ రైల్వే స్టేషన్‌లలో లభిస్తున్న రూపాయికే వైద్యం పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఇటీవల మెట్రో రైల్వే స్టేషన్‌లలో కూడా ప్రారంభించారు.

దీంతో ఆర్టీసీ యాజమాన్యం దీనిపై దృష్టి సారించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బస్టాండ్లలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే మిగతా బస్టాండ్‌లలో కూడా చేపట్టే ప్రయత్నం చేయనుంది. ఈ వైద్య సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ శాతం ఉపయోగపడనున్నాయి.

24 గంటలు, రెండు షిప్టుల్లో ఇద్దరు డాక్టర్లు(ఒకరు ఎంబీబీఎస్, ఒకరు ఎండీ) బస్టాండ్‌లలోని క్లినిక్‌లో వైద్య సేవలందిస్తారు. అలాగే ఔట్‌ పేషంట్‌ డిపార్టుమెంట్‌ (ఓపీడీ), పూర్తి శరీర పరీక్షలు, రక్త పరీక్షలు, మార్గదర్శనం, జన జాగృతి వర్క్‌షాపు, గుండె, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ తదితరాలకు ప్రత్యేక విభాగాలు, అత్యవసర విభాగాలలో వైద్య సేవలందిస్తారని ‘వన్‌ రూపీ క్లినిక్‌’ చీఫ్‌ కార్యనిర్వాహక అధికారి డాక్టర్‌ రాహుల్‌ ఘులే పేర్కొన్నారు.

ఈ పథకంపై ఇటీవల రవాణ శాఖ మంత్రి దివాకర్‌ రావుతో అధికారులు భేటీ అయ్యారు. అందుకు ఆయన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ శాతం ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉండాలని రాహుల్‌కు సూచించారు. లోకల్‌ రైల్వే స్టేషన్‌లలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేవలం 45 రోజుల్లో 13 వేలకుపైగా ప్రయాణికులు లబ్ధి పొందారు. ప్రస్తుతం ఈ వైద్య సేవలు నగరంలోని భైకళ, దాదర్, కుర్లా, ఘాట్కోపర్, విక్రోలి, భాండూప్, ములుండ్, థాణే, కల్వా, ఉల్లాస్‌నగర్, అంబర్‌నాథ్, బద్లాపూర్, వడాల రోడ్, పన్వేల్, సైన్, టిట్వాల, గోవండీ, చెంబూర్, మాన్‌ఖుర్ద్‌ రైల్వే స్టేషన్లలో లభిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement