సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఆర్టీసీ కొత్త బస్టాండ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు బస్టాండ్లు పాతబడిపోయాయి. పైకప్పులు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కనీసం 40 వరకు బస్టాండ్లను పునర్నిర్మించాల్సి ఉంది. కానీ నిధుల సమస్యతో దశలవారీగా బస్టాండ్లను పునర్నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐదు కొత్త బస్టాండ్ల నిర్మా ణం చేపట్టాలని భావిస్తోంది. ఇటీవలే ఖమ్మంలో పాత బస్టాండును అలాగే ఉంచి నగర శివారులో కొత్త బస్టాండును ఆర్టీసీ సొంత నిధులతో నిర్మించింది.
తాజాగా సిద్దిపేటలోని పాత బస్టాండును కూల్చేసి దాని స్థానంలో రూ.6 కోట్ల ప్రభుత్వ నిధులతో కొత్త బస్టాండు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అలాగే పాతబడి పెచ్చులూడుతున్న దుబ్బాక, గద్వాల పట్టణ బస్టాండు భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ఇందుకు మొత్తంగా రూ.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులను ప్రభుత్వ నిధులతోనే చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పునర్నిర్మించినందున అక్కడికి భక్తుల తాకిడి పెరిగింది.
ప్రస్తుతం ఉన్న బస్టాండు ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులకోసం సేవలందించేందుకు అనువుగా లేదు. దేవాలయ విస్తరణలో భాగంగా బస్టాండు స్థలాన్ని ప్రభుత్వం ఆలయం కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో కొత్త బస్టాం డు కోసం పట్టణం వెలుపల స్థలాన్ని కేటాయించింది. అక్కడ దాదాపు 10 ప్లాట్‌ఫామ్‌లతో కొత్త బస్టాండును నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ప్రభుత్వమే నిధులు సమకూర్చనుంది.
కోస్గిలో విస్తరణ..
ఇక ఇరుకుగా మారి ఏమాత్రం యోగ్యంగా లేకపోవటంతో నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని బస్టాండును విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భవనానికి ఆనుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు కోటి రూపాయల వ్యయం కానుంది. ఈ మొత్తంలో సగం నిధులను ప్రభుత్వం ఇవ్వనుండగా, మిగతా సగం మొత్తాన్ని ఆర్టీసీ భరించనుంది. ఆదిలాబాద్ పట్టణ బస్టాండు కూడా అనుకూలంగా లేదు. ఇక్కడ బస్సులు నిలిపేందుకు ప్లాట్‌ఫామ్స్ సరిపోవడం లేదు. దీంతో దాదాపు రూ.85 లక్షల వ్యయంతో అక్కడ కొత్త ప్లాట్‌ఫామ్స్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment