
రేగోడ్(మెదక్): అది మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని ఎంపీపీ చాంబర్. స్థానిక ఎంపీడీఓ బస్వన్నప్ప శుక్రవారం ఉదయం 11 గంటలకు తాపీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చీరాగానే ఎంపీపీ చాంబర్‌లోకి వెళ్లి టేబుల్‌పై ఇలా పడకేశారు. హాయిగా దినపత్రిక చదువుతూ కాలక్షేపం చేశారు. 11.19 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి ‘సాక్షి’ చేరుకోగా ఎంపీడీఓ చాంబర్‌కు గడియ పెట్టి ఉంది.
ఎక్కడికి వెళ్లారని ఆరా తీయగా ఎంపీపీ చాంబర్‌లో ఉన్నారని తెలిసింది. 11:20 గంటలకు ఎంపీపీ చాంబర్ తలుపు తీసి చూడగా.. ఎంపీడీఓ బస్వన్నప్ప ఇదిగో ఇలా కనిపించారు. వివిధ పనుల నిమిత్తం అక్కడికి వచ్చిన వారంతా ఇది చూసి ముక్కున వేలేసుకున్నారు. అధికారి నిర్వాకాన్ని ‘సాక్షి’తన కెమెరాలో క్లిక్‌మనిపించగా, ఎంపీడీఓ టేబుల్‌పై నుంచి లేస్తూ.. ‘మీరిలా ఫొటో తీయడం మంచిది కాదు. నాకు ఆరోగ్యం బాగా లేక పడుకున్నా’అని దాటవేసే ప్రయత్నం చేశారు.