- ఎమ్మెల్యే బాబూమోహన్
- నేరడిగుంటలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
జోగిపేట: నియోజకవర్గంలోని 40వేల ఎకరాలకు సింగూరు జలాలను అందించి తీరుతామని అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సోమవారం అందోలు మండలం నేరడిగుంట పంచాయతీ పరిధిలోని మక్తగూడెం చెరువులో మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సేద్యానికి నీరందించేందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులతో పనుల విషయమై సమీక్షించారన్నారు.
చెరువు పూడికతీత పనులను రాజకీయాలకు అతీతంగా, ఐక్యంగా గ్రామస్తులంతా కలిసి పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందని, చెరువులో నీరుంటే చేతివృత్తుల వారికి కూడా పని దొరుకుతుందన్నారు. మక్తగూడెం చెరువుకు ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసిందని, అవసరమైతే నిధులను పెంచేందుకు మంత్రి హరీష్‌రావుతో మాట్లాడతానన్నారు. చెరువు అలుగు, తూములను కూడా మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పూడిక తీసిన మట్టిని పొలాల్లో వేసుకోవాలని, మిగతా మట్టిని గ్రామంలోని గుంతలు పూడ్చడం, పాడుపడిన బావులను పూడ్చడం, రోడ్లు వేసుకోవడం వంటి పనులకు వినియోగించుకోవాలన్నారు.
పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీ
మక్తగూడెం చెరువులో మిషన్ కాకతీయ పనులను సోమవారం ప్రారంభించారు. చెరువు వద్దకు ఎమ్మెల్యే బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డితో పాటు నాయకులు, కార్యక ర్తలు, అధికారులు, గ్రామస్తులు కాలినడకన వెళ్లారు. చెరువు వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డపారతో మట్టి తవ్వితీసి తట్టల్లో నింపి ట్రాక్టర్‌లో పోశారు.
అనంతరం జేసీబీ నడిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేశ్, తహశీల్దార్ నాగేశ్వర్‌రావు, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ జలంధర్, ఏఈ బాలగణేష్, సర్పంచ్ కిష్టయ్య, ఎంపీటీసీ సంగమేశ్వర్, నగర పంచాయతీ అధ్యక్ష, కార్యదర్శులు డీబీ నాగభూషణం, గోపాల్, పార్టీ సీనియర్ నాయకులు లింగాగౌడ్, కౌన్సిలర్ శ్రీకాంత్, పి.లక్ష్మణ్ పాల్గొన్నారు.
40 వేల ఎకరాలకు సాగునీరు
Published Tue, Apr 21 2015 1:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement