ఎరువు.. బరువు!
- గోడౌన్లలో 24 వేల మెట్రిక్ టన్నులు నిల్వ
- వర్షాభావంతో భారీగా తగ్గిన వినియోగం
- ఆందోళలో వ్యాపారులు, రైతులు
కడప అగ్రికల్చర్ : ఎరువుల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చోవడం, సరిగా పంపిణీ కాలేదని రైతుల ధర్నాలు.. రాస్తారోకోలు, వ్యవసాయాధికారుల సంజాయిషీలు.. ప్రతి ఏడాది ఖరీఫ్‌లో కనిపించే దృశ్యాలు. ఈ ఏడాది వైఎస్‌ఆర్ జిల్లాలో ఆ దృశ్యాలు కనిపించడం లేదు. రైతుల నుంచి ఎరువుల కొరతనే మాటే వినపడటం లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో ఎరువులు భారంగా మారిపోయాయి. వ్యాపారం లేకపోవడంతో అటు మార్క్‌ఫెడ్, ఇటు ప్రయివేటు డీలర్లు ఎరువులు కొనుగోలు చేయలేమని చేతులెత్తేశారు. జిల్లాలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఆశించిన స్థాయిలో సాగు కాలేదు. దీంతో ఎక్కడి ఎరువులు అక్కడే నిలిచిపోయాయి.
కంపెనీల నుంచి దుకాణాల వారు ముందుగా కొనుగోలు చేసిన ఎరువులను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు కూడా ఖరీఫ్ పంటల సాగు కోసం ముందుగా కొనుగోలు చేసి విత్తన సమయంలో వాడటానికి తెచ్చి పెట్టుకున్న ఎరువులు కూడా ఇళ్లలో నిల్వ ఉండిపోయాయి. ఎరువుల దుకాణాల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో మార్కెఫెడ్, ఇతర గోడౌన్లలో కూడా ఎరువుల నిల్వలు మూలుగుతున్నాయి. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ మొదలైందంటే అటు వ్యవసాయాధికారులు, ఇటు దుకాణదారుల్లో వణుకుపుట్టేది. కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా ఇతర ఎరువులు దొరకని పరిస్థితి నెలకొనేది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి బలమైన వ ర్షాలు కురవక పోవడంతో ఎరువులను అడిగే వారే కరువయ్యారని వ్యాపారులు అంటున్నారు. ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పత్తి పంటల సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1.60 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా కేవలం 25,743 హెక్టార్లలోనే సాగయ్యాయి.
75 శాతం తగ్గిన ఎరువుల విక్రయాలు
సాధారణంగా ఈ పాటికి పంటల సాగు బాగా ఊపందుకుని ఎరువుల వినియోగం పెరిగేది. మరీ జూలై నెలలో ఎరువుల కొరత పట్టిపీడించేది. జూన్ ప్రారంభంలో విత్తనాలు వేసిన అనంతరం కలుపు తీసి పై పాటుగా ఎరువులను, రెండో విడత పంటల సాగును రైతులు చేపడితే ఎరువులు అందించడం భారంగా ఉండేది. ఈ సమయంలో కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా, పొటాష్‌ను ఎక్కువగా వినియోగించేవారు. మొత్తంగా ఈ సారి ఎరువుల వినియోగం దాదాపు 75 శాతం తగ్గిందని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. తక్కువ పదును వల్ల విత్తిన విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలకెత్తినవి ఎండిపోతుండటం వల్ల ఎరువుల గురించి రైతులు ఆలోచించడం లేదు.
మార్క్‌ఫెడ్‌లో భారీగా నిల్వలు
ఎరువులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం, అవసరం మేరకు ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీ)కు సరఫరా చేయడం మార్క్‌ఫెడ్ బాధ్యత. అయితే ఇప్పటికే కొనుగోలు చేసి ఉంచిన నిల్వలు గోడౌన్లలో పేరుకుపోయాయి. అయినా కూడా ఇండెంట్ మేరకు ఎరువుల కంపెనీలు అమాంతం పంపుతూనే ఉన్నాయి. గోడౌన్లు నిండిపోతుండడంతో ఎక్కడ పెట్టాలో దిక్కుతోచడం లేదని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజరు వెంకటసుబ్బారెడ్డి తలపట్టుకుంటున్నారు. ఇప్పటికీ జిల్లాలోని 12 ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రూ.19 లక్షల బకాయిలున్నాయని జీఎం తెలిపారు. అటు పాతబకాయిలు రాక, ఇటు ఉన్న ఎరువులు అమ్ముడుపోక దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువులు అమ్ముడుపోవడం కష్టమని సంస్థ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.