బెండ ... ధర బెంగ...
- రైతుకు రూ. రెండే...
- రైతుబజారులో రూ.7
- బహిరంగ మార్కెట్‌లో రూ.20
- పంట దున్నేస్తున్న వైనం
నూజివీడు : ఇప్పటి వరకు టమోటాకు ధర లేక పారబోయడం చూశాం. అయితే నేడు బెండకాయ రైతుల పరిస్థితీ అలాగే తయారైంది. ఒకవైపు రైతుబజారులో కిలో రూ.7, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.20 చొప్పున వ్యాపారులు విక్రయిస్తుండగా, పండిస్తున్న రైతుకు మాత్రం రూ.2 కంటే ఎక్కువ రావడం లేదు. దీంతో కోత ఖర్చులు రాక బెండతోటలను రైతులు దున్నించేస్తున్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో విఫలం కావడం వల్లనే రైతులు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంటలకు ధర లభించడం లేదు.
దీంతో పెట్టుబడులు పెట్టి ఏడాదికేడాదికి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు మాత్రం లాభపడుతున్నారు. నియోజకవర్గంలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో దాదాపు 5వందల ఎకరాల్లో బెండతోటలను సాగుచేశారు. వీరిలో ఎక్కువ శాతం మంది కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నవారే. ఎకరాకు రెండు పంటలకైతే రూ.25వేలు, ఒక పంటకైతే రూ.15వేలకు కౌలుతీసుకుని, కూరగాయలను పండిస్తున్నారు.
పెట్టుబడితో సహా రూ. 30 వేలకు చేరుకుంటుంది. కాయ దిగుబడి వచ్చే ముందు వరకు కిలో రూ.15నుంచి రూ.25ల వరకు ధర పలికిన బెండకాయలు, దిగుబడి వచ్చేనాటి నుంచి రోజురోజుకు తగ్గుతూ వచ్చి రెండు రోజులుగా కిలో రూ.2కు పడిపోయింది. దీంతో కోతకూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితిలో ముసునూరు మండలం చింతలవల్లి, నూజివీడు మండలం హనుమంతులగూడెం ప్రాంతాల్లో బెండతోటలను దున్నేస్తున్నారు.