వంటకు తంటా !
శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నివర్గాలనూ అవస్థల పాల్జ్జేసి న హుదూద్ తుపాను ప్రభావం ఇప్పుడు వంట గ్యాస్‌పై పడింది. గ్యాస్ కొరత ఉండడంవతో బుక్ చేసిన తరువాత సిలిండర్ అందేసరికి నెల రోజులు పైబడుతుండడంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు. మహిళలు వంటకు తంటా పడుతున్నారు. గత నెల 12వ తేదీన సంభవించిన తుపాను కారణంగా జిల్లాకు రావాల్సిన వంట గ్యాస్ సరఫరా గణనీయంగా తగ్గింది. గ్యాస్ కంపెనీలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి పడిపోయింది. ఫలితంగా కావాల్సినంత స్థాయిలో గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి. గతనెల రెండో తేదీన అన్‌లైన్‌లో బుక్ చేసిన వినియోగదారులకు ఇప్పటికీ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ వినియోగదారులు తిరుగుతున్నారు. జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండియన్ తదితర గ్యాస్ ఏజన్సీలు 20 ఉన్నాయి.
వీటిలో దీపం, డబల్ సిలిండర్, ఇతర వినియోగదారులు కలిపి 3.72 లక్షల మంది ఉన్నారు. వీటిలో ఇప్పటి వరకు ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం 2.85 లక్షల సర్వీసులకు జరిగాయి. ఇందులో 1.21 ల క్షలు కనెక్షన్లు దీపం పథకంలో ఉండగా వీటిలో ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం చేసినవి 82 వేలు ఉన్నాయి. జిల్లాలో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్లు అన్నీ కలిపి 2.85 లక్షలు ఉన్నాయి. వీరిలో చాలామంది గ్యాస్ బుక్ చేసినా సిలిండర్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకి సుమారు 5000 సిలిండర్లను వినియోగదారులు వాడుతున్నారు. గ్యాస్ అయిపోయిన వారంతా తిరిగి బుక్ చేసుకొని సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు. గ్యాస్ కొరత విషయూన్ని జిల్లా సివిల్ సప్లై ఆధికారి సీహెచ్ ఆనంద కుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తుపాను వల్ల ఇబ్బంది వచ్చిందన్నారు. ప్రస్తుతం సరఫరా ప్రారంభమైందని, మరో పది రోజుల్లో పరిస్థితి చక్కబడుతోందన్నారు.