
అందాల సీమకు దారేదీ?
- పర్యాటకంపై తుపాను ప్రభావం
- తీవ్రంగా దెబ్బతిన్న కేకే లైన్
- అరకు వెళ్లే దారి లేక టూరిస్టుల నిరాశ
- ఏటా ఈ సీజన్‌లోనే రద్దీ
చీకటి గుహల్లోంచి రైలు వెళుతుంటే గెంతులేయాలని, గోల చేయాలని ఆశ పడతారు... వయ్యారి భామలా ఒంపులు తిరుగుతున్న రైల్వే ట్రాక్‌ని కిటికీల్లోంచి తొంగి చూస్తూ ముగ్ధులవుతారు... అందాల అరకులో వలిసె పూల అందాలను, ఉరకలెత్తే జలపాతాలను సందర్శించి సమ్మోహితులవుతారు... దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది టూరిస్టులు ప్రతి ఏటా శీతాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు.
అక్టోబరు మొదటి వారంలో ఎంతో ఆశావహంగా మొదలైన పర్యాటక సీజన్ హుదూద్ తుపానుతో కుదేలైంది. కేకే లైన్ దెబ్బతిని అరకు వెళ్లే మార్గం లేకపోవడం, సందర్శనీయ స్థలాలన్నీ కళావిహీనంగా మారడంతో ప్రస్తుతం టూరిస్టుల తాకిడి గణనీయంగా తగ్గింది. అందాల సీమను సందర్శించే దారి లేక పర్యాటకుల్లో నిరాశ ఆవహించింది.
విశాఖపట్నం సిటీ: అందాల విశాఖను చూసేందుకు అంతా తరలివచ్చేవారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టేవారు. సుందరమైన మహా నగరాన్ని చూసి పులకించేందుకు పొరుగు రాష్ట్రాల ప్రజలు పోటీ పడేవారు. శీతగాలులు వీచాయంటే చాలు.. బెంగాలీలు పెద్ద ఎత్తున వచ్చి పక్షుల్లా విశాఖలో వాలేవారు. వచ్చేపోయే వారి రాకతో రైల్వే స్టేషన్ కళకళలాడేది. రిజర్వేషన్ బెర్తుల కోసం నగర ప్రజలతో సమానంగా రాష్ట్రేతరులు పోటీపడేవారు. అరకు వెళ్లే రైలు నిండా ఇతర రాష్ట్రాలవారే వుండేవారు. కానీ ఈసారి ఆ కళ కనిపించడం లేదు.
అరకు రైలు లేదని తెలుసుకుని వేలాదిమంది పర్యాటకులు నగరానికి రావడం మానేశారు. వెళ్లిపోయే వారితో రద్దీగా వుండే రైళ్లు సైతం ఇప్పుడు పర్యాటకులు లేక బోసిపోతున్నాయి. అప్పటిలాగే కొన్ని రైళ్లకు రద్దీ వున్నా అది నగరవాసులను ఇబ్బంది పెట్టే స్థాయిలో లేదు. వాస్తవానికి గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పర్యాటకులు 20 శాతం పెరిగినట్టు రైల్వే వర్గాలు ముందుగానే అంచనా వేశారు.
విశాఖ అందాలంటే బెంగాలీలు మనసు పారేసుకుంటారు. బెంగాలీలు ఎగబడుతుండడంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారంతా శీతాకాలంలో విశాఖ నగర అందాలను ఆస్వాదించేందుకు పోటీ పడుతుంటారు. పచ్చ పరికిణీ ఆరేసినట్టుగా వుండే అరకు అందాలను కొండా కోనల్లోంచి మెలికలు తిరుగుతూ గుహల్లోంచి మెల్లగా జారుకునే రైల్లోంచి చూడాలని అంతా కలలు కంటారు. ఎన్నిసార్లు చూసినా ఇలాంటి సుందర దృశ్యాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా వుంటాయి.
అందుకే బెంగాలీలు ఏటా విశాఖ పర్యటనకు వస్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్రేతరులు పూర్తిగా విశాఖకు రావడం మానేశారు. దాదాపు 50 శాతం మంది ప్రయాణికులు విశాఖకు రావడం మానేశారని వాల్తేరు రైల్వే అంచనా వేస్తోంది. ఇంత దారుణంగా ప్రయాణికుల సంఖ్య పడిపోవడానికి హుదూద్ ఒక్కటే కారణమని తేల్చారు. అక్టోబర్ మాసంలో మూడు రోజులపాటు రైళ్లు పూర్తిగా రద్దు కావడం ఒక ఎత్తయితే ఆ తర్వాత విశాఖ అందాలన్నీ కనుమరుగయ్యాయని తెలియడంతో పర్యాటకులు రావడం మానేశారని భావిస్తున్నారు.
2013 అక్టోబర్ ఒకటో తేదీ-10వ తేదీ మధ్య విశాఖ స్టేషన్‌లో అమ్ముడైన టికెట్లు 2.72 లక్షలు కాగా 2014లో అదే రోజుల్లో 3.25 లక్షల మందికి పెరిగారు. అంటే దాదాపు 20 శాతం మంది ప్రయాణికులు పెరిగినట్టు అంచనా వేశారు.
2013 అక్టోబర్ మాసంలో 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య 3.02 లక్షల మంది ప్రయాణిస్తే 2014 అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య కేవలం 1.58 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే దాదాపు 47 శాతం మంది ప్రయాణికులు తగ్గినట్టు అంచనా వేశారు. పర్యాటక సీజన్‌పై తుపాను బాగా ప్రభావం చూపిందనడానికి ఇది ఉదాహరణ