సీఎం సారూ.. ఏమిస్తారు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు జిల్లా పర్యటనలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. సరిగ్గా వంద రోజుల క్రితం మెట్ట ప్రాంతంలో ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. జూలై 16, 17 తేదీల్లో గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రైతులతో ముఖాముఖి పేరిట చంద్రబాబు పర్యటించారు.
హుదూద్ తుపాను కారణంగా రద్దయిన జన్మభూమి కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ ఈనెల 1నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి-మాఊరు కార్యక్రమాలు నిర్వహించాలని గురువారం జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు తొలి పర్యటనను పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్న సీఎం ఈసారి డెల్టా ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రుణమాఫీ జాప్యంపై అన్నిచోట్లా రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనలో ఎక్కడా అపశృతులు దొర్లకుండా ముందుజాగ్రత్తగానే ఉండి, పాలకొల్లు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. పార్టీకి బలమైన పునాదులు ఉన్న ఉండి నియోజకవర్గం నుంచే బాబు పర్యటన మొదలు కానుంది.
ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు స్వగ్రామమైన కలవపూడి శివారు గ్రామం మోడిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, జన్మభూమి-మా ఊరు సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం ఇలపకుర్రు, కుమ్మరిపాలెం, దొడ్డిపట్ల గ్రామాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుడతారు. పొలం పిలుస్తోంది, జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా రుణమాఫీ జాప్యం నేపథ్యంలో ఎక్కడా నిరసన ధ్వనులు వినబడకుండా పార్టీ నేతలు తగిన చర్యలు తీసుకున్నారు. నవ్యాంధ్ర సీఎంగా పశ్చిమ డెల్టా ప్రాంతానికి తొలిసారి వస్తున్న బాబుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, సజావుగా పర్యటన సాగిపోవాలన్న ఉద్దేశంతో పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ పెద్దఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు.
వరాలు ఏమిస్తారో..
ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల పర్యటనకు వస్తున్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి, సుడిదోమ కారణంగా పంటలు నష్టపోరుున రైతులకు ఎలాంటి వరాలిస్తారోనని ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడం, శివారు ప్రాంతాలకు నీరందకపోవడం, డ్రెరుున్లను ప్రక్షాళన చేయక వర్షాకాలంలో చేలు ముంపుబారిన పడటం వంటి ఇబ్బందికర పరిస్థితులు డెల్టాలో నెలకొన్నాయి. పారిశ్రామిక ప్రాజెక్టులేవీ ఆ ప్రాంతంలో లేని దృష్ట్యా వాటి ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా ప్రకటన చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజాప్రతినిధుల నుంచి వ్యక్తమవుతోంది. డెల్టా అభివృద్ధి, కీలకమైన ప్రాజెక్టుల ప్రకటన కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
పోలవరం ఊసేది బాబూ
చంద్రబాబు రెండోసారి జిల్లా పర్యటనలోనూ ఎక్క డా పోలవరం సందర్శన లేకపోవడం ఆక్షేపణీయం. ప్రాజెక్ట్ ప్రాంతానికి సీఎం వస్తే పనులు వేగం పుంజు కునే అవకాశం ఉంది. ఎంతో కీలకమైన పునరావాసం, నిర్వాసితుల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు మొదటినుంచీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. డెల్టా ప్రాంతంలో పర్యటిస్తున్న బాబు డెల్టా ఆధునికీకరణ పనులను ఓ సారి స్వయంగా పరిశీలిస్తే అక్కడి పరిస్థితులు ఏమిటనేది అర్థమవుతుంది. సీఎం టూర్ షెడ్యూల్‌ను చూస్తుంటే ఈసారి పర్యటన వల్ల కూడా జిల్లాకు ఒరిగేదేమీ కనిపించడం లేదు.
- డేగా ప్రభాకర్, సీపీఐ జిల్లా శాఖ కార్యదర్శి
వినతి పత్రాలిచ్చి ఏం ప్రయోజనం
చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ అమలు కాలేదు. రుణమాఫీ అమలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లను తొలగించారు. ఐకేపీ కాంట్రాక్ట్ వర్కర్లను కుదించారు. ఇలాంటి సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాల్సి ఉన్నా.. మోసపూరిత చంద్రబాబుకు వాటిని ఇవ్వడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మా పార్టీ పోరుబాట ఎంచుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం.
- మంతెన సీతారాం, సీపీఎం జిల్లా శాఖ కార్యదర్శి
సుడిదోమతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
సుడిదోమ స్వైరవిహారం చేసి వరి చేలను పీల్చిపిప్పి చేస్తోంది. దోమపోటు కారణంగా పైర్లు ఎండిపోతున్నాయి. ఎండు తెగులు వల్ల పిడికెడు ధాన్యం గింజలైనా దక్కే పరిస్ధితి కనిపిం చడం లేదు. కనీసం ఎండుగడ్డిగానైనా పనికి రాని దుస్థితి నెలకొంది. చీడపీడల వల్ల నష్టపోతున్న అన్నదాతలకు పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి లేదు. అందువల్ల ప్రభుత్వమే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
- బి.బలరామ్, అధ్యక్షుడు, రాష్ట్ర రైతు సంఘం