విశాఖలో సీఎం పర్యటన
విశాఖ రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేసి బాధితులను పరామర్శించారు. హుదూద్ తుపాను కారణంగా నగరం అతలాకుతలమైన నేపథ్యంలో సోమవారం విశాఖ వచ్చిన సీఎం నగరంలో వివిధ ప్రాంతాలను సందర్శించి బాధితులను భరోసా ఇచ్చారు. మధ్యాహ్నం అధికారులతో సమీక్ష అనంతరం ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లారు.
ముందు అక్కడ ఉన్న పెట్రల్ బంక్ వద్ద ఆగి పెట్రోల్ సరఫరాపై ఆరా తీశారు. అక్కడ నుంచి హార్బర్‌లోకి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది మహిళలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సాయం చేయడం లేదంటూ నిలదీశారు. అధికారులు వారికి సర్ది చెప్పి అక్కడ నుంచి బయల్దేరారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విజ్ఞప్తి మేరకు అప్పుఘర్ వద్ద ఉన్న వాసవానిపాలెం వెళ్లి అక్కడ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అక్కడ నుంచి ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డు వెళుతూ ఇసుకతోట, స్వర్ణభారతి పెట్రోల్ బంక్ ల వద్ద బారులు తీరిన ప్రజలను పరామర్శిస్తూ కృత్రిమ కొరతను సృష్టించకుండా వినియోగదరారులకు కావాలసినంత పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని బంకు యాజమాన్యాన్ని ఆదేశించారు.
అక్కడ నుంచి గాజువాక, అనంతరం సింథియా వెళ్లారు. సింథియాలో భారీగా చెట్లు పడి ఉండడాన్ని గమనించి వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. డాక్‌యార్డు వద్ద ప్రధాన రహదరిపై పడిపోయిన చెట్లను పూర్తి స్థాయిలో తొలగించకపోవడంపై గాజువాక సీఐపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వెంటనే తొలగించాలని చెప్పారు. రైల్వే స్టేషన్ రోడ్డుకు వచ్చి అక్కడ చెట్లు తొలగిస్తున్న సిబ్బందితో ఇంకా సమయం పడుతుందని ఆరా తీశారు. తిరిగి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.