సీఎం విశాఖ నగర పర్యటన
విశాఖ రూరల్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్ నుంచి బయల్దేరి బీచ్ రోడ్డు మీదుగా ఎంవీపీ కాలనీలో ఉన్న పెట్రోల్ బంద్ వద్ద ఆగి ప్రసంగించారు. బాధితులకు బియ్యం, ఆయిల్, పంచదార, తక్కువ ధరకు కూరగాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి ఇసుకతోట పెట్రోల్ బంక్‌కు వెళ్లి పెట్రోల్ సక్రమంగా సరఫరా చేయాలని ఆ బంక్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
అనంతరం డాక్‌యార్డు, సింధియా, గాజువాక మీదుగా విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. తుపాను న ష్టాన్ని స్వయంగా పరిశీలించడానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికారు. పీఎంతో కలిసి జాలరిపేట, ఆర్‌కే బీచ్ మీదుగా కలెక్టరేట్‌కు వచ్చారు. పీఎం సమీక్ష అనంతరం కాంప్లెక్స్, డాక్‌యార్డు, సింధియా మీదుగా మళ్లీ విమానాశ్రయం వెళ్లి పీఎంకు వీడ్కోలు పలికారు.
తిరిగి సీఎం గాజువాకలో ఉన్న ఏపీట్రాన్స్‌కో కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందని ఆరా తీశారు. అనంతరం హెచ్‌పీసీఎల్‌కు వెళ్లి అక్కడ అధికారులతో కొంత సేపు చర్చించారు. అక్కడ నుంచి బయల్దేరి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న నీటి సరఫరా విభాగానికి వెళ్లి అక్కడి అధికారులతో నీటి సరఫరాపై ఆరా తీసి తిరిగి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.