సీఎం పర్యటన మళ్లీ వాయిదా
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబునాయుడు పర్యటన మరోసారి వాయిదాపడింది. హుదూద్ తుఫాన్ అనంతరం వారం రోజుల పాటు విశాఖలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించిన చంద్రబాబు ఆ తర్వాత 22న విశాఖలో కాగడాల ప్రదర్శనలో పాల్గొన్నారు. గత నెల 31న మళ్లీ పర్యటించి సహాయక చర్యల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షిస్తారని అధికారులు భావించారు. అదేరోజున తుఫాన్ పునరావాసకార్యక్రమాల్లో అత్యుత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందిని సన్మానించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. దీనిని మంత్రులు అధికారికంగా ప్రకటించారు. ఆ పర్యటన రద్దయింది.
నవంబర్ 10న 15 నిమిషాల్లో విశాఖ అంతటా పదిలక్షల మొక్కలునాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది. దీనికి సీఎంతో పాటు పలువురు కేంద్ర,రాష్ర్టమంత్రులు పాల్గొంటారని రాష్ర్టమున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఈమేరకు మూడు రోజుల పాటు సమీక్షలు నిర్వహించారు. కానీ సీఎం పర్యటన మరోసారి వాయిదా పడినట్టు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది.
సొంత పనుల నిమిత్తం కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ జానికిలు వారం రోజుల పాటు సెలవు పెట్టారు. ఇద్దరూ నేరుగా సీఎంతోనే మాట్లాడి సెలవు పొందినట్టు సమాచారం. ఈ నెల 12న సింగపూర్ వెళ్తున్న సీఎం బాబు కూడా విశాఖ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలిసిం ది. చ్చింది. సింగపూర్ నుంచి వచ్చాక 17న విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు.