సీఎం పర్యటన రద్దు
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. వాస్తవానికి ఆయన ఈ నెల 29న ఇక్కడికి రావలసి ఉంది. మధురవాడలో రూ.23 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని సీఎం ఆ రోజు ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఐటీ కంపెనీల సీఈవోలతోనూ సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు చెప్పారు.
ఇంక్యుబేషన్ కేంద్రం పనులు ఇంకా నత్తనడకగా నడుస్తుండడంతో సీఎం వచ్చేనాటికి ఇవి పూర్తయ్యే అవకాశాలు కనిపించలేదు. దీంతో సెప్టెంబర్ అయిదునాటికి పూర్తిస్థాయిలో దీన్ని తీర్చిదిద్దుతామని అధికారులు చెప్పడంతో చివరకు సీఎం పర్యటన రద్దు చేసుకున్నారు. ఆదివారం నగర పర్యటనకు వచ్చిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ కేం ద్రాన్ని సందర్శించారు. పనులు జరుగుతున్న తీరు పరిశీలించారు.
కిందభాగం అంతా సిద్ధంగా ఉన్నప్పటికి పైఅంతస్తులు పనులు ఇంకా పూర్తవలేదు. బయటవైపు అద్దాల బిగింపు కూడా పూర్తికాలేదు. అయ్యన్నపాత్రుడుతో కలిసి ఇవన్నీ పరిశీలించిన మంత్రి పల్లె వచ్చేనెల అయిదునాటికి దీన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తిరిగి సీఎం పర్యటన ఎప్పుడనేది తర్వాత ఖరారుచేస్తామని తెలిపారు.