నీరు లేదు.. కరెంటు రాదు
- సీఎం ఎదుట సమస్యల ఏకరవు
- ముఖ్యమంత్రి విస్తృత పర్యటన
విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం విశాఖలో విస్తృతంగా పర్యటించారు. ఆయన పర్యటనలో అడుగడుగునా ప్రజల వారి సమస్యలపై ఏకరవుపెట్టారు. తాగునీరు, విద్యుత్‌పై చంద్రబాబును నిలదీశారు. కొన్ని సందర్భాల్లో సీఎం ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం చేశాకే విశాఖ నుంచి వెళతానంటూ ప్రతి చోటా ఉద్ఘాటించారు. మధ్యాహ్నం 2.40కి జిల్లా కలెక్టరేట్ నుంచి ముఖ్యమంత్రి బయల్దేరి ముందుగా పెదజాలరిపేటకు వెళ్లారు.
అక్కడ ప్రజలు మంచినీటి గురించి ప్రశ్నించారు. వాసవానిపాలెంలో పర్యటన అనంతరం కైలాసగిరి కొండ మీదకు వెళ్లి అక్కడ తుపానుకు దెబ్బతిన్న డాప్లర్ రాడార్ స్టేషన్‌ను సందర్శించారు. కైలాసగిరిపై తుపాను బీభత్సాన్ని పరిశీలించారు. అక్కడే ఒరిస్సా నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తుండంతో వారితో సీఎం మాట్లాడడంతో పాటు ఆయన కూడా చెట్టును నరికారు. విశాలాక్షినగర్‌లో మూడు చోట్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో అక్కడ కూడా స్థానికులు మంచినీరు, విద్యుత్ కోసం సీఎంను నిలదీశారు.
విశాలాక్షినగర్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డులో ఉన్న రామకృష్ణాపురం వెళ్లగా అక్కడ ప్రజలు తుఫాన్ కారణంగా తమ ఇళ్లు దెబ్బతిన్నాయని, ఇబ్బందులు పడుతున్నామని గగ్గోలు పెట్టారు. అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సెంట్రల్ జైలు వద్ద ఒక వృద్ధురాలికి ముఖ్యమంత్రి సహాయంగా నగదు అందజేశారు. అనంతరం అడవివరం, సింహాచలం వెళ్లారు. బీఆర్‌టీఎస్ రోడ్డు నుంచి వేపగుంట వెళ్లగా అక్కడ కొందరు వాటర్ క్యాన్‌లు పట్టుకుని మంచినీరు ఇప్పించాలని సీఎంను కోరారు.