మూడు రోజులైనా..
- ఇంకా అంధకారంలోనేజిల్లా గ్రామీణ ప్రాంతం
- అడుగడుగునా బాధితుల ఆక్రందన
- నీళ్లు, విద్యుత్ లేక నరకయాతన
- సాయమే లేదని ఆవేదన
తుపాను వెళ్లిపోయింది...గుండెల్లో తుపాను ఇంకా రేగుతూనే ఉంది...
పెనుగాలి సడి లేదు...అది మిగిల్చిన బీభత్సం కళ్లల్లోనే ఉంది...
ఇంట్లో దీపం లేదు...ఇంటి ముంగిట పచ్చని చెట్టు లేదు...
కుళాయి నీరు లేదు...సెల్‌ఫోను మోత లేదు...
తలలు వాల్చేసిన విద్యుత్ స్తంభాలు...తలలు తెగిన మహావృక్షాలు...
రాళ్లు తేలిన రోడ్లు...దారీ తెన్నూ లేని అభాగ్యులు...
విలయం విరుచుకుపడి 48 గంటలు గడిచింది...
పెను విషాదం నుంచి మెల్లగా తేరుకుంటున్న విశోక జిల్లాకు కాస్త ఊరట...
ప్రధాని మోడీ, కేంద్ర నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ విశాఖలో పర్యటించారు. సహాయ చర్యలకు ఊతమిచ్చారు. రూ.వెయ్యి కోట్ల తక్షణ సహాయం ప్రకటించిన ప్రధాని కల్లోల జిల్లాకు కాస్త సాంత్వన కలిగించారు.
సాక్షి, విశాఖపట్నం : పెనుగాలులు ప్రళయం సృష్టించి రెండు రోజులు దాటిపోయింది.. పచ్చని జిల్లాపై భయానక పవనాలు పంజా విసిరి 48 గంటలైపోయింది. కోలుకోలేని దెబ్బ తిన్న ప్రజానీకం తీరని వేదనతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. అయినా సహాయ, పునరావాస చర్యలు ఆశించిన వేగం పుంజుకోలేదన్న వాస్తవం కళ్లెదుట కనిపిస్తోంది. సాయం కోసం నిరీక్షిస్తున్న వారికి గడుస్తున్న ప్రతి నిమిషం దుర్భరంగా తోస్తోంది. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది.
ప్రాణాలు అరచేత పెట్టుకుని పెనుముప్పు నుంచి బయిటపడ్డ తమను ఆదుకునే వాళ్లే కాదు.. కనీసం ఎలా ఉన్నారని పరామర్శించే నాథుడు లేకుండా పోయాడని చాలా మంది ఆక్రోశిస్తున్నారు. ముఖ్యంగా ఏ ఆధారమూ లేని సామాన్యులు తమ దుస్థితిపై కన్నీరుమున్నీరవుతున్నారు. రోడ్డున పడ్డ తమబోటివాళ్లను పట్టించుకోరా? అంటూ మండిపడుతున్నారు. ‘సాక్షి’ బృందం మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సహాయం అందడం లేద ని, పునరావాసం జాడే లేదని చాలా మంది వేదనతో చెప్పారు. గుక్కెడు నీళ్లు దొరక్క నానా యాతనా పడుతున్నామని చాలామంది గోడు వెళ్లబోసుకున్నారు.
బోర్ల వద్ద, నీటి ట్యాంకుల వద్ద బిందెడు నీళ్ల కోసం యుద్ధాలు చేస్తున్న ప్రజలు విపత్తుకు తగినట్టు సాయం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానపానాదులకు కాదు.. కనీసం గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లయినా ఇప్పించండంటూ గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు మొదలవుతుందోనని చాలా మంది ఆతృతగా అడుగుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర సరఫరా పరిస్థితి కాస్త మెరుగుపడ్డా జనం ఇంకా బారులు తీరి నిరీక్షించారు. ముఖ్యంగా అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం, యలమంచిలి, చోడవరం ప్రాంతాల్లో ప్రజల ఇక్కట్లు అలవికానివిగా ఉన్నాయి.