జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు విమర్శనాస్త్రాలు ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. ఆ పార్టీలో జిల్లాకు పెద్ద దిక్కు అయిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ వరకూ విమర్శల తుఫాన్‌లో చిక్కుకున్నారు. బయట పడలేక కొందరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమందిపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఏం చేయాలో ఆ నేతలకు పాలుపోవడం లేదు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ తుఫాన్ దెబ్బకు జిల్లా కకావికలమైన తరుణంలో ఆదుకోవల్సిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో కాలంగడపడంపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. వేలాది మంది ఎన్యుమరేషన్ చేస్తున్నా నష్టాన్ని నేటికీ అంచనా వేయలేని పరిస్థితి నెల కొంది. ప్రజలు పడుతున్న కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. తాగునీటి కోసం, విద్యుత్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేక అనేక గ్రామాల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. జిల్లాకొచ్చిన మంత్రులు, ప్రతిపక్ష నేతలు, అధికారులంతా ఈ నష్టాలు, కష్టాలను చూసి చలించిపోయారు. కానీ, జిల్లా ప్రజలు ఎన్నుకోవడంతో కేంద్రమంత్రైన పూసపాటి అశోక్ గజపతిరాాజుకు మాత్రం తుఫాన్ తీరం దాటిన తరువాత జిల్లాకొచ్చి, డీఆర్‌డీఏలో సమీక్ష చేసి, సీఎం పర్యటనలో పాల్గొని వెళ్లిపోయారు.
ఆ తర్వాత పత్తాలేరు. ఇదే జిల్లా ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. సాక్షాత్తు సీఎం రెండు సార్లు జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించే ప్రయత్నం చేశారు. కేబినెట్ దాదాపు ఇక్కడికొచ్చి పర్యటించి వెళ్లింది. కమిషనర్, డెరైక్టర్ హోదా గల అధికారులైతే లెక్క లేదు. వెళ్లి వస్తున్నారు. జిల్లా యంత్రాంగమైతే అదే పనిలో నిమగ్నమయ్యింది. కానీ, అశోక్ గజపతిరాజు ఇతర జిల్లా మంత్రులు, నేతలొచ్చి వెళ్లినట్టుగా జిల్లాలో పర్యటించారు. సీఎం హాజరవ్వడంతో భోగాపురంలో రెండు పర్యాయాలు పర్యటించారు.
ఆ తర్వాత విజయనగరం టౌన్‌లో గడిపేశారు. సీఎం జిల్లా దాటిన తర్వాత ఎంచెక్కా ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో ఎవరేం చేస్తున్నారో ఆరాతీసే నాథుడు కరువయ్యాడు. పర్యవేక్షణ ఏమీ లేకపోవడంతో నేటికీ పునరుద్ధరణ పనులు కొనసా....గుతున్నాయి. ఇప్పుడిదే విమర్శలకు తావిచ్చింది. ఇలాంటప్పుడు జిల్లాలో ఉండకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గంలో కనీస పరామర్శ చేయలేదని, తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలని విజయనగరం పార్లమెంట్ పరిధిలో సర్వత్రా విన్పిస్తోంది. చెప్పాలంటే జనాగ్రహం పెల్లుబుకుతోంది. బయటికి చెప్పలేకపోయనా టీడీపీ నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
మృణాళిని పదవి ఊడగొట్టడమే లక్ష్యంగా పావులు
మంత్రి పదవి వచ్చిన దగ్గరి నుంచి అక్కుసుతో ఉన్న ఎమ్మెల్యేలు తమ స్పీడు పెంచారు. జిల్లాలో ఏళ్లతరబడి రాజకీయం చేసిన వారిని కాదని, ఎన్నికలప్పుడు పక్క జిల్లా నుంచి వచ్చిన మహిళకు మంత్రి పదవి ఇస్తారా అని మండి పడుతూ వస్తున్న నేతల కు ఇప్పుడొక మంచి అవకాశం వచ్చి పడింది. ఇన్నాళ్లూ ఆమె సహకరించడం లేదని, నియోజకవర్గంలో ఎవర్ని పట్టించుకోవడం లేదని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీసం గౌరవం ఇవ్వలేదని తమకున్న వర్గీయుల చేత విమర్శనస్త్రాలు సంధించారు. ఇంతవరకు తెరవెనుక ఉండి కథ నడిపించిన ఎమ్మె ల్యేలు ఇప్పుడొక అడుగు ముందుకేసి గ్రూపు రాజకీయానికి తెరలేపారు. తమను కూడా పట్టించుకోవడం లేదని, అధికారులు తమ మాట వినలేదని, తుఫాన్ బీభత్సం పునరుద్ధరణలో కూడా విఫలమయ్యారని, మంత్రిగా సరికాదంటూ పరోక్షంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. మంత్రి పదవి ఊడగొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
ఎమ్మెల్యే గీతపై మున్సిపల్ కౌన్సిలర్లు గుర్రు
ఎమ్మెల్యే మీసాల గీతపై విజయనగరం మున్సిపల్ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో తమను విస్మరిస్తున్నారని, తమకు పేరు రాకుండా చేస్తున్నారని, తమను చిన్న చూపు చూడటంతో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణపైనా అదే తరహాలో మండిపడుతున్నారు. సొంత అజెండాతో నడుస్తూ పార్టీ కౌన్సిలర్లుకు కనీసం విలువ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇవన్నీ తమ దృష్టికొచ్చాయో ఏమో గాని కౌన్సిలర్ల ద్వారా వ్యవహారాలు జరగాలని, ఆ దిశగా వారికొక సూచనలు చేయాలని ఎమ్మెల్యే గీత శనివారం అశోక్ బంగ్లాలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటలకు జరగాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలైనా ప్రారంభం కాకపోవడం, మీసాల గీత హాజరు కాకపోవడంతో ఆమెపై ఉన్న అక్కసునంత గుర్తు చేసుకుని ఎమ్మెల్యే దగ్గర్లో ఉన్నారనగానే దాదాపు 11మంది కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
గ్రూపుగా ఏర్పడి తోటపాలెంలోని ఓ నాయకుడు ఇంట్లో సమావేశమయ్యారు. ఎమ్మె ల్యే నిర్వహించబోయిన సమావేశానికి ఎటువంటి పదవి లేని సైలాడ త్రినాథరావు నాయకత్వం వహించడమేంటని, ఆయన చెప్పినట్టు నడుచుకోవడమేంటని, నియోజకవర్గాన్ని వదిలేసి మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మీసాల గీత పర్యటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ధ్వజమెత్తారు. దీంతో అవాక్కైన ఎమ్మెల్యే గీత కాస్త మనస్థాపం చెందారు. మంత్రి పుల్లారావు హాజరైన కార్యక్రమానికి వెళ్లానని, ఒక్కొక్కసారి ఆలస్యం జరుగు తుందని, అంతమాత్రాన తమకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని గీత ఆవేదన చెందుతున్నారు. కౌన్సిలర్ల ద్వారా అన్నీ జర గాలన్న ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేస్తే వారలా వ్యవహరిస్తే తానేం చేయగలనని, అశోక్ గజపతిరాజు వద్ద ప్రస్తావించి, నా పని నేను చేసుకుంటానంటూ సన్నిహితుల వద్ద వాపోయారు. మొత్తానికి అటు అశోక్, మంత్రి, ఇటు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఒకేసారి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది.
విమర్శల తుఫాన్
Published Sun, Oct 26 2014 1:47 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
Advertisement