టీడీపీలో మరో ఆసక్తికర పోరు | Another interesting Fighting in tdp | Sakshi
Sakshi News home page

టీడీపీలో మరో ఆసక్తికర పోరు

Published Thu, Nov 6 2014 2:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

టీడీపీలో మరో ఆసక్తికర పోరు - Sakshi

టీడీపీలో మరో ఆసక్తికర పోరు

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం టీడీపీలో మరో ఆసక్తికర పోరుకు తెర లేచిందా? ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌లకు చెక్ పెట్టేం దుకు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్‌ను తెరమీదకు తీసుకొచ్చారా? పట్టణ టీడీపీ అధ్యక్షునిగా ఆయన్ని నియమించి మరో పవర్ సెంటర్‌గా తయారు చేయబోతున్నారా?  ప్రసాద్ నియామకం వెనుక వ్యూహం అదేనా?  అంతర్గత పోరు కొనసాగిస్తున్న  ప్రజాప్రతి నిధులను ఏమనకుండా అశోక్ వ్యూహాత్మకంగా పథక రచన చేశారా? అంటే పార్టీ వర్గాల్లో అవుననే ప్రచారం జరుగుతోంది. ప్రసాద్ నియామకంతో ఎవరికి నష్టం జరుగుతుందో తెలియదు గానీ రాజకీయ ఆధిపత్యానికి మాత్రం చెక్ పడటం ఖాయమనే వాదన విన్పిస్తోంది. మున్సిపాల్టీలో పెత్తనం చెలా యించాలని గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మీసాల గీత ప్రయత్నాలు సాగించినట్టు ఆ పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపించింది.
 
 కొన్ని వ్యవహారాల్లో తలదూర్చాని ప్రచారం ఉంది. కాకపోతే, కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ  ఎమ్మెల్యే జోక్యాన్ని తీవ్రంగా  వ్యతిరేకించినట్టు తెలిసింది. ఏళ్ల తరబడి పార్టీని మోసిన మాపై...ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి గీత పెత్తనమేంటని కొంతమంది మధన పడ్డారు. మనసులో మాటను అక్కడా ఇక్కడా కక్కేశారు. ఆ తర్వాత  ఏమైందో తెలియదు గాని మున్సిపాల్టీ విషయంలో  ఎమ్మెల్యే మీసాల గీత జోరు తగ్గింది. దీంతో ఆమె కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతరత్ర సమావేశాల్లో కౌన్సిలర్లతో సంబంధం లేకుండా పాల్గొంటున్నారు. ఇది వారి మధ్య మరింత గ్యాప్ పెంచింది. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ ధ్వజమెత్తుతూ వస్తున్నారు.
 
 సీనియర్ నేతలను కనీసం గౌరవించడం లేదని మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్ల మధ్య కూడా అగాధం చోటు చేసుకుంది. కొంతమంది కౌన్సిలర్లనే చైర్మన్ ప్రోత్సహిస్తున్నారని, వారు చెప్పిన మేరకే నడుచుకుంటున్నారని, మమ్మల్ని కనీసం ఖాతరు చేయడం లేదని పలువురు ఆవేదనకు లోనయ్యారు. అంతేకాకుండా సమర్థవంతమైన పాలన అందించడం లేదని,  తుపాను పునరుద్ధర పనుల్లోనే ఆయన పనితీరు ఏంటో తెలిసిపోయిందని అసమ్మతివాదులు తమ వాదనలను తెరపైకి తెచ్చారు.  ఈ విధంగా అటు, ఎమ్మెల్యే, ఇటు మున్సి పల్ చైర్మన్‌ను ఒకేసారి కౌన్సిలర్లు వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే ఇటీవల అశోక్ బంగ్లాలో జరిగే కౌన్సిలర్ల సమావేశంలో దాదాపు 11మంది కౌన్సిలర్లు తమ అక్కసును తెలియజేశారు. ఎమ్మెల్యే, చైర్మన్‌కు వ్యతిరేకంగా గ్రూపు కట్టి ఆ సమావేశాన్ని బహిష్కరించారు. వారితో తేల్చుకుంటామంటూ ఆ రోజు నుంచి దూరంగా ఉంటున్నారు. మొత్తానికి విషయం ఏదో రకంగా అశోక్ దృష్టికి వెళ్లింది.
 
 దీంతో ఎవర్నీ ఏమనకుండా తన వ్యూహాత్మక వైఖరిని పట్టణ అధ్యక్షునిగా డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ నియామకం ద్వారా తెలియజేశారు.       డాక్టర్ ప్రసాద్ ఎంపిక చేసుకోమని సాక్షాత్తు అశోక్ గజపతిరాజే ఫైవ్ మెన్ కమిటీ సభ్యులైన మీసాల గీత, ప్రసాదుల రామకృష్ణ, ఐవీపీ రాజు, సైలాడ త్రినాథరావు, ఎస్‌ఎన్‌ఎం రాజును ఆదేశించినట్టు తెలిసింది. అందులో భాగంగానే  అశోక్ జిల్లాలో ఉన్నప్పుడే యుద్ధ ప్రాతిపదినక ఒక రాత్రి సమావేశమై పట్టణ అధ్యక్షుడు ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రసాద్‌తో              భవిష్యత్‌లో ముప్పు ఉంటుందని ఓ ఇద్దరు నేతలు కొన్ని కారణాలు వ్యక్తం చేస్తూ తటపటాయించినా అశోక్ ఆదేశాలు అమలు చేయక తప్పదని తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు. బయటికి సభ్యత్వ నమోదకని చెప్పుకొచ్చినా అంతర్గత వ్యూహం మరోటి ఉందని ఆ రోజే గుసగుసలు విన్పించాయి.
 
 ఆ తర్వాత వ్యూహమేమిటన్నది  ప్రచారంలోకి వచ్చింది. అటు ఎమ్మెల్యే, ఇటు మున్సిపల్ చైర్మన్‌కు ప్రత్యామ్నాయంగా వి.ఎస్.ప్రసాద్  ను ముందుపెట్టి చేసి పనులు సాగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికేంటో అవసరమో, ఎవరికి ఏ పనులు కావాలో తెలుసుకుని వాటిని ఎమ్మెల్యే, చైర్మన్ ముందు పెట్టి చేయించేలా, ఒకవేళ కాదంటే అశోక్ ద్వారా చెప్పించి చేయించాలనేది వ్యూహమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిని నమ్ముకుంటే కష్టమే అని భావిస్తూ భవిష్యత్ కోసం మరో నాయకత్వాన్ని తయారు చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా వినిస్తోంది.  ప్రసాద్  మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కావాలని కోరుతూ అధిష్టానానికి దరఖాస్తు చేశారు. మరోవైపు టీడీపీకి చెందిన కొందరి మంత్రులతో ఆయన బంధవులకున్న  సన్నిహిత సంబంధాలతో అధిష్టానం వద్ద కూడా కాస్త పట్టు సాధించినట్టు తెలుస్తోంది. ఏదైతేనేమి డాక్టర్ వీ.ఎస్.ప్రసాద్ పట్టణ టీడీపీలో   మూడో నాయకునిగా నిలిచారు. ఈ పరిణామాలపై ఆ పార్టీలో రసవత్తర చర్చసాగుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement