
చిన్నారిని చిదిమేసిన ‘హుదూద్’
చీపురుపల్లి:ఒక్కగానొక్క కొడుకు పెరిగి పెద్దవాడై తమను ఆదుకుంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశలను హుదూద్ తుపాను చిదిమేసింది. కన్నకొడుకు తుపాను వర్ష బీభత్సానికి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కుపచ్చలారని విద్యా ర్థి గెడ్డలో కొట్టుకుపోయిన విషయం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామానికిచెందిన మోపాడ గొల్ల, రామలక్ష్మిల ఒక్కగానొక్క కొడుకు దుర్గాప్రసాద్(10) ఈ నెల 12న ఆవులను మేపేందుకు పొలంలోకి తీసుకెళ్లాడు. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలిస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం ఇటకర్లపల్లి సమీపంలో గల పెద్దగెడ్డలో దుర్గాప్రసాద్ శవమై తేలాడు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి పరుగుపరుగున చేరుకుని భోరున విలపించారు. జెడ్‌పీటీసీ మీసాల వరహాల నాయుడు చిన్నారి మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి శవపంచనామా నిర్వహించి తిరిగి గ్రామానికి పంపిం చారు. ఇదిలా ఉండగా తుపాను కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలించేందుకు, బాధితులను పరామర్శించేందుకు చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఐటీ శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎక్సైజ్‌శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.