బొబ్బిలి: హుదూద్ తుపాను ప్రభావం నుంచి కార్మికులు ఇంకా తేరుకోలేదు... విద్యుత్తు వ్యవస్థ ఛిన్నాభిన్నం అవ్వడం, ఇప్పటివరకూ పరిశ్రమలకు పుష్కలంగా సరఫరా రాకపోవడంతో వేలాది మంది కార్మికులు గత 15 రోజులుగా పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం కనీసం కార్మికుల గురించి ఆలోచన చేయకపోవడంతో ఏం చేయాలో వారికి ఏమీ పాలుపోవడం లేదు.. ప్రస్తుతం జిల్లాలో దాదాపుగా అన్ని పరిశ్రమలూ మూతపడ్డాయి. విద్యుత్తు సరఫరా లేకపోవడమే ప్రధాన కారణంగా ఉన్నా, యాజమాన్యం కార్మికుడిని ఆదుకోవడానికి జనరేటర్ సాయంతో అయినా మిల్లును నడిపే పరిస్థితి కూడా లేదు..
ప్రధానంగా ఈ ఎఫెక్టు జనపనార మిల్లులపై పడింది. ఈ నెల 12 నుంచి జిల్లాలో ఉండే 9 జూట్ మిల్లులు కూడా మూత పడడంతో దాదాపు 25 వేల మంది కార్మికులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి దాపురించింది. బొబ్బిలిలో ఎస్‌ఎల్‌ఎస్, నవ్యా, జ్యోతి జూట్‌మిల్లులు ఉండగా, విజయనగరంలో అరుణా, ఈస్టుకోస్టు, నెల్లిమర్ల, సాలూరులో, జీగిరాం, కొత్తవలసలో ఉమా, చెన్నాపురాల్లో ఉండే మిల్లులు మూతపడ్డాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల మిల్లులు మూత పడ్డాయి కాబట్టి ఏదో రకంగా మిల్లు తిప్పితే పనిచేస్తాం, లేకపోతే లే ఆఫ్ ఇవ్వాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. తుపాను వల్ల పంటలు పోతే పరిశీలన చేసి పరిహారం ఇస్తున్నారు, ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకుంటున్నారు. తుపాను ప్రాంతాల్లో చెట్లు పడిపోతే అధికారులు స్పందిస్తున్నారు.
మరి వేలాది మంది కార్మికులు పనిలేకుండా పస్తులుంటున్నా ఏ ప్రజాప్రతినిధి గానీ, అధికారి గారీ ఎందుకు స్పందించడం లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యాలతో మాట్లాడి కార్మికుల ఆకలిని తీర్చాలని కోరుతున్నారు. అలాగే బొబ్బిలి, పూసపాటిరేగ, కొత్తవలసల్లో ఉండే వందలాది పరిశ్రమలు కూడా విద్యుత్తు లేకపోవడం వల్ల మూతపడ్డాయి. గ్రోత్‌సెంటరులో ఉండే ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీలతో పాటు అనేక ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులకు పని లేకుండా పోయింది. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణ కార్యక్రమం ఇంకా కొనసాగుతుండడంతో విద్యుత్తు పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం శుక్రవారానికి 11కేవీలైనుపై ఉండే పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేస్తున్నామని డీఈ మసిలామణి చెప్పారు. 33కేవీపై ఆధారపడే వారికి మాత్రం సరఫరా చేయలేదు..కార్మికుల పోరాటానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
కార్మికులకు ‘షాక్’
Published Sat, Oct 25 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement
Advertisement