చెప్పలేని కష్టం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ప్రజలకు చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. ఏటా సంభవిస్తున్న తుపాన్లతో జనం అల్లాడిపోతున్నారు. వరుస తుపాన్ల కారణంగా ఓ వైపు పంట నష్టం, మరోవైపు ఆర్థిక కష్టాలు జనాన్ని చుట్టుముడుతున్నాయి. గతేడాది సంభవిం చిన పై-లీన్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసి వెళ్లిపోగా సుమారు రూ.1000 కోట్ల నష్టం వాటిల్లినట్టు అప్పట్లోనే ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పటికీ ఆ నష్టాన్ని బాధితులకు అందించలేకపోయారు. రీ సర్వే పేరిట కాలయాపన చేస్తున్నారు. రూ.40 కోట్లు వస్తుందని ఎప్పటినుంచో చెబుతున్నా ఇప్పటికీ అధికారికంగా మంజూరు కాలేదని అధికారులే చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ హుదూద్ తుపాను జిల్లాను ఊడ్చేసింది. ఓ వైపు భీకరగాలులు, మరోవైపు భోరున వర్షం వల్ల జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఐదు రోజులవుతున్నా జనం సాధారణ పరిస్థితులకు రాలేకపోయారు.
నిత్యావసరాలకు ఇబ్బందే
తుపాను తాకిడికి జనం ఇక్కట్లు పడుతున్నారు. పాలు, నీళ్లతో పాటు కిరాణసరుకులకూ దూరమయ్యారు. వ్యాపారులూ దోపిడీ చేస్తున్నారు. జనరేటర్, చార్జింగ్, గ్యాస్, పెట్రోల్ ఇలా అన్నింటిలోనూ అందినకాడికి దోచుకుంటున్నారు. రైతుబజార్లలో తక్కువ ధరకే కూరగాయలని ప్రభుత్వం చెబుతున్నా అవి తీసుకుంటే ముక్కుమూసుకోకతప్పదని జనం విమర్శిస్తున్నారు. గురువారం తప్పకుండా విద్యుత్ సరఫరా ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆ పరిస్థితి పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో జనం ఉసూరుమంటున్నారు. మునిసిపాలిటీ ఇస్తున్న నీరు బురదమయంగా మారింది. అంధకారంలో జిల్లా వాసులు మగ్గిపోతున్నారు.
సమన్వయ లోపం మరో శాపం
జిల్లాలోని 11 మండలాల్లో 237 గ్రామాల్లో తుపాను భీకరం సృష్టిం చింది. 19మండలాల్ని వరద ముంచెత్తింది. 237 గ్రామాల్లో ఇంకా వరద నీరు తగ్గలేదని జనం చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పునరావాస కేంద్రాల్లో పరిస్థితి దారుణ ంగా ఉంది. తామున్నామని భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని తీర ప్రాంత వాసులు గుక్కెడు నీళ్లకూ ఇబ్బందిపడుతున్నా నాయకులు, అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ప్రత్యేక బృం దాల పేరిట జిల్లాకు 11 మంది ఐఎఎస్‌లు, జిల్లాకు చెందిన ముగ్గురు మొత్తం 14 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, వైద్య బృందాలు, పోలీసులు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తున్నా తుపాను ధాటికి జనం ఇంకా తేరుకోలేదు. ఈ తరుణంలో నాయకులు, అధికారుల ప్రోటోకాల్ కోసమే జిల్లా అధికారులు తరించిపోవాల్సివస్తోంది. సమీక్షల పేరిట కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినా ఆశించిన స్థాయిలో బాధితులకు భరోసా అందలేకపోయూరనే విమర్శలున్నాయి.
గతంలో పరిస్థితి..
గతేడాది అక్టోబర్ 12న ఏర్పడిన పై-లీన్ తుపాను జిల్లాలోని సుమారు నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపింది. 350 గ్రా మాల్లో 85 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 382 ఇళ్లు పూర్తిగా, 800 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 1200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 442 గ్రామాలు తుపాను ధాటికి గురయ్యాయి. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తొమ్మిది వేల హెక్టార్లలో పంట పొలాలు, ఎనిమిది వేల హెక్టార్లలో ఉద్యాన వనాలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. 84 అడుగుల సామర్ధ్యం ఉన్న వంశధారకు 83.4 అడుగుల మేర నీరు చేరగా, 54 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న గొట్టా బ్యారేజీకి 52 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నాగావళిలో సాధారణ స్థాయికి మించి వరద నీరు చేరింది. 40 చిన్నా, పెద్ద చెరువులు నీటితో నిండిపోగా, 300 లోతట్టు ప్రాంతాల్ని జిల్లా యం త్రాంగం గుర్తించింది. లక్షన్నర ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. తీరం, సరిహద్దుల్లో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలింది.
ఇప్పుడూ అదే పరిస్థితి
11 మండలాల్లో 62 పునరావాస కేంద్రాల్లో 1.32 లక్షల మందిని తరలించారు. 42 పశువులు మృతిచెందగా, చెట్టు పడి ఒకరు మృతి చెం దారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆహారాన్ని సుమారు 33,293 మంది బాధితులకు అందించాల్సి వచ్చింది. ఒడిశాతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీకి చెందిన బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, బోట్లు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. వెద్య బృందాలు వైద్యం అందిస్తున్నాయి. లక్షలఎకరాల్లో వరి, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. వేలా ది ఇళ్లు నేలమట్టమయ్యాయి. మత్స్యకారులు బాగా నష్టపోయారు.